ఇక సెలెక్టెడ్ బెంజ్ & ఆడీ కార్ల ధరలు కాస్ట్‌లీ

By rajesh yFirst Published Jul 25, 2019, 5:38 PM IST
Highlights
  • బీఎస్ -6 ప్రమాణాలకు అనుగుణంగా వాహనాల తయారీ, అదనపు సుంకాలు తదితర కారణాలతో కార్ల ఉత్పత్తి వ్యయం పెరిగింది. 
  • ఇప్పటికే హ్యుండాయ్ కార్ల ధరలు పెరుగనున్నాయి. 
  • వచ్చేనెల ఒకటో తేదీ నుంచి బెంజ్, ఆడి కార్లలో ఎంపిక చేసిన మోడళ్ల ధరలు పెరుగనున్నాయి. 

న్యూఢిల్లీ: దేశీయంగా విలాసవంతమైన కార్లు త్వరలో మరింత ప్రియం కానున్నాయి. రానున్న నెలల్లో మెర్సిడెస్‌ బెంజ్, ఆడీ కంపెనీలు ఎంపిక చేసిన తమ కార్లు, ఎస్‌యూవీల ధరలు పెంచనున్నాయి. తయారీ ఖర్చులు పెరగడంతో సదరు కంపెనీలు ఈ నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

‘ఆటోమోటివ్‌ విడిభాగాలపై కస్టమ్స్‌ సుంకం, ఎక్సైజ్‌ సుంకం, ఇంధనంపై సెస్‌ పెరగడం, తయారీ ఖర్చులు ఎక్కువ కావడం కంపెనీపై పెను ప్రభావం చూపుతున్నాయి. దీంతో మా ఉత్పత్తులపై 3శాతం వరకు ధర పెంచాలని నిర్ణయించాం’ అని జర్మనీ లగ్జరీ కార్ల సంస్థ మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ మార్టిన్‌ షీవెంక్‌ మీడియాకు తెలిపారు. 

‘వినియోగదారులు మెర్సిడెస్‌ కారు సొంతం చేసుకోవాలన్న కల నిజం చేసుకోవడానికి స్టార్‌ ఎజిలిటీ ప్లస్‌, స్టార్‌ ఫైనాన్స్‌, స్టార్‌ లీజ్‌, కార్పొరేట్‌ స్టార్‌ లీజ్‌ వంటి వినూత్న పథకాలు ప్రవేశపెట్టాం. వీటితో పాటు స్టార్‌ ఈజ్‌, స్టార్‌ కేర్‌, స్టార్‌ కేర్‌ వంటి సేవలు వినియోగదారులను చేరువచేస్తాయి’ అని ఆశాభావం వ్యక్తం చేశారు.

దీంతో ఆగస్టు నుంచి బెంజి కార్ల ధర రూ. 90వేల నుంచి రూ. 5.5లక్షల వరకు పెరగనుంది. అయితే ఏయే మోడళ్లపై ధర పెరుగుతుందన్న వివరాలను కంపెనీ బయట పెట్టలేదు. మరోవైపు జర్మనీకి చెందిన మరో ఆటోమొబైల్‌ ఉత్పత్తుల సంస్థ ఆడీ కూడా సెప్టెంబర్ నుంచి ధరలు పెంచేందుకు సిద్ధమైంది. 

‘బడ్జెట్‌ ప్రతిపాదనలతో మాపై తయారీ భారం పెరిగింది. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు ధరలు పెంచక తప్పట్లేదు. ఇప్పటికే అమ్మకాల ఒత్తిడిలో ఉన్న కంపెనీలకు ధరల పెంపు మరో ఎదురుదెబ్బే’ అని ఆడీ ఇండియా హెడ్‌ రహిల్‌ అన్సారీ అన్నారు. అటు హ్యుండాయ్‌ కూడా పలు మోడళ్లపై ధరలను పెంచేసింది. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి వివిధ మోడళ్లపై రూ. 9,200 వరకు ధర పెరుగుతుందని ఆడీ కారు తెలిపింది. 

click me!