ఒక కొత్త లైఫ్‌స్టైల్‌ను కోరుకునేవారు, ప్రయాణాల్లో సరికొత్త అనుభూతి కోరుకునే వారి కోసం టయోటా నుంచి హైలక్స్ పికప్ వాహనం విడుదలైంది. కేవలం అడ్వెంచర్స్ ఇష్టపడేవారికి మాత్రమే కాకుండా వ్యవసాయ పనులకు, సరుకు రవాణాకు కూడా ఇలాంటి వాహనాలు అనుకూలంగా ఉంటాయి.
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టయోటా తమ బ్రాండ్ నుంచి సరికొత్త పికప్ ట్రక్ 'టయోటా హైలక్స్' ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇది కేవలం డీజిల్ వేరియంట్లో మాత్రమే లభించనుంది. ఇందులో స్టాండర్డ్, హై పికప్ అనే రెండు వెర్షన్ లలో అందుబాటులో ఉంటాయి. ఈ ఆకర్షణీయమైన పికప్ ట్రక్ ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 33.99 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి.
భారత రోడ్లపై ఇలాంటి పికప్ వాహనాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. అయితే విదేశాల్లో మాత్రం ఇలాంటి ట్రక్కుల వినియోగం ఎక్కువగా ఉంటుంది. అందులోనూ టయోటాహైలక్స్ వాహనం వివిధ దేశాల్లో మంచి ప్రజాదరణ దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 180 దేశాలలో 20 మిలియన్ యూనిట్లకు పైగా విక్రయాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ మార్కెట్లోనూ తమ వాహనానికి మంచి డిమాండ్ ఉంటుందని కంపెనీ భావిస్తుంది. ఇదివరకే ఇండియాలో ఈ తరహా వాహణ శ్రేణిలో ఇసుజు కంపెనీ V-క్రాస్ పేరుతో పికప్ ట్రక్కును ప్రవేశపెట్టింది. ఇప్పుడు 'టయోటా హైలక్స్' దానికి పోటీగా నిలవనుంది.
undefined
డిజైన్
ఈ సరికొత్త టయోటా హైలక్స్ పికప్ ట్రక్ డిజైన్ పరంగా అత్యంత ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, చూడటానికి చాలా దృఢంగా, ఒక శక్తివంతమైన వాహనంగా కనిపిస్తుంది. ఈ వాహనం ముందు భాగం క్రోమ్ లైనింగ్‌తో ఒక ధృడమైన టయోటా లోగో కలిగిన గ్రిల్ కవచాన్ని కలిగి ఉంది. LED డేటైమ్ రన్నింగ్ లైట్లు, LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, స్కిడ్ ప్లేట్ ఈ వాహనానికి మంచి లుక్‌ను అందించాయి. వెనుకవైపు, టెయిల్‌లైట్‌లు నిలువుగా పేర్చినట్లు ఉన్నాయి. స్టీల్ కవచంతో నల్లటి బంపర్, పెద్ద లోడ్ మోసుకెళ్లేలా మంచి సామర్థ్యం కలిగిన డెక్‌ని ఇచ్చారు.
ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
ఫీచర్ల పరంగా దాదాపు అన్ని ప్రీమియం రేంజ్ కార్లలో ఉన్నట్లుగానే Hiluxలో కూడా అన్ని ముఖ్యమైన క్యాబిన్ ఫీచర్లను అందించారు. 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, Apple CarPlay, Android Auto, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రికల్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, పుష్ బటన్ స్టార్ట్‌తో కీలెస్ ఎంట్రీ, క్రూయిజ్ కంట్రోల్ తదితర ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో ఐదుగురు వ్యక్తులు కూర్చునేలా సీటింగ్ కెపాసిటీతో పాటు, డబుల్ క్యాబ్ కాన్ఫిగరేషన్‌తో వస్తుంది. ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు (స్టాండర్డ్), EBDతో కూడిన ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఇంకా ఫ్రంట్, రియర్ పార్కింగ్ సెన్సార్‌లు ఉన్నాయి.
కెపాసిటీ
హైలక్స్ ఒక శక్తివంతమైన వాహనం. ఇందులో ఫార్చ్యూనర్ కారులో ఉన్నట్లుగా 204PS 2.8-లీటర్ డీజిల్ ఇంజిన్‌ను అమర్చారు. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేశారు. ఆన్ రోడ్ అయినా, ఆఫ్ రోడ్ అయినా ఎలాంటి కఠిన మార్గాలలో అయినా డ్రైవ్ చేయటానికి ఈ వాహనం అనుకూలంగా ఉంటుంది.