గ్రామీణ యువతను చేరుకోవడమే లక్ష్యంగా టీవీఎస్ మోటార్స్ తాజాగా మార్కెట్‌లోకి రేడియాన్ అనే మోటార్ బైక్‌ను విడుదల చేసింది. అత్యద్భుతమైన ఫీచర్లతో మార్కెట్‌లో ప్రవేశించిన రేడియాన్ లీటర్ పెట్రోల్‌కు 69 కి.మీ మైలైజీ ఇవ్వనున్నది.
చెన్నై: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ గురువారం విపణిలోకి మరో సరికొత్త బైక్ విడుదల చేసింది. రేడియాన్ పేరుతో విడుదల చేసిన ఈ బైక్ ధర రూ.48,400 (ఢిల్లీలో ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించారు. 110 సీసీ సామర్థ్యం కలిగిన రేడియాన్.. సింక్రనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీ, కార్లకు మాత్రమే ఉండే స్పీడో మీటర్, అతి విశాలమైన సీటును కలిగి ఉందని టీవీఎస్ తెలిపింది. టీవీఎస్ రేడియాన్ పూర్తిగా నూతన డిజైన్‌తో రూపొందించిన మోటార్ బైక్. యువ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని ట్రెండీగా తయారు చేసిన బైక్. ప్రత్యేకించి చిన్న పట్టణం నుంచి గ్రామీణ భారతం వరకు 25 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు యువకులను ఆలోచనలకు అనుగుణంగా రూపుదిద్దుకున్నది టీవీఎస్ రేడియాన్.
అంతేకాక క్రోమ్ సైలెన్సర్, పెట్రోల్ ట్యాంకు చుట్టూ థై ప్యాడ్స్, అత్యుత్తమ గ్రౌండ్ క్లియరెన్స్, ప్రీమియం ఫీల్ కంట్రోల్, అతిపెద్ద చక్రాలు, స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, సింక్రనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీ, దెబ్బ తిన్న రోడ్లపై జారిపోకుండా బైక్‌ను డిజైన్ చేశారు. స్టైల్‌తోపాటు, అతి తక్కువ ధరకు బైక్‌లను సొంతం చేసుకోవాలనుకుంటున్న యువతను దృష్టిలో పెట్టుకుని ఈ బైక్‌ను తీసుకొచ్చామని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్ వేణు విలేకరులకు తెలిపారు. తొలి ఏడాది రెండు లక్షల యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. హోరో మోటార్స్ ఆధ్వర్యంలోని స్ప్లెండర్ వంటి బైక్‌లను లక్ష్యంగా పెట్టుకున్నట్లు టీవీఎస్ తెలిపింది.
వివేకవంతులైన వినియోగదారులకు మరింత ఉపయోగపడేలా ఇందులో ఫీచర్లు ఉన్నాయని కంపెనీ సీఈవో కేఎన్ రాధాకృష్ణన్ తెలిపారు. టీవీఎస్ రేడియాన్‌లో ఫస్ట్‌క్లాస్ ఫీచర్లతో పాటు, అత్యుత్తమ డిజైన్, స్టైల్, కలిగి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుందని అన్నారు. రేడియాన్‌లో మరిన్ని వేరియంట్లు తేనున్నట్లు వెల్లడించిన రాధాకృష్ణన్.. ఈ బైక్ అభివృద్ధి కోసం రూ.60కోట్లు పెట్టుబడిగా పెట్టినట్లు తెలిపారు. ఎయిర్ కూల్డ్ ఇంజిన్, సింగిల్ సిలిండర్ తదితరాలు కూడా ఈ మోటార్ బైక్ లో చేర్చామని టీవీఎస్ సీఈఓ కేఎన్ రాధాక్రుష్ణన్ చెప్పారు.
ఇక టీవీఎస్ రేడియాన్ అదనపు ఫీచర్ల విషయానికొస్తే, శబ్ధంతో కూడిన సైడ్ స్టాండ్ ఇండికేటర్, ట్యూబ్‌లెస్ టైర్లు, 10 లీటర్ల పెట్రోల్ ట్యాంకు, లీటరుకు 69.3కి.మీ. మైలేజీ, నాలుగు రంగుల్లో ఇది లభ్యం అవుతుంది. తొలిసారి 2012లో జరిగిన ఆటో ఎక్స్ పోలో దీన్ని ప్రదర్శించారు. కానీ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించిన దానికంటే భిన్నంగా ఉత్పత్తిని ప్రారంభించింది. తొలుత డిజైన్ చేసిన 125 సీసీ ఇంజిన్ కంటే 110 సీసీ ఇంజిన్‌తో మోటార్ బైక్‌ను తయారు చేసింది. టీవీఎస్ అపాచీ సిరీస్‌లో రేడియాన్ డిజైన్ పూర్తిగా స్టైలిష్‌గా రూపొందింది.