
భారత ప్రభుత్వం పారిశ్రామికవేత్తలైన ఆనంద్ మహీంద్రా, పంకజ్ పటేల్, వేణు శ్రీనివాసన్‌లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బోర్డులో పార్ట్‌టైమ్ నాన్-అఫీషియల్ డైరెక్టర్లుగా నియమించింది. వీరితో పాటు, అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM-A)లో మాజీ ప్రొఫెసర్ అయిన రవీంద్ర ధోలాకియా కూడా RBI బోర్డులో పార్ట్ టైమ్ నాన్-అఫీషియల్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
ఆనంద్ మహీంద్రా ప్రస్తుతం మహీంద్రా గ్రూప్ ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయన మహీంద్రా & మహీంద్రా మరియు టెక్ మహీంద్రాకు నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా కూడా ఉన్నారు. దీంతో పాటు టీవీఎస్ మోటార్ కంపెనీ చైర్మన్ వేణు శ్రీనివాసన్, జైడస్ లైఫ్‌సైన్సెస్ చైర్మన్ పంకజ్ ఆర్ పటేల్ కూడా రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ బోర్డులో చోటు దక్కించుకున్నారు.
RBI నోటిఫికేషన్ ప్రకారం, నియామకాల కమిటీ (ACC) ఈ నియామకాలను నాలుగేళ్ల కాలానికి చేసింది. రిజర్వ్ బ్యాంక్‌కు సంబంధించిన విషయాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్వహిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ నేతృత్వంలోని బోర్డు సభ్యులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం భారత ప్రభుత్వం నియమిస్తుంది.
ఆనంద్ మహీంద్రా దేశంలోని అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలలో ఒకరు. ముంబై ప్రధాన కార్యాలయం కలిగిన బహుళజాతి కంపెనీ మహీంద్రా గ్రూప్‌కు చైర్మన్. ఆనంద్ మహీంద్రాకు జనవరి 2020లో పద్మభూషణ్ లభించింది, ఇది దేశంలోని మూడవ అత్యున్నత పౌర పురస్కారం.
కాగా వేణు శ్రీనివాసన్ టీవీఎస్ మోటార్ కంపెనీకి చైర్మన్‌గా ఉన్నారు. 1979లో, అతను TVS మోటార్ హోల్డింగ్ కంపెనీ అయిన సుందరం-క్లైటోన్‌కి CEO అయ్యాడు. అదే సంవత్సరంలో TVS మోటార్ కంపెనీ స్థాపించబడింది.
పంకజ్ ఆర్ పటేల్ ఫార్మాస్యూటికల్ కంపెనీ జైడస్ లైఫ్ సైన్స్ చైర్మన్. పటేల్ ఇప్పటికే ఇన్వెస్ట్ ఇండియాతో సహా పలు సంస్థల డైరెక్టర్ల బోర్డులో ఉన్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ హెల్త్ మిషన్ యొక్క మిషన్ స్టీరింగ్ గ్రూప్ (MSG) సభ్యుడు.
రవీంద్ర ధోలాకియా IIM-అహ్మదాబాద్‌లో మాజీ ప్రొఫెసర్, సెంట్రల్ బ్యాంక్ నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (MPC) సభ్యుడు కూడా. ప్రాంతీయ ఆర్థికాభివృద్ధి, ఆర్థిక విధానాల విశ్లేషణ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మరియు ఆరోగ్య ఆర్థిక వ్యవస్థలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది.