Royal Enfield Scrambler: రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి మరో సరికొత్త బైక్.. ధ‌ర ఎంతంటే..?

By team teluguFirst Published Mar 16, 2022, 12:54 PM IST
Highlights

ప్రముఖ మోటార్​ బైక్​ల తయారీ సంస్థ రాయల్ ఎన్​ఫీల్డ్ పోర్ట్​ ఫోలియో విస్తరణ‌పై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది భారీ సంఖ్యలో కొత్త బైక్​లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా హిమాలయన్ స్క్రామ్ 411 అనే బైక్‌ను విడుద‌ల చేసింది.

భారత మోటార్ సైకిల్ దిగ్గజం ఐకానిక్ రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి మరో సరికొత్త బైక్ మార్కెట్‌లోకి విడుదలైంది. “హిమాలయన్ స్క్రామ్ 411″గా పిలిచే ఈ బైక్ ను మార్చి 15న‌ మంగళవారం దేశీయ విఫణిలోకి విడుదల చేసింది రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ. సంస్థలో ఇప్పటికే ఉన్న హిమాలయన్ అడ్వెంచర్ బైక్ కే చిన్నపాటి మార్పులు చేసి నగరాల్లోని యువతను ఆకట్టుకునేలా స్క్రాంబ్లర్ తరహాలో ఈ బైక్ ను రూపొందించారు. స్క్రామ్ 411 బైక్‌కి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన స్పై షాట్స్ ను చూసిన యువత.. ఈ బైక్ కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రూ.2.03 లక్షల ప్రారంభ ధర నుంచి “హిమాలయన్ స్క్రామ్ 411” వినియోగదారులకు అందుబాటులో ఉంది.

హిమాలయన్ స్క్రామ్ 411 ప్రత్యేకతలు

రాయల్ ఎన్ ఫీల్డ్ లో ఇప్పటికే ఉన్న హిమాలయన్ బైక్ ప్లాట్ ఫామ్‌ ఆధారంగానే ఈ “స్క్రామ్ 411” బైక్ ను రూపొందించారు. అయితే చిన్న చిన్న మార్పులు చేశారు. ముందుగా చెప్పుకోవాల్సింది హెడ్ లాంప్ డిజైన్ గురించే. హిమాలయన్ కు స్క్రామ్ 411కు మధ్య గుర్తించగలిగిన వ్యత్యాసం హెడ్ లాంప్. హిమాలయన్ లో బయటకు పొంగుకొచ్చినట్లుగా ఉండే హెడ్ లాంప్.. స్క్రామ్ 411లో హ్యాండిల్ బార్ లోకి చొప్పించారు. ఇక ముందు టైర్ లోనూ మార్పులు చేశారు. హిమాలయన్‌లో ముందు భాగంలో 21 అంగుళాల టైర్ ఉంటే..స్క్రామ్ 411లో 119 అంగుళాల టైర్ అమర్చారు. ఇక ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా భిన్నంగా రౌండ్ LCD ప్యానల్ ఏర్పాటు చేశారు.

స్క్రామ్ 411లో వెనుక భాగంలో ఫెండర్ తీసేశారు. ముందున ఉండే విండ్‌స్క్రీన్, ర్యాప్ రౌండ్ ఫ్రేమ్‌ను కూడా తొలగించారు. స్ప్లిట్ సీటు స్థానంలో సింగిల్-పీస్ సీటు ఏర్పాటు చేశారు. వెనుకన ఉండే లగేజి ర్యాక్ ను తొలగించి గ్రాబ్ రైల్‌ ఏర్పాటు చేశారు. ఇవి మినహా ఇంజిన్ పరంగా హిమాలయన్ కు.. స్క్రామ్ 411కు మధ్య పెద్దగా మార్పులు లేవు. స్క్రామ్ 411, 411cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ కలిగి ఉంది. ఇది 24.3 bhp 32 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. 5 స్పీడ్ గేర్ బాక్స్ తో పాటు డ్యూయల్ ఛానల్ ABS కూడా ఉన్నాయి. వైట్, రెడ్, గ్రే- యెల్లో, గ్రే-రెడ్, బ్లాక్, రెడ్ వంటి కలర్ల కాంబినేషన్‌లో ఈ హిమాలయన్ స్క్రామ్ 411 లభిస్తుంది.
 

click me!