నిన్న అదాని నేడు వేదాంత వరుసగా రెండు బడా కార్పొరేట్ గ్రూపులపై ప్రముఖ ఇండిపెండెంట్ జర్నలిస్టుల సంస్థ OCCRP ఆరోపణలు చేసింది. కరోనా పాండమిక్ సమయంలో వేదాంత పలు పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడిందని అందుకోసం అనైతిక పద్ధతుల్లో లాబీయింగ్ చేసినట్లు ఆరోపించింది.
ప్రముఖ బిలియనీర్ జార్జ్ సోరోస్ ఫండింగ్ తో నడిచే గ్లోబల్ నెట్‌వర్క్ 'ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్' (OCCRP) తాజాగా అదానీపై ఆరోపణలు చేయగా, ప్రస్తుతం మరో కార్పొరేట్ కంపెనీ వేదాంత పై కూడా అనేక ఆరోపణలు కురిపించింది. కరోనా పాండెమిక్ సమయంలో ప్రముఖ మైనింగ్ సంస్థ వేదాంత కీలక పర్యావరణ నిబంధనలను బలహీనపరిచేందుకు ప్రయత్నించిందని ఆరోపించింది. నిబంధనలను తుంగలో తొక్కేలా "రహస్యంగా లాబీయింగ్" చేసినట్లు ఒక నివేదికను బయట పెట్టింది. అంతకుముందు గురువారం, OCCRP అదానీ గ్రూప్ తన స్వంత కంపెనీల షేర్లలో రహస్యంగా విదేశీ నిధుల ద్వారా పెట్టుబడులు పెట్టిందని ఆరోపించింది.
జార్జ్ సోరోస్-నిధులతో నడిచే ఈ ఆర్గనైజేషన్ తన తాజా నివేదికలో భారత ప్రభుత్వం ఎలాంటి సంప్రదింపులు లేకుండా వేదాంతా కోరిన కొన్ని మార్పులను ఆమోదించిందని , అవి "చట్టవిరుద్ధమైన మార్గాల" ద్వారా అమలు అయ్యాయని పేర్కొంది. "ఒక సందర్భంలో, వేదాంత కొత్త పర్యావరణ అనుమతులు లేకుండా మైనింగ్ కంపెనీలు 50 శాతం వరకు ఉత్పత్తి చేసేలా ప్రతిపాదన ముందుకు వచ్చింది" అని నివేదిక పేర్కొంది.
వేదాంత చమురు వ్యాపార సంస్థ కెయిర్న్ ఇండియా కూడా ప్రభుత్వ వేలంలో పొందిన ఆయిల్ బ్లాక్‌లలో 'డ్రిల్లింగ్' కోసం పబ్లిక్ హియరింగ్‌ను రద్దు చేయాలని లాబీయింగ్ చేసిందని నివేదిక పేర్కొంది. అప్పటి నుండి, రాజస్థాన్‌లో కెయిర్న్, ఆరు వివాదాస్పద చమురు ప్రాజెక్టులు స్థానికంగా వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆమోదం పొందినట్లు పేర్కొంది.
OCCRP నివేదికను వేదాంత ప్రతినిధి స్పందన ఇదే..
సదరు సంస్థ చేసిన ఆరోపణలపై వేదాంత ప్రతినిధిని సంప్రదించినప్పుడు, తమ గ్రూప్ "స్థిరమైన పద్ధతిలో దేశీయ ఉత్పత్తిని పెంచడం ద్వారా దిగుమతులను తగ్గించే లక్ష్యంతో పని చేస్తుంది" అని చెప్పారు. OCCRP నివేదికను నేరుగా తిరస్కరించలేదు.
undefined
ఇదిలా ఉంటే కొత్త పర్యావరణ అనుమతులు లేకుండానే మైనింగ్ కంపెనీలు ఉత్పత్తిని 50 శాతం పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతించడం ద్వారా భారతదేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం అవుతుందని వేదాంత గ్రూప్ వ్యవస్థాపకుడు , చైర్మన్ అనిల్ అగర్వాల్ జనవరి 2021లో అప్పటి పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో చెప్పారని OCCRP ఆరోపించింది.
అంతే కాదు ఆర్థిక వృద్ధికి తక్షణ ప్రోత్సాహంతో పాటు ఇది ప్రభుత్వానికి భారీ ఆదాయాన్ని అందిస్తుందని, పెద్ద ఎత్తున ఉద్యోగాలను సృష్టిస్తుందని ఒక సాధారణ నోటిఫికేషన్ ద్వారా ఈ మార్పు చేయవచ్చని అగర్వాల్ సిఫార్సు చేసినట్లు OCCRP ఆరోపించింది.
RTI ద్వారా సమాచారం పొందిన OCCRP
జవదేకర్ ఈ దిశలో వేగంగా పనిచేశారని , ఆయన తన మంత్రిత్వ శాఖ కార్యదర్శిని , డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్రీని ఆదేశించినట్లు నివేదిక పేర్కొంది. ఇలాంటి మార్పులను సాధించడానికి గతంలో పరిశ్రమ చేసిన ప్రయత్నాలు విజయవంతం కాలేదని, అయితే ఈసారి అగర్వాల్ కోరుకున్నది సాధించారని OCCRP తెలిపింది. OCCRP సమాచార హక్కు చట్టం ద్వారా ఈ లేఖలను పొందినట్లు తెలిపింది.వేదాంత కంపెనీ అభ్యర్థనలకు అనుగుణంగా ప్రభుత్వ అధికారులు నిబంధనలను రూపొందించారని OCCRP ఆరోపించింది.