Skoda Kushaq Style: వాహనం ధరను తగ్గించి సరికొత్తగా విడుదల చేసిన స్కోడా..!

By team teluguFirst Published Jun 15, 2022, 2:03 PM IST
Highlights

స్కోడా కారు కంపెనీ కొత్తగా కుషాక్ స్టైల్ NSR వేరియంట్ వాహనాన్ని భారత మార్కెట్లో విడుదల చేసింది. ధరను కూడా కాస్త తగ్గించింది. వివరాలు చూడండి.
 

ప్రముఖ కార్ మేకర్ స్కోడా ఆటో తమ కుషాక్‌ SUVకి మరో వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ వాహనాన్ని 'స్టైల్ NSR' అనే పేరుతో పిలుస్తారు. ఇందులో NSR అంటే 'నాన్-సన్‌రూఫ్' అని సూచిస్తుంది. ఈ సరికొత్త Kushaq Style NSR వాహనం టాప్-ఎండ్ వేరియంట్‌ కంటే రూ. 20 వేల తగ్గింపు ధరతో లభిస్తుంది. ప్రస్తుతం ఈ సరికొత్త Style NSR ఎక్స్-షోరూమ్ ధర రూ. 15.09 లక్షలకు లభిస్తోంది.
ఆటోమొబైల్ మార్కెట్లో సెమీకండక్టర్ల కొరత తీవ్రమవుతున్న కారణంగా స్కోడా ఇండియా ఈ కొత్త వేరియంట్‌ను ప్రవేశపెట్టింది.

ధర తగ్గించినట్లుగానే ఈ కారులోని కొన్ని ఫీచర్లను కూడా కంపెనీ తొలగించింది. స్టైల్ NSR వేరియంట్ వాహనంలో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆటో-డిమ్మింగ్ రియర్‌వ్యూ మిర్రర్ అలాగే రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు ఉండవు. అదనపు వీల్ కూడా 15-అంగుళాలు చిన్నదిగా ఉంటుంది. ఇవి మినహా మిగిలిన ఫీచర్లు, స్పెసిఫికేషన్లు అన్ని యధాతథంగా లభిస్తాయి.

Kushaq Style NSRలో ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఇంజిన్‌ స్టార్ట్ లేదా స్టాప్ చేయడానికి పుష్ బటన్, కీలెస్ ఎంట్రీ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆండ్రాయిడ్ ఆటో- యాపిల్ కార్‌ప్లేతో కూడిన 20 సెంమీల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్, క్రూయిజ్ కంట్రోల్, సెన్సార్‌లతో కూడిన వెనుక పార్కింగ్ కెమెరా, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, వైర్‌లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, యాంబియంట్ లైటింగ్, LED టెయిల్ ల్యాంప్స్, LED హెడ్‌ల్యాంప్‌లు, LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ ఉన్నాయి. అలాగే కుషాక్ SUVలోని అన్ని వేరియంట్లలో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌ మాత్రం స్టాండర్డ్‌గా లభిస్తుందని చెబుతున్నారు.

ఇంజిన్ కెపాసిటీ

కుషాక్ స్టైల్ NSR వేరియంట్ 3-సిలిండర్ యూనిట్ కలిగిన 1.0-లీటర్ TSI టర్బోచార్జ్డ్ ఇంజన్‌తో అందిస్తున్నారు. దీనిని 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేశారు. ఇది గరిష్టంగా 115 PS శక్తి వద్ద 178 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1.5-లీటర్ EVO, 4-సిలిండర్ టర్బోచార్జ్‌డ్‌ ఇంజన్ కూడా ఉంది. 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 7-స్పీడ్ DSG డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది.
ఈ Kushaq Style NSR వాహనం భారత మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా, MG ఆస్టర్, కియా సెల్టోస్, మారుతి సుజుకి S-క్రాస్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ , నిస్సాన్ కిక్స్‌ వంటి వాహనాలతో పోటీపడుతుంది.
 

click me!