కర్మ సిద్దాంతం పనిచేస్తుంది.. వారికి ఇది బలమైన సమధానం: బ్రిటన్‌పై ఆనంద్ మహీంద్రా సెటైర్

By Sumanth KanukulaFirst Published Sep 3, 2022, 6:42 PM IST
Highlights

ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఐదో స్థానానికి భారత్ ఎగబాకింది. బ్రిటన్‌ను అధిగమించి భారత్ ప్రపంచంలో ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడంపై పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఐదో స్థానానికి భారత్ ఎగబాకింది. ఇప్పటివరకు ప్రపంచంలో ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న బ్రిటన్‌.. ఇప్పుడు  ఆరో స్థానానికి పడిపోయింది. భారత్ ప్రపంచంలో ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడంపై పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఓ వార్త కథనాన్ని షేర్ చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా.. తన ఆనందాన్ని వ్యక్తం చేశారు . ఈ క్రమంలోనే తనదైన శైలిలో బ్రిటన్‌పై సెటైర్లు వేశారు. ‘‘కర్మ సిద్దాంతం పనిచేస్తుంది. స్వాతంత్ర్యం కోసం ఎంతో కష్టపడి పోరాడి త్యాగం చేసిన ప్రతి భారతీయుడి హృదయాలను నింపే వార్త ఇది. భారతదేశం గందరగోళంలో పడుతుందని భావించిన వారికి ఇదో బలమైన సమాధానం’’ అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. 

మరోవైపు కోటక్ మహీంద్రా సీఈవో ఉదయ్ కొటక్ స్పందిస్తూ.. ‘‘మన వలస పాలకులైన బ్రిటన్‌ను అధిగమించి భారత్ ఐదో అతి పెద్ద ఆర్థిక శక్తిగా అవతరించడం గర్వించదగ్గ క్షణమం. మనం సాధించాల్సింది ఇంకా ఉంది’’ అని పేర్కొన్నారు. 

ఇక, 2021 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో  భారతదేశం బ్రిటన్‌ను అధిగమించిందని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని బ్లూమ్ బర్గ్ కథనం పేర్కొంది. ఈ గణన యూఎస్ డాలర్లపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి జీడీపీ గణాంకాల ప్రకారం భారతదేశం మొదటి త్రైమాసికంలో తన ఆధిక్యాన్ని పెంచుకుంది. ఈ సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ మరింత ఎదిగి 854.7 బిలియన్ డాలర్లకు చేరింది. ఇదే సమయంలో బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ 816 బిలియన్ డాలర్లుగా ఉంది. ఆర్థిక కష్టాలతో బ్రిటన్‌ మరింత చితికిపోతుందని భావిస్తున్నారు. 

 

The law of Karma works. News that would have filled the hearts of every Indian that fought hard & sacrificed much for freedom. And a silent but strong reply to those who thought India would descend into chaos. A time for silent reflection, gratitude. 🙏🏽🇮🇳 https://t.co/hGJ4B28WE3

— anand mahindra (@anandmahindra)

అయితే సరిగా దశాబ్దం కిందటి గణంకాలను పరిశీలిస్తే.. భారతదేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో 11వ స్థానంలో ఉండగా.. బ్రిటన్  5వ స్థానంలో ఉంది. ఇక, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో భారత్ కంటే ముందు అమెరికా, చైనా, జపాన్, జర్మనీలు తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. 
 

click me!