మీరు ఇల్లు కొంటున్నారా? ఎంత ధర పెట్టి కొంటున్నారు? మీ ఆదాయానికి తగ్గ ఇల్లే కొంటున్నారా? లేక రియల్ ఎస్టేట్ మోసంలో ఇరుక్కుపోతున్నారా? ప్రతి మనిషికి ఇల్లు కట్టుకోవాలన్నది జీవిత కల. అయితే మా ఆదాయానికి తగిన ఇల్లు కొనుక్కోకపోతే మీరు అప్పుల్లో కూరుకుపోతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు మీ ఆదాయం, సేవింగ్స్, అప్పులు ఇవేమీ పట్టించుకోకుండా మీతో బలవంతంగా ఖరీదైన ఇల్లు కొనిపిస్తారు. దీని వల్ల జీవితాంతం మీరు ఆనందంగా జీవించడం మర్చిపోయి అప్పులు కట్టుకుంటూ కూర్చోవాల్సి ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే 3-20-30 ఫార్ములాను ఫాలో అయిపోండి.
సాధారణంగా ఏ వస్తువైనా కొనాలనుకున్నప్పుడు చాలామంది చేసే తప్పేంటంటే ఆదాయం, ఖర్చులను లెక్కలోకి తీసుకోరు. ఇది చిన్న చిన్న వస్తువుల్లో అయితే పర్వాలేదు కాని.. ఇల్లు, కారు లాంటి వాటిని కొనేటప్పుడు కచ్చితంగా లెక్కలు వేసుకొని, జాగ్రత్తగా ఆలోచించి కొనుక్కోవడం చాలా ముఖ్యం. ఇల్లు కొనేటప్పుడు కూడా మళ్లీ మళ్లీ కొనం కదా.. కాస్త పెద్దది, సౌకర్యంగా ఉండేది కొనుక్కొంటే బెటర్ అని అందరూ అనుకుంటారు. కాని ఆ ఇంట్లోకి వెళ్లిన తర్వాత అప్పులు, ఈఎంఐలు కట్టుకుంటూ జీవించడం సరిపోతుంది. ఎప్పుడు చూసినా టెన్షన్ పడుతూ బతకాల్సి ఉంటుంది. అలా అని ఇల్లు కొనుక్కోకుండా ఉండకూడదు. ఆదాయానికి సరిపడా ఇల్లు కొనుక్కొంటే చిన్న ఇంట్లో అయినా ఆనందంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. దీనికోసం మీరు 3-20-30 రూల్ ఫాలో అయితే కచ్చితంగా సరైన ఇంటిని కొనుక్కోగలరు.
undefined
ఏంటీ 3-20-30 రూల్?
మొదటిగా మీ ఇంటి ఆదాయాన్ని లెక్కించండి. అంటే మీ ఇంటిలో సంపాదించే వారు ఎంతమంది. ప్రస్తుత రోజుల్లో చాలా ఇళ్లలో భర్తతో పాటు భార్య కూడా సంపాదిస్తున్నారు. కొన్ని కుటుంబాల్లో కొడుకులు, కూతుళ్లు కూడా ఉద్యోగాల్లో చేరి ఉంటారు. అందువల్ల అందరి ఆదాయం కలిపితే సంవత్సరానికి ఎంత వస్తుందో.. దానికి 3 రెట్లు ఖరీదైన ఇల్లు మీరు కొనుక్కోవచ్చు.
ఉదాహరణకు మీ ఇంటి ఆదాయం సంవత్సరానికి 20 లక్షలు ఉందనుకుందాం. అంటే మీరు 60 లక్షల విలువైన ఇల్లు కొనుక్కోవచ్చన్న మాట.
20 శాతం సేవింగ్స్ ఉండాలి
ఇక 3-20-30 రూల్ లో 20 అంటే సేవింగ్స్. మీరు కొనుక్కోవాలనుకున్న ఇంటి ధరలో 20 శాతం అమౌంట్ మీరు డౌన్ పేమెంట్ కట్టాలి. కేవలం 80 శాతం మాత్రమే లోన్ తీసుకోవాలి.
ఉదాహరణకు మీరు కొనాలనుకున్న ఇల్లు ఖరీదు కోటి రూపాయలు అనుకుందాం. అందులో 20 శాతం అంటే 20 లక్షలు మీరు సేవింగ్స్ చేసి ఉండాలి. అంత అమౌంట్ లేకపోతే మీ దగ్గర ఉన్న సేవింగ్స్, ఆదాయాన్ని లెక్కించుకొని ఆ రేంజ్ లో ఇల్లే తీసుకోవాలి.
EMI 30 పర్సెంట్
మీరు ఇల్లు కొనుక్కోవాలనుకుంటే మీ ఆదాయంలో 30 శాతం ఇంటి కోసం మీరు తీసుకున్న లోన్ కు కట్టే స్తోమత మీకు ఉండాలి.
ఉదాహరణకు మీ శాలరీ రూ.లక్ష అనుకుంటే మీరు 30 శాతం అంటే రూ.30 వేలు మాత్రమే లోన్ ఈఎంఐగా కట్టాలి. అంతకు మించి కడితే మీరు అవసరానికి డబ్బులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడతారు.
సూచన: ఇలా మీ ఆదాయానికి తగ్గట్టుగా ఇంటి ధర ఉండేలా చూసుకోండి. లేకపోతే అద్దె ఇంటిలోనే ఉంటూ మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆదాయం పెంచుకోకుండా ఉన్న దాంట్లో ఖరీదైన ఇల్లు కొనేస్తే మీ కుటుంబ సభ్యుల కనీస అవసరాలు కూడా తీర్చలేక ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.