మీడియా రంగంలో సంచలనం..NDTVలో వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించిన అదానీ గ్రూప్..

By Krishna AdithyaFirst Published Aug 23, 2022, 7:06 PM IST
Highlights

గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీ AMG మీడియా నెట్‌వర్క్ లిమిటెడ్, దేశంలోనే టాప్ మీడియా హౌస్ NDTVలో వాటాను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. NDTV  (న్యూ ఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్‌)లో అదానీ గ్రూప్ 29.18% వాటాను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో, ఓపెన్ ఆఫర్ ద్వారా NDTVలో 26 శాతం వాటా కొనుగోలుకు ఆసక్తిని కనబరిచింది.

NDTV మీడియా గ్రూప్‌లో 29.18 శాతం వాటాను అదానీ గ్రూప్ కొనుగోలు చేస్తుస్తున్నట్లు ప్రకటించింది. అదానీ గ్రూప్ లో భాగమైన AMG మీడియా నెట్‌వర్క్ ద్వారా ఈ డీల్ జరుగుతోంది. AMG మీడియా నెట్‌వర్క్ లిమిటెడ్ (AMNL) అనుబంధ సంస్థ VPCL ద్వారా కొనుగోలు ప్రక్రియ అమలు కానుంది. ఈ మేరకు అదానీ మీడియా నెట్‌వర్క్ సీఈవో సంజయ్ పుగ్లియా ఓ లేఖను విడుదల చేశారు.

NDTVలో అదనంగా 26 శాతం వాటా కోసం అదానీ గ్రూప్‌కు చెందిన AMG మీడియా ఆఫర్ చేసింది. NDTVలో ఒక్కో షేరుకు రూ.294 చొప్పున 26 శాతం వాటా కోసం అదానీ గ్రూప్ రూ.493 కోట్ల ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. దీని తర్వాత, మంగళవారం NDTV షేర్లు 5 శాతం లాభంతో రూ.376.55 వద్ద ముగిశాయి అదానీ మీడియా గ్రూప్ సీఈవో సంజయ్ పుగ్లియా  లేఖను విడుదల చేసిన అనంతరం NDTV షేర్లకు రెక్కలు వచ్చాయి.

మీడియా వ్యాపారం కోసం AMG మీడియా నెట్‌వర్క్  కంపెనీ ఏర్పాటు.. 
అదానీ గ్రూప్ ఏప్రిల్ 26, 2022న AMG మీడియా నెట్‌వర్క్ లిమిటెడ్ పేరుతో కంపెనీని ఏర్పాటు చేసింది. ఇందులో, మీడియా వ్యాపారాన్ని నడపడానికి ఒక లక్ష రూపాయల ప్రారంభ పెట్టుబడితో ప్రారంభపెట్టుబడి పెట్టింది. ఇందులో పబ్లిషింగ్, అడ్వర్టైజింగ్, బ్రాడ్‌కాస్టింగ్ సహా మీడియా సంబంధిత పనులు చేస్తామని తెలిపింది. 

ది క్వింట్‌లో ఎడిటోరియల్ డైరెక్టర్‌గా ఉన్న సంజయ్ పుగాలియా అదానీ ఎంటర్‌ప్రైజెస్  మీడియా ఇనిషియేటివ్‌లకు CEO, ఎడిటర్-ఇన్-చీఫ్‌గా నియమించారు. అయితే NDTVని అదానీ గ్రూప్ కొనుగోలు చేయడంపై పుగాలియా వచ్చినప్పటి నుంచే ఊహాగానాలు మొదలయ్యాయి. అదానీ మీడియా నెట్‌వర్క్ సీఈఓ సంజయ్ పుగాలియా తాజాగా ఒక లేఖ విడుదల చేస్తూ భారతదేశంలోని మూడు అతిపెద్ద ఛానెల్‌లలో ఎన్‌డిటివి ఒకటని, ఇది టీవీతో పాటు సోషల్ మీడియాలో కూడా ప్రాచుర్యం పొందిందని పేర్కొన్నారు.

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రస్తుతం గౌతమ్ అదానీ నికర విలువ రూ.8 లక్షల కోట్లుగా ఉంది. ఇటీవలే అదానీ గ్రూప్ ప్రపంచంలోనే అతిపెద్ద సిమెంట్ కంపెనీ హోల్సిమ్ నుంచి అంబుజా, ఏసీసీ సిమెంట్ కంపెనీల్లో వాటాను దాదాపు రూ.81 వేల కోట్లకు కొనుగోలు చేసినట్లు మార్కెట్లకు తెలిపారు. 

click me!