ఖాతాదారులూ జాగ్రత్త: బ్యాంకులకు 4 రోజులు సెలవు

By telugu teamFirst Published Sep 20, 2019, 12:14 PM IST
Highlights

బ్యాంకులు ఈ నెల 26వ తేదీ నుంచి వరుసగా నాలుగు రోజులు పనిచేసే అవకాశాలు లేవు. నగదు లావాదేవీల విషయంలో బ్యాంక్ ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కునే పరిస్థితి ఉంది. బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా బ్యాంక్ సమ్మె జరగనుంది.

న్యూఢిల్లీ: బ్యాంక్ ఖాతాదారులు జాగ్రత్త పడాల్సిన అవసరం వచ్చింది. బ్యాంకులకు నాలుగు రోజులు సెలవులు రానున్నాయి. ఈ నెల 26వ తేదీ గురువారం నుంచి రెండు రోజుల పాటు దేశవ్యాప్త సమ్మె చేస్తామని బ్యాంక్ యూనియన్లు ప్రకటించాయి. దాంతో 26, 27 తేదీలు బ్యాంకులు పనిచేసే అవకాశం లేదు.

ఆ తర్వాత 28వ తేదీ నాలుగో శనివారం, 29వ తేదీ ఆదివారం. ఈ రెండు రోజులు కూడా బ్యాంకులు పనిచేయవు. దీంతో వరుసగా బ్యాంకులు నాలుగు రోజుల పాటు పనిచేయవు. మరో విషయం కూడాఉంది. ఈ నెల 30వ తేదీన బ్యాంకులకు అర్థ సంవత్సరం ముగింపు రోజు. 

ఆ తర్వాత అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి. ఈ రెండు రోజులు కూడా బ్యాంకులు పనిచేయవు. అక్టోబర్ 1వ తేదీన పనిచేస్తాయి. ఉద్యోగులు సమ్మె చేసే రెండు రోజులు, అర్థ సంవత్సరం ముగింపు రోజు నెఫ్ట్ లావాదేవీలు ఉంటాయి. కానీ బ్యాంకుల్లో నగదు లావాదేవీలు ఉండవు. 

బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్తం సమ్మెకు వెళ్తే వరుసగా ఐదు రోజుల పాటు వ్యాపార, లావాదేవీలు ఉండకపోవడమే కాకుండా ఉద్యోగుల జీతాలకు కూడా ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది.

బ్యాంకుల విలీనం ద్వారా పది బ్యాంకులను నాలుగుకు కుదిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా నాలుగు బ్యాంకు యూనియన్లు ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫిడరేషన్ (ఎఐబిఓసి), ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఎఐబిఓఎ), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్ (ఎన్ఓబిఓ) సమ్మెకు పిలుపునిచ్చాయి. 

click me!