Andhra Pradesh: ఏపీలో ఎమిరేట్స్ కంపెనీ భారీ పెట్టుబడి..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 17, 2022, 04:55 PM IST
Andhra Pradesh: ఏపీలో ఎమిరేట్స్ కంపెనీ భారీ పెట్టుబడి..!

సారాంశం

ఇప్పటికే 3,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులకు సంబంధించిన మూడు ఎంఓయూలను కుదుర్చుకుంది. తాజాగా అబుదాబీకి చెందిన తబ్రీవ్ ఏసియాతో మరో కీలక ఒప్పందానికి శ్రీకారం చుట్టింది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో ఏర్పాటైన ఎక్స్‌పో సందర్భంగా ఏపీ వరుసగా పరస్పర అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంటోంది. ఇప్పటికే 3,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులకు సంబంధించిన మూడు ఎంఓయూలను కుదుర్చుకుంది. తాజాగా అబుదాబీకి చెందిన తబ్రీవ్ ఏసియాతో మరో కీలక ఒప్పందానికి శ్రీకారం చుట్టింది. వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల ఎగుమతులు, గోడౌన్ల నిర్మాణం, వాతావరణ ఉష్ణోగ్రతలను తగ్గించే టెక్నాలజీ రంగాలలో కలిసి పని చేసేలా ఒప్పందం కుదిరింది.

దుబాయ్ ఎక్స్‌పోలో మంత్రి మేకపాటి 
పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి- ఈ దుబాయ్ ఎక్స్‌పోలో పాల్గొన్నారు. ఆయన సమక్షంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ప్రభుత్వ సలహాదారు జుల్ఫీ సమక్షంలో ఏపీఈడీబీ సీఈవో సుబ్రహ్మణ్యం జవ్వాది, తబ్రీవ్ ఏసియా చీఫ్ డెవలప్ మెంట్ ఆఫీసర్ ఫ్రాన్ కో-యిస్ గ్జేవియర్ ఈ ఒప్పంద పత్రాలను బదలాయించుకున్నారు. పోర్ట్ ఆధారిత డీపీ వరల్డ్ పరిశ్రమ, జెబెలి అలీ ఓడరేవులను మంత్రి గౌతమ్ రెడ్డి సందర్శించారు.

ఓడరేవుల పనితీరు పరిశీలన 
10 లక్షల కార్లను స్టోరేజ్ చేసే సామర్థ్యం ఉన్న పోర్టు ఎగుమతులు, ఎలక్ట్రిక్, లాజిస్టిక్, మానుఫ్యాక్చరింగ్, షుగర్ ఫ్యాక్టరీ యూనిట్లను పరిశీలించారు. ఏపీలో పోర్ట్ ఆధారిత అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడానికి డీపీ వరల్డ్ ఆసక్తి కనబరిచింది. ఆ కంపెనీ యాజమాన్యంతో మంత్రి మేకపాటి భేటీ అయ్యారు. ఏపీలో మౌలిక వసతుల గురించి వారికి వివరించారు. సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యువరాజ్ నారాయణ్‌తో చర్చించిన అంశాలు ఈ సందర్భంగా వారి మధ్య ప్రస్తావనకు వచ్చాయి.

కొనరస్ స్టీల్ కంపెనీ ప్రతినిధులతో 
అనంతరం మంత్రి మేకపాటి.. అబుధాబిలోని ఉక్కు పరిశ్రమ కొనరస్ కంపెనీని సందర్శించారు. కడప జిల్లాలో నిర్మితమౌతోన్న స్టీల్ ప్లాంట్ గురించి కొనరస్ ప్రతినిధులకు వివరించారు. సహజవాయువు సహా ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి అనేక అవకాశాలు ఉన్న రంగాల గురించి తెలియజేశారు. అనంతరం అబుదాబీలోని ఏఐ మారియా ఐలండ్‌లో గల గ్లోబల్ మార్కెట్, ఫైనాన్సియల్ మార్కెట్, వాణిజ్య, ఎక్స్‌పోర్ట్ కార్యకలాలను పరిశీలించారు. 

రోడ్‌షో 
ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలను తెలియజేస్తూ పరిశ్రమల శాఖ నిర్వహించిన రోడ్ షోను మంత్రి మేకపాటి తిలకించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. పరిశ్రమల స్థాపన, పెట్టుబడులను ఆకర్షించడానికి అమలు చేస్తోన్న పారిశ్రామిక విధానాలను వారికి వివరించారు. అబుదాబీలోని భారత రాయబారి సంజయ్ సుధీర్‌ను మంత్రి మర్యాదపూరకంగా కలిశారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సాగుతున్న దుబాయ్ పర్యటన వెనుక గల ఎంబసీ సహకారంపై మంత్రి మేకపాటి కృతజ్ఞతలు తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Most Expensive Vegetables : కిలో రూ.1 లక్ష .. భారత్‌లో అత్యంత ఖరీదైన కూరగాయలు ఇవే
iPhone : ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 17 ప్రో, 15 ప్లస్‌పై భారీ తగ్గింపులు !