క్రిప్టో కరెన్సీ అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో యావత్ ప్రపంచవ్యాప్తంగా ఏకీకృతమైనటువంటి విధానం అమల్లోకి తేవాలని తద్వారా నూతన టెక్నాలజీని వినియోగించుకోవచ్చని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.ఈ మేరకు ఆయన బి 20 సదస్సులో ప్రపంచ దేశాలకు కీలక సూచనలు చేశారు.
క్రిప్టోకరెన్సీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) , నైతిక వినియోగంపై గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్ అత్యంత అవసరమని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం పిలుపునిచ్చారు. 'ఇంటర్నేషనల్ కన్స్యూమర్ సర్వీస్' దినోత్సవాన్ని పురస్కరించుకుని, కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్‌లో ప్రస్తుత పద్ధతిని విడిచిపెట్టి 'గ్రీన్ క్రెడిట్'ను స్వీకరించడానికి ఇక్కడ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) నిర్వహించిన 'B20 సమ్మిట్ ఇండియా-2023'లో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ చైన్ టెక్నాలజీ ఫలితంగా క్రీఫ్టో కరెన్సీ కి ఎక్కువగా స్కోప్ పెరిగిందని దీని దృష్టిలో ఉంచుకొని ప్రపంచవ్యాప్తంగా ఒక ఏకీకృత విధానాన్ని సృష్టించాలని ప్రధాని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఇదిలా ఉంటే గ్రీన్ క్రెడిట్ కోసం భారతదేశం ఇప్పటికే గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందిస్తోందని, పరిశ్రమ నాయకులు పర్యావరణానికిఅనుకూలమైన వ్యాపారం , జీవనశైలిని అనుసరించాలని ఆయన అన్నారు. వాతావరణ మార్పు, ఇంధన రంగ సంక్షోభం, ఆహార సరఫరా గొలుసులో అసమతుల్యత, నీటి భద్రత వంటి అంశాలను ప్రస్తావిస్తూ, ఇలాంటి అంశాలు వ్యాపారంపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయని, ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి కృషిని పెంచాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్నటువంటి కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ విధానానికి ప్రత్యామ్నాయంగా గ్రీన్ క్రెడిట్ విధానం అమల్లోకి తెచ్చినట్లు ప్రధాని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. పారిశ్రామిక ప్రగతి తో పాటు ప్రకృతిని కూడా కాపాడుకోవడం, కనీస బాధ్యతగా ఉండాలని ప్రపంచ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు.
క్రిప్టోకరెన్సీపై గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాలి..
ఇక క్రిప్టో కరెన్సీ పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందిస్తూ, “క్రిప్టోకరెన్సీకి సంబంధించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక సవాలు ఉంది. ఈ విషయంలో ప్రపంచ దేశాలన్నీ కలిసి ఒక ఏకీకృత విధానం తీసుకురావాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్‌ను సిద్ధం చేయడం ద్వారా మాత్రమే క్రిప్టో కరెన్సీని నియంత్రించవచ్చని భావిస్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం మార్కెట్లో విస్తరిస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించి కూడా ఇలాంటి విధానం అవసరమని ప్రధాని మోడీ స్పందించారు. “ఈ రోజు ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ విషయంలో AI గురించి చాలా ఉత్సాహంగా ముందుకు దూసుకెళ్తోంది అని పేర్కొన్నారు.
AI నైపుణ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి అటు పరిశ్రమలు, ప్రభుత్వాలు కలిసి పని చేయాలని మోడీ పిలుపునిచ్చారు. “వివిధ రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సృష్టించే అడ్డంకులను మనం అర్థం చేసుకోవాలన్నారు. ఈ సమస్యను గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్‌లో పరిష్కరించాలని ప్రధాని మోదీ అన్నారు. సంప్రదాయ విధానాన్ని పునరాలోచించాలని , బ్రాండ్‌లు , విక్రయాలకు అతీతంగా ఆలోచించాలని ప్రధాన మంత్రి పరిశ్రమను కోరారు. "వ్యాపార పరంగానూ, దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూర్చే ఎకో సిస్టం సృష్టించడానికి అందరం కలిసి కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ కోరారు.