స్టాక్ మార్కెట్ లోకి ప్రవేశించే ముందు కొద్దిగా ప్రాథమిక అవగాహన ఉండటం అనేది అత్యవసరం. ప్రాథమిక అవగాహనతో పాటు ఎలాంటి తప్పులు చేయకూడదు ముందుగానే గుర్తిస్తే మంచిది. . ప్రస్తుతం ఇక్కడ చెప్పబోయే మూడు తప్పులను మాత్రం ఇన్వెస్టర్లు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు చేసే తప్పులు తెలుసుకోవడం చాలా ముఖ్యం.. ముఖ్యంగా మనం చేసే తప్పుల నుంచి పాఠాలను తెలుసుకోవడం చాలా అవసరం. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది బ్రహ్మవిద్యేమి కాదు. ఒక్కోసారి తలపండిన నిపుణులు సైతం స్టాక్ మార్కెట్లో బోల్తా కొడుతుండటం చూస్తూనే ఉన్నాం. . అందుకే స్టాక్ మార్కెట్లో తరచూ జరిగే తప్పులను మనం రిపీట్ చేయకూడదు. అలాంటి ఓ మూడు తప్పులను ముందుగానే గుర్తించి స్టాక్ మార్కెట్ లోకి ప్రవేశిస్తే నష్టాల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు.
అవగాహన లేకుండా ఇన్వెస్ట్ చేయడం:
స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి నష్టపోయామని చాలా మంది చెబుతుంటారు. అలాంటి వారు, తాము ఏ కంపెనీ షేర్లలో పెట్టుబడి పెట్టారు? ఆ కంపెనీ గురించి అధ్యయనం చేసారా? ఆ కంపెనీ డైరెక్టర్ల బోర్డులో ఎవరున్నారు? కంపెనీ గతంలో ఎంత లాభం పొందింది ? కంపెనీ ఏ రంగానికి చెందినది. ఏ ఉత్పత్తి- లేదా సేవను అందిస్తోంది. అనే బేసిక్ నాలెడ్జిని ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు కలిగి ఉండాలి. చాలా మందికి ఆ కంపెనీ పేరు తప్ప మరేమీ తెలియదు. బ్యాగ్రౌండ్ తెలియకుండా ఎవరో చెప్పారని పెట్టుబడి పెడితే లాభం దక్కడం అసాధ్యం ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్, రాకేష్ జున్‌జున్‌వాలా ఏదైనా స్టాక్‌లో పెట్టుబడి పెట్టడానికి ముందు చాలా పరిశోధనలు చేస్తారు. వారి వెనుక నిపుణుల బృందం ఉంది. అంత నైపుణ్యం ఉన్నవాళ్లే లెక్కలు వేసి పెట్టుబడి పెడితే మనం కనీసం హోం వర్క్ చేయకుండా షేర్లలో ఇన్వెస్ట్ చేయడం తప్పే అవుతుంది.
అప్పులు చేసి షేర్లలో పెట్టుబడి పెట్టకండి:
స్టాక్ మార్కెట్లో ప్రవేశించే ఇన్వెస్టర్లు ఒక విషయంలో మాత్రం చాలా కఠినంగా ఉండాలి. అదే అప్పు చేసి షేర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనకూడదు. ఇలా చేయడం చాలా ప్రమాదకరం. పర్సనల్ లోన్ ద్వారా పొందిన డబ్బును కేవలం మీ వ్యక్తిగత అవసరాలు అలాగే మీ అత్యవసర పరిస్థితులనుంచి బయటపడేందుకు మాత్రమే ఉపయోగించాలి. షేర్ మార్కెట్ వంటి అధిక-రిస్క్ పెట్టుబడిలో పర్సనల్ లోన్ డబ్బును ఇన్వెస్ట్ చేస్తే, మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్టాక్ మార్కెట్‌లో దీర్ఘకాలంలో సగటు లాభం 14% నుంచి 16% వరకు మాత్రమే పొందవచ్చు. అలాంటప్పుడు 14 శాతం వడ్డీ రేటుతో వ్యక్తిగత రుణం తీసుకొని షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అవివేకం అవుతుంది.
పెట్టుబడి పెట్టండి , సహనాన్ని కోల్పోకండి:
ప్రఖ్యాత పెట్టుబడి నిపుణుడు వారెన్ బఫెట్ అనుసరించిన మార్గం చాలామంది అనుసరిస్తూ ఉంటారు. స్టాక్ మార్కెట్లో సంపద పెరగడానికి సమయం పడుతుంది అనే సాధారణ వాస్తవాన్ని మనం తెలుసుకోవాలి. మీరు ఈరోజు వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే, అది లాభాలను ఆర్జించడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ, స్టాక్ కొనుగోలుదారులు మాత్రమే ఈ రోజు కొనుగోలు చేసిన స్టాక్ రేపు ఎక్కువ లాభాలను ఇవ్వాలని కోరుకుంటారు. అకస్మాత్తుగా లాభం రానప్పుడు, ఆ షేర్లను కొనుగోలు చేసిన ధర కంటే తక్కువ ధరకు విక్రయించి వాటిని వదిలించుకుంటారు. స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్‌లో 90 శాతం మంది చిన్న పెట్టుబడిదారులు ఈ విధంగా నష్టపోతారు.