రూ. 2 వేల నోట్లతో బంగారు నగలు కొంటున్నారా..అయితే Income Tax రూల్స్ ఏంటో తెలుసుకోకపోతే..చిక్కుల్లో పడతారు..

By Krishna AdithyaFirst Published May 25, 2023, 7:57 PM IST
Highlights

ఆర్బిఐ 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకున్న తర్వాత, ఆ నోట్లు కలిగి ఉన్న వారిలో చాలామంది బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారనే, వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఒక రోజులో ఎంత మొత్తంలో బంగారు నగలను కొనుగోలు చేయవచ్చు. ఆదాయపన్ను శాఖ నిబంధనలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రెండు వేల రూపాయల నోటు ఉపసంహరణతో ఇప్పటికే జనం బ్యాంకుల వద్ద ఆ నోట్లో మార్చుకునేందుకు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. అయితే కొందరు మాత్రం ఈ నోట్లతో వివిధ  విలువైన వస్తువులను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉండటం విశేషం. ముఖ్యంగా 2000 రూపాయల నోట్లు రద్దు చేయలేదని, 2000 రూపాయల కరెన్సీ నోట్లు ఇంకా చలామణిలోనే ఉన్నాయని ఆర్బిఐ ప్రకటించడంతో ఈ నోట్లను ఎక్కువగా విలువైన వస్తువులు కొనుగోలు చేసేందుకే కొందరు  ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. తాజాగా పెట్రోల్ బంకుల్లోనూ అదేవిధంగా మొబైల్ షోరూమ్స్ లోను 2000 రూపాయల నోట్లను  విరివిగా వాడుతున్నట్లు ఆయా వర్గాలు చెబుతున్నాయి.

అయితే తాజాగా బంగారం దుకాణాల్లో సైతం 2000 రూపాయల నోట్లను ఎక్కువగా వినియోగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు బంగారాన్ని కొనుగోలు చేయాలంటే, ప్రభుత్వం నిబంధనలు ఎలా ఉన్నాయి ఒక రోజులో ఎంత బంగారం కొనుగోలు చేయవచ్చు. ఎంత డబ్బుతో బంగారం కొనుగోలు చేయవచ్చు. ఇలాంటి సందేహాలు పసిడి ప్రియులకు  కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు సంబంధించి ఆదాయ పన్ను శాఖ పేర్కొన్న నిబంధనలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

నిజానికి బంగారు ఆభరణాల కొనుగోళ్లు విషయంలో కేంద్ర ప్రభుత్వం పలు నిబంధనలను జారీ చేసింది. 2020 డిసెంబర్లోనే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ ఆక్ట్ కింద బంగారం కొనుగోళ్లను నియంత్రించేందుకు పలు రూల్స్ ను ప్రవేశపెట్టింది. వీటిలో ముఖ్యంగా 10 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారి పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ వంటి కేవైసీ డాక్యుమెంట్లను నగల వ్యాపారులు సేకరించాలని చట్టం చెబుతోంది. 

అంతేకాదు ఇన్కమ్ టాక్స్ నిబంధనల ప్రకారం,  ఒక రోజులో ఒక వ్యక్తి రెండు లక్షల రూపాయల కన్నా, ఎక్కువ నగదుతో ఆభరణాలు కొనుగోలు చేయవద్దని ఉంది. అంతకన్నా ఎక్కువ మొత్తంలో నగదుతో కొనుగోలు చేస్తే ఆదాయపన్ను శాఖ నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుంది. అంతేకాదు ఆ నగల షాపు పైన పెనాల్టీ కూడా విధించే అవకాశం ఉంది. 

అందుకే రెండు లక్షలు దాటిన నగదు చెల్లింపులను నగల షాపులు తీసుకోవు. అంతకుమించి మీరు నగలను కొనుగోలు చేయాలంటే కస్టమర్ యొక్క పాన్ కార్డు ఆధార్ కార్డు వివరాలు సేకరించాల్సి ఉంటుంది. అయితే రెండు లక్షలు దాటిన తర్వాత నగదు రూపంలో కాకుండా  ఆన్లైన్ లేదా బ్యాంకు చెక్, డీడీ రూపంలో లావాదేవీ చేయాల్సి ఉంటుంది. 

కావున మీరు రెండు లక్షల రూపాయల కన్నా ఎక్కువ నగదుతో నగలు కొనుగోలు చేయలేరు అన్న సంగతి గుర్తించాల్సి ఉంటుంది. ఈ లెక్కన 2000 రూపాయల నోట్లను రెండు లక్షల కన్నా కూడా ఎక్కువగా తీసుకెళ్లి మీరు నగల షాపింగ్ చేయలేరన్న సంగతి గుర్తించాలి. 

 

click me!