ఈయూలో అరబిందో పాగా: ఐదు దేశాల్లో కెనడా ‘అపొటెక్స్’ స్వాధీనం

First Published Jul 15, 2018, 10:56 AM IST
Highlights

మన దేశీయ ఔషధాల తయారీ సంస్థ అరబిందో ఫార్మాకు యూరప్‌లోని ఐదు దేశాల్లో ‘కెనడా ఔషద కంపెనీ అపోటెక్స్‌ ఇంటర్నేషనల్‌ ఐఎన్‌సీ‘కి గల వాణిజ్య కార్యకలాపాలు, కొన్ని మౌలిక వసతులు సొంతం కానున్నాయి.

న్యూఢిల్లీ: మన దేశీయ ఔషధాల తయారీ సంస్థ అరబిందో ఫార్మాకు యూరప్‌లోని ఐదు దేశాల్లో ‘కెనడా ఔషద కంపెనీ అపోటెక్స్‌ ఇంటర్నేషనల్‌ ఐఎన్‌సీ‘కి గల వాణిజ్య కార్యకలాపాలు, కొన్ని మౌలిక వసతులు సొంతం కానున్నాయి. ఔషధాల తయారీ, మార్కెటింగ్‌లో అపోటెక్స్‌ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీకి నెదర్లాండ్స్‌, బెల్జియం, స్పెయిన్‌, పోలెండ్‌, చెక్‌ రిపబ్లిక్‌ల్లోని వాణిజ్య కార్యకలాపాలు, మౌలిక వసతులను ఎగైల్‌ ఫార్మా బీవీ (నెదర్లాండ్స్‌)లను అరబిందో ఫార్మా సొంతం చేసుకోనుంది. ఇప్పటికే యూరప్ దేశాల్లో పలు ఫార్మా సంస్థలను స్వాధీనం చేసుకున్న అరబిందో.. తాజా ఒప్పందంతో ఈయూ పరిధిలో అగ్రశ్రేణి ఫార్మా సంస్థగా నిలిచింది. 

ఈ మేరకు అపోటెక్స్, అరబిందో సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఎగైల్‌ ఫార్మా అనేది అరబిందో ఫార్మాకు అనుబంధ కంపెనీ. ఈ కొనుగోలు విలువ దాదాపు రూ.620 కోట్లు (7.4 కోట్ల యూరోలు). అరబిందో సొంతం కానున్న వాణిజ్య కార్యకలాపాలు గత మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో సుమారు 13.3 కోట్ల యూరోల అమ్మకాలను నమోదు చేశాయి. కీలకమైన తూర్పు ఐరోపా దేశాల్లో అరబిందో ఫార్మా మరింతగా వేళ్లూనుకోవడానికి ఈ కొనుగోలు దోహదం చేస్తుంది. వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలను ఏకీకరించడం (సినర్జీ) ద్వారా విలువ బాగా పెరుగుతుంది. పూర్తిగా నగదు చెల్లింపుల ద్వారా ఈ ఒప్పందం పూర్తి చేసుకున్నట్లు అరబిందో ప్రకటించింది. 

ఒప్పందం ప్రకారం అపోటెక్స్‌లో అనుభవం కల నిపుణులు, ఉత్పత్తులు, మార్కెటింగ్‌, డోసియెర్‌ లైసెన్స్‌ హక్కులు తదితరాలు అరబిందో కంపెనీకి లభిస్తాయి. యూరప్‌లో అరబిందో ఔషధాల పోర్టుఫోలియో బాగా పెరుగుతుంది. 200 పైగా జనరిక్‌ ఔషధాలు, 80కి పైగా ఓటీసీ ఔషధాలు అరబిందో చేతికి వస్తాయి. అభివృద్ధి ప్రక్రియలో ఉన్న మరో 20 ఉత్పత్తులు వచ్చే రెండేళ్లలో అందుబాటులోకి వస్తాయి. డచ్, పోలండ్ నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి వచ్చే మూడు నుంచి ఆరు నెలల్లో ఈ ఒప్పందం అమలులోకి రానున్నదని అరబిందో తెలిపింది.

దీంతో పోలెండ్‌, చెక్‌ రిపబ్లిక్‌ల్లో మొదటి 15 జనరిక్‌ కంపెనీల్లో అరబిందో ఒకటిగా నిలుస్తుంది. పరిమాణ పరంగా నెదర్లాండ్స్‌లో ఒక ప్రధాన ఓటీసీ (ఓవర్‌ ద కౌంటర్‌) ఔషధాల కంపెనీగా ఆవిర్భవిస్తుంది. బెల్జియంలో రిటైల్‌ జనరిక్‌ విభాగంలోకి అడుగు పెట్టినట్లవుతుంది. మొదటి అయిదు ప్రధాన కంపెనీల్లో ఒకటిగా నిలుస్తుంది. డచ్‌, పోలెండ్‌ అథారిటీల నుంచి పోటీపరమైన అనుమతులు లభించే మేరకు ఈ ఒప్పందం అమలులోకి వస్తుంది. 3-6 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది.

కొద్ది కాలంగా యూరప్‌ మార్కెట్‌లో వ్యాపార కార్యకలాపాలను విస్తరించాలని అరబిందో భావిస్తోంది. ఈ వ్యూహానికి అనుగుణంగానే అపోటెక్స్‌ను కొనుగోలు చేసింది. 2006 నుంచి సొంత వ్యాపార విస్తరణ, ఎంపిక చేసిన కంపెనీల కొనుగోలు ద్వారా ఐరోపాలో అరబిందో వేళ్లూనుకుంటోంది. ఐరోపాలో వ్యాపార కార్యకలాపాలను విస్తరించే వ్యూహానికి అనుగుణంగా ఈ కొనుగోలు చేశామని అరబిందో ఫార్మా సీనియర్‌ ఉపాధ్యక్షుడు (యూరప్‌  కార్యకలాపాలు) వీ మురళీధరన్‌ తెలిపారు. 

2014లో ఏడు పశ్చిమ ఐరోపా దేశాల్లోని యాక్టావిస్‌ సంస్థను అరబిందో కొనుగోలు చేసింది. గతేడాది పోర్చుగ్రీస్‌లో జనరిస్‌ ఫార్మాస్యూటికాను సొంతం చేసుకుంది. పోర్చుగల్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, నెదర్లాండ్స్‌, స్పెయిన్‌, ఇటలీ, బెల్జియం, యూకే, రుమేనియా తదితర దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆసుపత్రుల్లో, వాణిజ్య పరంగా ఔషధాలను విక్రయించడానికి ఆయా దేశాల్లో బలమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నది. గత మార్చితో ముగిసిన ఏడాదికి ఐరోపా మార్కెట్‌లో అరబిందో 57.7 కోట్ల యూరోల విక్రయాలను నమోదు చేసింది.

click me!