కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) మంగళవారం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. భారత్‌లో 5 జీ సేవలపై కీలక ప్రకటన చేశారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) మంగళవారం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. భారత్‌లో 5 జీ సేవలపై కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నాటికి ప్రైవేట్ టెలికాం ప్రొవైడర్లు 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ప్రైవేట్ టెలికాం ఆపరేపటర్ల ద్వారా 5G మొబైల్ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన స్పెక్ట్రమ్ వేలం 2022లో నిర్వహించబడుతుందని సీతారామన్ చెప్పారు. 2022-23లోపు 5G మొబైల్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు.
దేశంలోని అన్ని గ్రామాల్లో ఆప్టికల్ ఫైబర్ ఏర్పాటు 2025 నాటికి పూర్తవుతుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. విజువల్స్, యానిమేషన్ రంగంలో యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ ప్రచారం కోసం ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయబడుతుందని తెలిపారు.
గత సంవత్సరం బడ్జెట్ గణనీయమైన పురోగతిని సాధించిందని నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రభుత్వం ఎయిరిండియా విక్రయాన్ని పూర్తి చేసిందని.. ఒడిశాకు చెందిన నీలాంచల్ ఇస్పాత్ కోసం బిడ్లను ఖరారు చేసిందని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. త్వరలోనే ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూ రాబోతుందని వెల్లడించారు. దేశ చరిత్రలోనే అతి పెద్దదిగా చెబుతున్న ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూ జారీకి సంబంధించిన ప్రస్తుతం కీలకం కానుంది. ఎందుకంటే.. మార్చి 2022తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న భారీ పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ.1.75 లక్షల కోట్లకు చేరువ కావాలంటే LIC IPO చాలా కీలకం కానుంది.