రూ. 1,15,79,47,00,00,00,000... ఈ ఏడాది స్టాక్ మార్కెట్లలో ఆవిరైన సంపద, గుండె జారడం ఖాయం

By Siva KodatiFirst Published Dec 22, 2022, 5:51 PM IST
Highlights

గ్లోబల్ స్టాక్ మార్కెట్లు ఈ ఏడాది తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. 2022 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు 14 ట్రిలియన్ డాలర్ల మేర క్షీణించాయట. 

మరికొద్దిరోజుల్లో 2022 కాలగర్భంలో కలిసిపోయి.. 2023 రానుంది. ఈ సందర్భంగా ఈ ఏడాది చోటు చేసుకున్న తీపి, చేదు ఘటనలను రివైండ్ చేసుకుంటున్నారు జనం. ఈ క్రమంలో 2022లో దలాల్ స్ట్రీట్‌లో నెలకొన్న పరిస్ధితులను ఓసారి చూస్తే. గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్లలో 2022 అత్యంత కల్లోలమైన సంవత్సరాల్లో ఒకటిగా నిలిచిందని విశ్లేషకులు అంటున్నారు. గ్లోబల్ ఈక్విటీలు 14 ట్రిలియన్ డాలర్ల మేర క్షీణించాయట. ఈ మొత్తాన్ని భారతీయ కరెన్సీలోకి మార్చితే రూ. 1,15,79,47,00,00,00,000 (ఓపెన్ సోర్స్ కాలిక్యులేటర్). దీనిని చూస్తే గుండె గుభేల్‌మనడం ఖాయం. 

గడిచిన రెండున్నరేళ్లుగా కోవిడ్ కారణంగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్, కఠిన నిబంధనల కారణంగా వ్యాపార సంస్థలు, కంపెనీలు పరిమిత సంఖ్యలోనే కార్యకలాపాలు సాగించాయి. ఉద్యోగాలు పోవడంతో లక్షలాది మంది రోడ్డునపడ్డారు. ఈ సంవత్సరం కోవిడ్ కేసులు అదుపులోకి రావడంతో 2022పై ఇన్వెస్టర్లు గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో ప్రారంభమైన రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ మార్కెట్లలో గందరగోళానికి కారణమైంది. 

రాయిటర్స్ నివేదిక ప్రకారం.. కల్లోల సమయాల్లో సురక్షితమైన ఆస్తులుగా భావించే అమెరికా ట్రెజరీలు, జర్మన్ బాండ్లు వరుసగా 16 శాతం, 24 శాతం మేర తగ్గాయి. ఎఫ్‌టీఎక్స్ సామ్రాజ్యం పతనంతో బిట్‌కాయిన్ 60 శాతం క్షీణించడంతో క్రిప్టో మార్కెట్ సైతం ప్రధాన మార్కెట్లతో సమానంగా దెబ్బతింది. ఈఎఫ్‌జీ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ , ఐర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ మాజీ డిప్యూటీ గవర్నర్ స్టెఫాన్ గెర్లాచ్ మాట్లాడుతూ.. ఈ ఏడాది గ్లోబల్ మార్కెట్లలో ఏం జరిగిందో చూస్తే బాధ కలుగుతోందన్నారు. 

అయితే గ్లోబల్ మార్కెట్లు ఎదురుగాలిని ఎదుర్కొంటున్నప్పటికీ.. భారతదేశం మెరుగైన స్థానంలోనే వుందని వరల్డ్ బ్యాంక్ ఇటీవల తన నివేదికలో పేర్కొంది. సవాలుతో కూడిన ప్రపంచ వాతావరణం వున్నప్పటికీ భారత ఆర్ధిక వ్యవస్థ ‘‘స్థిరత్వాన్ని’’ ప్రదర్శించిందని ప్రశంసించింది. డిసెంబర్ 5న వెలువరించిన తన నివేదికలో ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లతో పోలిస్తే భారతదేశ ఆర్ధిక వ్యవస్థ గ్లోబల్ స్పిల్ ఓవర్‌ల నుంచి రక్షించబడింది అని పేర్కొంది. 

click me!