టాటా మోటార్స్ స్పీడ్.. మరిన్ని విద్యుత్ వెహికల్స్ తెచ్చేందుకు రెడీ

By ramya NFirst Published Mar 7, 2019, 1:47 PM IST
Highlights

మార్కెట్లో వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని, అధునాతన టెక్నాలజీతో వినియోగదారులకు చేరువ కావాలని టాటా మోటార్స్ తలపోస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వ సంస్థలకే వాహనాలు సరఫరా చేస్తూ వచ్చిన టాటా మోటార్స్.. ఇక అన్ని వర్గాల కస్టమర్లపై కేంద్రీకరించింది. పర్యావరణ హిత విద్యుత్ కార్ల తయారీపై ద్రుష్టి పెట్టామని టాటా మోటార్స్ ప్రకటించింది. ఇందుకోసం ‘ఆల్ఫా’ అనే పేరుతో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశామని తెలిపింది. మరోవైపు దేశవ్యాప్తంగా విద్యుత్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు ఆస్ట్రేలియాకు చెందిన ట్రీటియం సంస్థతో ఎంవోయూ కుదుర్చుకున్నది టాటా సన్స్ అనుబంధ టాటా ఆటో కాంప్.

మరిన్ని విద్యుత్‌ వాహనాలు విడుదల చేసేందుకు దేశీయ వాహన దిగ్గజం టాటా మోటార్స్‌ సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వ సంస్థల కోసమే కాక.. కస్టమర్లు మెచ్చేలా ఉత్పత్తులను విపణిలోకి తెస్తామని టాటా మోటార్స్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ, కార్పొరేట్‌ స్ట్రాటజీ విభాగం అధ్యక్షుడు శైలేష్‌ చంద్ర పేర్కొన్నారు.

దేశీయ మార్కెట్లో టిగోర్‌ ఎలక్ట్రిక్‌ కారును విక్రయిస్తున్న టాటా మోటార్స్, ప్రభుత్వ రంగ సంస్థ ఈఈఎస్‌ఎల్‌ ఆర్డర్లకు సరఫరా చేస్తుంది. దేశవ్యాప్తం విద్యుత్‌ కార్ల అమ్మకాలు 20-20 శాతం పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశీయంగా విద్యుత్‌ వాహనాలను పెంచుకునేందుకు దేశంలోని 20-25 ప్రాంతాలను లక్ష్యంగా ఎంచుకుంటోంది.   

‘వచ్చే ఐదేళ్లలో విద్యుత్‌ వాహనాల కోసం ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేస్తున్నామని, ఆల్ఫా ప్లాట్‌ఫామ్‌పై పర్యావరణహిత ఇంజిన్లును అభివృద్ధి చేయనున్నాం. ప్రభుత్వానికే కాకుండా ప్రైవేట్‌ రంగం కోసం కార్లను తయారు చేస్తాం’అని జెనీవా ఆటో ఎక్స్ పోలో శైలేష్‌ పేర్కొన్నారు. 

కంపెనీ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ ఆల్ట్రోజ్‌ విద్యుత్‌ వాహనాన్ని వచ్చే రెండేళ్లలో విడుదల చేయడానికి టాటా మోటార్స్ సన్నాహాలు చేస్తోంది. అంతకంటే ముందే మరిన్ని విద్యుత్‌ వాహనాలు తీసుకొస్తామని శైలేష్‌ సంకేతాలు ఇచ్చారు. టాటా టిగోర్‌ విద్యుత్‌ వెర్షన్‌ సిద్ధంగా ఉందని, మార్కెట్‌లో డిమాండ్‌ ఏర్పడితే విడుదల చేస్తామని అన్నారు.

విద్యుత్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు దిశగా టాటా అడుగులు
మరోవైపు విద్యుత్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకున్న టాటా గ్రూప్ ఆ దిశగానూ అడుగులేస్తున్నది. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు ఆస్ట్రేలియన్‌ సంస్థ ట్రీటియంతో టాటా ఆటోకాంప్‌ ఒప్పందం చేసుకున్నది. ఈ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) ప్రకారం ట్రీటియం తయారు చేసే డైరెక్ట్‌ కరెంట్‌ (డీసీ) ఫాస్ట్‌ చార్జర్లను భారత్‌లో అందుబాటులోకి తేనున్నట్లు టాటా ఆటోకాంప్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

అంతర్జాతీయంగా చార్జర్లు సరఫరా చేస్తున్న సంస్థ ట్రీటియం
డీసీ చార్జింగ్‌ ఇన్‌ఫ్రా కంపెనీ అయిన ట్రీటియం అంతర్జాతీయంగా ఆటోమొబైల్‌ సంస్థలకు చార్జర్లను సరఫరా చేస్తోంది. ట్రీటియం తయారు చేసే వీఫిల్‌–ఆర్‌టీ డీసీ ఫాస్ట్‌ చార్జర్లు.. ఇటు ద్విచక్రవాహనాల నుంచి కార్లు, వాణిజ్య వాహనాల దాకా వివిధ రకాల వాహనాలను వేగంగా చార్జ్‌ చేసేందుకు వాడతారని టాటా ఆటోకాంప్‌ సిస్టమ్స్‌ ఎండీ, సీఈవో అరవింద్‌ గోయల్‌ చెప్పారు. 

గణనీయంగా విద్యుత్ చార్జింగ్ స్టేషన్ల అవసరం
ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో చార్జర్ల అవసరం కూడా గణనీయంగా ఉండనుందన్నారు. ఈ మార్కెట్లో అపార అవకాశాలున్నాయని, ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని  టాటా ఆటోకాంప్‌ సిస్టమ్స్‌ ఎండీ, సీఈవో అరవింద్‌ గోయల్‌ తెలిపారు. ఇటీవలే ప్రకటించిన ఫేమ్ -2 పథకంలో భాగంగా  చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు కూడా తోడ్పాటు లభించనుంది.


 

click me!