జాగ్వార్ లాండ్ రోవర్ డిజైన్‌తో అభివ్రుద్ది చేసిన టాటా హారియర్ ఎస్ యూవీ మోడల్ కారు వచ్చే ఏడాది దేశీయ మార్కెట్లోకి అడుగు పెట్టనున్నది. బీఎండబ్ల్యూ, ఫియల్, ఆడి వంటి ప్రముఖ కార్ల తయారీ సంస్థలకు పోటీగా ఇది రానున్నది. దీంతోపాటు టాటా ఎక్స్ 451 మోడల్ కారు ఆవిష్కరించనున్నది.
ప్రముఖ ఆటోమొబైల్ మేజర్ టాటా మోటార్స్ మార్కెట్లోకి సరికొత్త ఎస్‌యూవీ మోడల్ కారు హారియర్ ఎస్‌యూవీ , టాటా ఎక్స్ 451 ను విడుదల చేసేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది.
వచ్చే ఏడాది జనవరిలో ఈ కారు మార్కెట్లోకి టాటా హారియర్ విడుదల కావచ్చని భావిస్తున్నారు. జాగ్వార్ ల్యాండ్‌రోవర్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేసిన ఈ కారు విశేషాలను టాటా మోటార్స్ ఇటీవల యూట్యూబ్‌లో టీజర్ వీడియో సిరీస్ మాదిరిగా విడుదల చేస్తోంది.
తాజాగా టాటా హరియర్ మోడల్ కారుకు అమర్చిన సరికొత్త ప్రొజెక్టర్ పడిల్ లైట్ల విశేషాలను వెల్లడించింది. సాధారణంగా ఇటువంటి లైట్లు బీఎండబ్ల్యూ, ఆడీ, మస్టాంగ్ వంటి విలాసవంతమైన కార్లకు ఉంటాయి.
ఆగి ఉన్న కారు ఓఆర్‌వీఎం నుంచి ప్రొజెక్టర్ పడిల్ ల్యాంప్ నేలపై పడుతున్న వీడియోను టాటా మోటార్స్ అప్‌లోడ్ చేసింది. బీఎండబ్ల్యూలో మాదిరిగా టాటా హారియర్‌లో టచ్ స్క్రీన్‌తో జేబీఎల్ మ్యూజిక్ సిస్టమ్ అమర్చారు. ఈ సిస్టమ్ ఆండ్రాయిడ్, యాపిల్ కార్ ప్లేలతో పనిచేస్తుంది. టాటా హారియర్‌లో 2.0 లీటర్ క్రయోటెక్ డీజిల్ ఇంజిన్‌ను అమర్చారు.
ఈ ఇంజిన్ 140 బీహెచ్‌పీ అవుట్‌పుట్, 320 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ‘ఆప్టిమల్ మాడ్యులర్ ఎఫిసియెంట్ గ్లోబల్ అడ్వాన్స్ డ్’ ఆర్కిటెక్చర్ ప్రకారం.. జాగ్వార్ లాండ్ రోవర్ డీ8 మోడల్ కారు కోసం డిజైన్ చేసిన ఇంజిన్ ను సిద్ధం చేసింది టాటా మోటార్స్.
ఎటువంటి రోడ్లపైనైనా హాయిగా దూసుకెళ్లే సామర్థ్యం దీని సొంతం. మున్ముందు దీన్ని ఏడు సీట్ల కారుగా రూపొందించనున్నట్లు తెలుస్తున్నది. అది 2020 ఆటో ఎక్స్ పోలో ప్రదర్శనకు రానున్నది. ఇక ప్రస్తుతం కారు ధర రూ. 15 నుంచి రూ.18 లక్షల వరకు పలుకుతుంది.
ఈ కాన్సెప్ట్‌ను తొలిసారి 2018 ఆటో ఎక్స్ పోలో టాటా మోటార్స్ ప్రదర్శించింది. అంతేకాదు పుణె కేంద్రంగా పని చేస్తున్న ఉత్పాదక యూనిట్ నుంచి తొలి హారియర్ కారును టాటా మోటార్స్ ఆవిష్కరించింది. ఇంపాక్ట్ డిజైన్ 2.0 ఫిలాసఫీ ఆధారంగా రూపుదిద్దుకున్నదే టాటా హారియర్ ఎస్‌యూవీ.
ఆరెంజ్ రంగులో వెలువడనున్న ఈ కారు 5-స్పోక్ అల్లాయ్ వీల్స్, ట్రయాంగ్లర్ క్వార్టర్ గ్లాస్, బీ పిల్లర్స్, సీ పిల్లర్ హౌసెస్, స్లిమ్ రాప్ అరౌండ్ టైల్ ల్యాంప్స్ కలిగి ఉంటుంది. టాటా నెక్సన్ మాదిరిగా స్టీరింగ్ పై స్మాల్ డయామీటర్ కూడా ఉంటుంది. తాజా టాటా హారియర్ ‘ఎక్స్ 451’ మోడల్ కారు టాటా నెక్సాన్ కంపాక్ట్ ఎస్ యూవీ, టాటా టియాగో కంపాక్ట్ హ్యాచ్ బ్యాక్, టాటా టైగోర్ కంపాక్ట్ సెడాన్ మాదిరిగా ఉండనున్నది.