ఏటీఎం విత్‌డ్రా.. ఇకపై మరింత భారం కానుందా?

By narsimha lodeFirst Published Feb 16, 2020, 2:17 PM IST
Highlights

ఏటీఎంల నుండి డబ్బులు డ్రా చేయడం మరింత భఆరం కానుంది.ఇతర బ్యాంకు డెబిట్ కార్డుల వాడకం విషయమై ఇంటర్‌ఛేంజ్‌ ఫీజులను పెంచాలని కోరుతూ ఏటీఎం ఆపరేటర్ల సంఘం ఈ నెల 13న ఆర్బీఐకి లేఖ రాసింది. 

ముంబై: వివిధ బ్యాంకు ఖాతాదారులు తమ ఏటీఎం కార్డులపై అదే బ్యాంకు ఏటీఎంల్లో నగదు విత్ డ్రా చేస్తే ఫీజు వసూళ్లు ఉండవు. కానీ ఒక బ్యాంక్‌ కార్డును వేరే బ్యాంక్‌కు చెందిన ఏటీఎంలో వినియోగించినప్పుడు సదరు ఏటీఎం ఆపరేటర్‌కు ఖాతాదారుడు ఇంటర్‌ఛేంజ్‌ ఫీజు చెల్లించాల్సిన విషయం తెలిసిందే. 

కస్టమర్లకు ఐదు ట్రాన్సాక్షన్లను ఉచితంగా అందిస్తూ.. అంతకుమించి జరిగే లావాదేవీలకు కొంత మొత్తంలో ఫీజు వసూలు చేస్తున్నారు. పరిమితి దాటాక చేసే నగదు ట్రాన్సాక్షన్‌ల(విత్‌డ్రా)పై రూ.15, నగదు రహిత ట్రాన్సాక్షన్‌ల(బ్యాలెన్స్‌ ఎంక్వైరీ)పై రూ.5 చొప్పున ఈ ఛార్జీలు ఉన్నాయి. 

Also read:15 వేల మంది ఫ్రెషర్స్‌కు క్యాప్ జెమినీ జాబ్స్.. కాగ్నిజెంట్ కూడా

ఇతర బ్యాంకు డెబిట్ కార్డుల వాడకం విషయమై ఇంటర్‌ఛేంజ్‌ ఫీజులను పెంచాలని కోరుతూ ఏటీఎం ఆపరేటర్ల సంఘం ఈ నెల 13న ఆర్బీఐకి లేఖ రాసింది. ఏటీఎం భద్రత, నిర్వహణ ప్రమాణాలను ఆర్బీఐ పెంచిన నేపథ్యంలో ఏటీఎంల నిర్వహణ ఖర్చు పెరిగిందని, దీని వల్ల తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఆపరేటర్లు లేఖలో పేర్కొన్నారు. 

ఈ పరిణామాల వల్ల కొత్త ఏటీఎంలను కూడా ఏర్పాటు చేయలేకపోతున్నామని ఏటీఎం ఆపరేటర్లు పేర్కొన్నారు. దేశంలో ఏటీఎంల వినియోగం, వ్యాప్తిని పెంచే ప్రతిపాదనల కోసం గతేడాది ఆర్‌బీఐ ఓ ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. 

ఈ కమిటీ గత డిసెంబర్ నెలలో తమ ప్రతిపాదనలను రిజర్వ్‌ బ్యాంక్‌కు సమర్పించింది. అందులో ప్రధానంగా ఇంటర్‌ఛేంజ్‌ ఫీజులను పెంచాలని సిఫార్సు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 

పట్టణ ప్రాంతాల్లో ఏటీఎం ఇంటర్‌ఛేంజ్‌ ఫీజును రూ.17(నగదు ట్రాన్సాక్షన్స్‌), రూ.7(నగదు రహిత ట్రాన్సాక్షన్స్‌)కు పెంచాలని, ఉచిత ట్రాన్సాక్షన్లను కూడా మూడింటికే పరిమితం చేయాలని సూచించింది. గ్రామీణ, సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో ఈ ఫీజులను రూ.18, రూ.8కి పెంచుతూ.. ఉచిత లావాదేవీలను ఆరుకు పెంచాలని ప్రతిపాదించింది.

ప్రస్తుతం ఈ ప్రతిపాదనలను భారతీయ రిజర్వు బ్యాంక్‌ పరిశీలిస్తోంది. దీనిపై ఆర్‌బీఐ ఏటీఎం ఆపరేటర్లకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే ఖాతాదారుడిపై అదనపు భారం తప్పదని తెలుస్తోంది. 
 

click me!