క్రిప్టో కరెన్సీపై ట్రంప్ బ్యాన్ బట్ ఆస్ట్రేలియాలో అఫిషియల్

By Siva KodatiFirst Published Jul 14, 2019, 3:19 PM IST
Highlights

భారత్, అమెరికాలతో సహా పలు దేశాలు నిషేధం విధించినా కొన్ని దేశాలు క్రిప్టో కరెన్సీ వాడకాన్ని అనుమతినిస్తున్నాయి. ఆస్ట్రేలియాలో సూపర్ మార్కెట్లలో, బ్రెజిల్, అర్జెంటీనా దేశాల్లో బిట్ కాయిన్ల వాడకం కొనసాగుతోంది.

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు బిట్ కాయిన్ వాడకంపై నిషేధం విధించాయి. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. క్రిప్టో కరెన్సీ అసలు నగదే కాదని, క్రిప్టో కరెన్సీ లావాదేవీలు చట్టవిరుద్దమైన కార్యకలాపాలుగా పరిగణిస్తామన్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేసినా.. పలు దేశాలలో క్రిప్టో కరెన్సీకి రోజురోజుకూ విలువ పెరుగుతోంది. ఆస్ట్రేలియా రిటైల్ మార్కెట్‌ దిగ్గజం ఇండిపెండెంట్ గ్రాసర్స్ ఆఫ్ ఆస్ట్రేలియా(ఐజీఏ) క్రిప్టో కరెన్సీని సైతం తాము నగదుగా తీసుకుంటున్నట్టు ప్రకటించింది.

ఆస్ట్రేలియా వ్యాప్తంగా ఐజీఏకు 1400కు పైగా సూపర్‌మార్కెట్‌లు ఉన్నాయి. ఈ సూపర్‌మార్కెట్‌లలో క్రిప్టో కరెన్సీని తీసుకుంటామని ఆస్ట్రేలియా రిటైల్ మార్కెట్‌ దిగ్గజం ఇండిపెండెంట్ గ్రాసర్స్ ఆఫ్ ఆస్ట్రేలియా చెప్పడంతో బిట్ కాయిన్ విలువ మరింత పెరిగింది.

ట్రావెల్‌బైబిట్ అనే కంపెనీకి చెందిన పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) డివైజ్ ద్వారా ఈ క్రిప్టో కరెన్సీని అంగీకరించనున్నారు. ట్రావెల్ బై బిట్ సహ వ్యవస్థాపకుడు కాలెబ్ యోహ్ దీనికి మద్దతుగా ఉన్నారు. బిట్ కాయిన్, ఈథర్ (ఈటీహెచ్), లైట్ కాయిన్ (ఎల్టీసీ), బినాన్స్ కాయిన్ (బీఎన్బీ) రూపంలో క్రిప్టో కరెన్సీ వాడకం జరుగుతోంది. 

ట్రావెల్‌ బైబిట్ సంస్థ ఎయిర్‌టికెట్స్ బుకింగ్‌లో కూడా క్రిప్టో కరెన్సీ ద్వారా లావాదేవీలు జరిగేలా ప్రయత్నాలు మొదలుపెట్టింది. క్రిప్టో కరెన్సీని ఏ రిటైలర్ అయితే అంగీకరిస్తారో వారి కోసం పీఓఎస్ టెర్మినల్‌ను సైతం నిర్మిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే 25 లక్షల డాలర్లను సైతం పెట్టుబడిగా పెట్టింది.

కాగా, ఆస్ట్రేలియానే కాక బ్రెజిల్‌లోనూ క్రిప్టో కరెన్సీకి రెక్కలు వచ్చాయి. బ్రెజిల్‌‌కు చెందిన ఒయాసిస్ సూపర్‌మెర్కడాస్ అనే సూపర్‌మార్కెట్ చైన్ క్రిప్టో కరెన్సీని అంగీకరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

అర్జెంటీనాకు చెందిన కొందరు వ్యాపారులు క్రిప్టో కరెన్సీ చెల్లింపులను ఆమోదిస్తున్నట్లు తెలుస్తోంది. 2018 సెప్టెంబర్ నెలలో కొర్డోబాలో బిట్ కాయిన్లను స్వీకరిస్తున్నట్లు ఒక వ్యాపారి చెప్పారు. 
 

click me!