ఎక్స్‌పోర్ట్స్ బెనిఫిట్స్‌లో ఆటో, ఫార్మా సంస్థలదే టాప్!!

By Arun Kumar PFirst Published Sep 5, 2018, 12:08 PM IST
Highlights

ఎక్స్‌పోర్ట్స్ బెనిఫిట్స్‌లో ఆటో, ఫార్మా సంస్థలదే టాప్!!

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సంపాదించడం కోసం వివిధ దేశాలకు ఎగుమతి చేయడానికి పాలకులు ఆయా సంస్థలు, పరిశ్రమలకు రాయితీలు, ప్రయోజనాలు చేకూరుస్తారు. భారతదేశం నుంచి వాణిజ్య ఎగుమతులకు ప్రోత్సాహక పథకం (ఎంఈఐఎస్) కింద లబ్ధి పొందిన రంగాల్లో ఆటోమొబైల్, ఫార్మా రంగాలదే సింహభాగం అంటే అతిశయోక్తి కాదు. 

ఎంఈఐఎస్ కింద ఆయా ఉత్పత్తులపై సదరు సంస్థలు వివిధ దేశాలకు చెల్లించే ఎక్సైజ్, కస్టమ్స్ సుంకాల విషయమై అవసరమైన సాయం చేయడానికి కేంద్ర వాణిజ్య శాఖ రాయితీలు అందజేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల రాయితీల కింద అత్యధికంగా పది అగ్రశ్రేణి సంస్థలు లబ్ధి పొందాయి.

అలా లబ్ధి పొందిన పారిశ్రామిక సంస్థలు..  జేఎస్‌డబ్ల్యూ స్టీల్ రూ.301.5 కోట్లు, ఫోర్డ్ ఇండియా రూ.272.8 కోట్లు, బజాజ్ ఆటో రూ.246.5 కోట్లు, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ రూ.240.6 కోట్లు, అరబిందో ఫార్మా రూ.211.3 కోట్లు మైలాన్ ల్యాబ్స్ రూ.192.9 కోట్లు, హ్యుండాయ్ మోటార్స్ రూ.189.3 కోట్లు, వేదాంత రూ.180 కోట్లు, లుపిన్ రూ.155 కోట్లు, నిస్సార్ మోటార్స్ రూ.150 కోట్లు పొందాయి.  

వీటితోపాటు టాటా మోటార్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, హెటెరో ల్యాబ్స్, మారుతి సుజుకి ఇండియా, సిప్లా, రిలయన్స్ ఇండస్ట్రీస్, జనరల్ మోటార్స్ ఇండియా, షాహీ ఎక్స్‌పోర్ట్స్ తదితర సంస్థలు ఎంఈఐఎస్ పథకం కింద రాయితీలు పొందాయి. గత ఆర్థిక సంవత్సరంలో కూడా ఆటోమొబైల్, ఫార్మాస్యూటికల్ రంగ పరిశ్రమలే అత్యధికంగా ఎంఈఐఎస్ లబ్ధి పొందిన సంస్థలుగా రికార్డు నెలకొల్పాయి. 

ప్రస్తుతం ఎగుమతులను ప్రోత్సహించేందుకు భారతదేశం అమలు చేస్తున్న రాయితీలను ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)లో అమెరికా సవాల్ చేసింది. ఈ రాయితీలతో అమెరికా కంపెనీలను దెబ్బ తీస్తున్నాయని, అంతర్జాతీయ ప్రమాణాలను పాటించడం లేదని అమెరికా వాదిస్తోంది. వివిధ ఎగుమతి ప్రోత్సాహక పథకాల కింద ఏటా భారతీయ సంస్థలు స్థూలంగా 700 కోట్ల డాలర్ల మేరకు లబ్ధి పొందుతున్నాయని అమెరికా వాదిస్తోంది. 
 

click me!