ఫోల్డబుల్, ఫ్లిప్ ఫోన్‌ల గురించి విన్నాం.. చూశాం.. ఉపయోగించాం కూడా.. అయితే మూడు సార్లు మడతపెట్టే ఫోన్‌ను మీరెప్పుడైనా చూశారా.. కనీసం విన్నారా.. త్వరలోనే ఈ ట్రై-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ను మనం ఉపయోగించబోతున్నాం. దీన్ని ఎవరు తయారు చేస్తున్నారు.. మార్కెట్‌లోకి ఎప్పుడు రాబోతోంది తదితర వివరాలు తెలుసుకుందాం.. రండి..
చైనా ఎలక్ట్రానిక్స్ దిగ్గజ కంపెనీ అయిన హువావే(Huawei) మూడు సార్లు మడతపెట్టే స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఈ కంపెనీ తన వ్యాపారాన్ని అంతర్జాతీయంగా అభివృద్ధి చేయడానికి మొదటి ట్రిపుల్-ఫోల్డ్ గాడ్జెట్‌ను పరిచయం చేయాలనుకుంటోంది. మరో విషయం ఏమిటంటే.. ఇది కేవలం ప్రపోజల్ మాత్రమే కాదు. ఇప్పటికే గాడ్జెట్ విడుదల చేయడానికి దాదాపు ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
తయారీ ప్రారంభం..
Huawei ట్రై-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ తయారీని ఇప్పటికే ప్రారంభించినట్లు సమాచారం. ఈ ఫోన్ సెప్టెంబర్‌లో మార్కెట్లోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‌లోకి అనేక రకాల ఫోల్డ్, ఫ్లిప్ ఫోన్లు వచ్చాయి. అయితే ట్రిపుల్ ఫోల్డింగ్ ఫీచర్‌ను ఉన్న మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే అవుతుందనడంలో సందేహం లేదు.
ఓ సెమినార్‌లో కనిపించిన ట్రిపుల్-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్..
GSMArena వెబ్‌సైట్‌లో ఉంచిన సమాచారం మేరకు Huawei వినియోగదారు వ్యాపార విభాగం CEO రిచర్డ్ యు ట్రిపుల్-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌తో రెండుసార్లు కనిపించారు. ఇటీవల జరిగిన ఓ ప్రెజెంటేషన్‌లో ట్రిపుల్-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ గురించి కూడా చర్చించారు. ఇదే కార్యక్రమంలో ఓ వినియోగదారుడు ట్రిపుల్-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఎప్పుడు అందుబాటులోకి వస్తుందని అడగగా, వచ్చే నెలలో అంటూ ఆయన సమాధానం చెప్పారు. దీంతో ట్రిపుల్-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ త్వరలో మార్కెట్లోకి రానుండటం ఖాయమని సీఈవో యు చెప్పకనే చెప్పారు. అయితే కంపెనీ నుంచి ఇంకా అధికారిక నోటిఫికేషన్ విడుదల కాలేదు.
సోషల్ మీడియాలో ఫొటోలు..
ప్రస్తుతం అధికారిక సమాచారం అందుబాటులో లేనప్పటికీ సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి. Huawei CEO యు కొత్త ట్రై-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ గురించి పని చేస్తున్నట్లు ఉన్న ఫొటో ఈ నెల ప్రారంభంలో వైరల్‌గా మారింది. ఆ ఫొటోను గమనిస్తే.. గాడ్జెట్ యొక్క ఎడమవైపు స్క్రీన్ పంచ్-హోల్ మధ్యలో సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఇది టాబ్లెట్‌తో సమానమైన 10-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉండొచ్చు. ఈ ఫోన్‌లో కిరిన్ 9-సిరీస్ ప్రాసెసర్ ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.