ఆందోళనకరమే.. కానీ రీజన్స్ ఐడెంటిఫై చేయండి: రాజన్

By sivanagaprasad kodatiFirst Published Dec 11, 2018, 7:11 AM IST
Highlights

ఆర్బీఐ గవర్నర్ గా ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయడం భారతీయులందరికీ ఆందోళనకరమేనని మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. దీనికి దారి తీసిన కారణాలపై విశ్లేషించాలని కేంద్రానికి సూచించారు. కార్పొరేట్లు, రాజకీయ ప్రముఖులకు ఆర్బీఐ బోర్డులో చోటు కల్పించొద్దని పేర్కొన్నారు.

ఆర్బీఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ రాజీనామాకు గల కారణాలేంటో ప్రభుత్వం గుర్తించాలని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆయన ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూచించారు. రఘురామ్ రాజన్‌ 2013, సెప్టెంబరు నుంచి 2016, సెప్టెంబరు వరకు కేంద్ర బ్యాంకు గవర్నర్‌గా విధులు నిర్వర్తించారు.

‘ఇది తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. పటేల్ రాజీనామా చేయడానికి గల కారణాలు ఏంటో కనుక్కోవాల్సిన అవసరం ఉందనుకుంటున్నా. అలాగే ప్రభుత్వం ముందుముందు ఆర్‌బీఐతో సంబంధాలు నెరిపే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నా అభిప్రాయం. ఆర్‌బీఐ బోర్డు గతంలో సలహాదారుగా మాత్రమే వ్యవహరించేది. ప్రస్తుతం దాని పాత్ర పెరిగి క్రియా శీలకంగా మారింది’ అని రఘురామ్ రాజన్ పేర్కొన్నారు.

బోర్డులో పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులకు స్థానం ఉండటం వల్ల ఆర్‌బీఐ నిర్ణయాల మీద ప్రభావం పడి, కేంద్ర బ్యాంకు మౌలిక స్వరూపం దెబ్బ తింటుంది. వారిని దూరంగా ఉంచాలి. ఒక ప్రభుత్వ అధికారి రాజీనామా చేశారంటే అది నిరసనకు నిదర్శనం. ప్రభుత్వం వారి మీద రుద్దే విధానాలు ఒత్తిడి తీసుకువస్తే వారు ఆ పదవిలో కొనసాగలేరు’ అని సూచనప్రాయంగా ప్రభుత్వ విధానాలను రఘురామ్ రాజన్ వేలెత్తి చూపారు. 

కొద్ది రోజుల క్రితం ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య విభేదాలు తలెత్తాయని వార్తలు వచ్చాయి. తరవాత ఆ వ్యవహారం సద్దుమణిగినట్లు కనిపించింది. కానీ ఇప్పుడు ఉర్జిత్ పటేల్ రాజీనామాతో ప్రభుత్వానికి పెద్ద షాక్‌ తగిలినట్లయింది.
 

click me!