బీఎస్-3 మోడల్ వాహనాలు చౌకధరలకే అమ్ముతున్నారని ప్రచారం జరిగితే 2017లో కొనుగోలుదారులు షోరూమ్‌ల ముందు బారులు దీరారు. షోరూమ్‌లు కిటకిటలాడాయి
బీఎస్-3 మోడల్ వాహనాలు చౌకధరలకే అమ్ముతున్నారని ప్రచారం జరిగితే 2017లో కొనుగోలుదారులు షోరూమ్‌ల ముందు బారులు దీరారు. షోరూమ్‌లు కిటకిటలాడాయి. కొన్ని చోట్ల జనం తాకిడి తట్టుకోలేక షోరూమ్‌ల యజమానులు దుకాణాలను మూసేశారు. మరికొన్ని చోట్ల ప్రజలను అదుపు చేయలేకపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
కొన్ని ప్రాంతాల్లో నోస్టాక్ బోర్డులు కన్పించాయి.. కొందరు తక్కువ ధరలకే కొనగా, వాహనాలైపోవడంతో కొందరు నిరాశగా వెళ్లిపోయారు. ఇప్పుడు మళ్లీ అటువంటి పరిస్థితే కనిపిస్తోంది.
undefined
ప్రస్తుతం కూడా మోటారు సైకిళ్లు, స్కూటీలు, కార్ల ధరలు తగ్గుతున్నాయి కూడా. వచ్చే నెల నుంచి బీఎస్-4 వాహనాలు విక్రయించవద్దని బీఎస్-6 వెహికల్స్ మాత్రమే అమ్మాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో బీఎస్-4 బండ్ల ధరలు తగ్గుతున్నాయి.
బీఎస్–4 వాహనాల డెడ్ లైన్ ఈ నెల 31 దగ్గర పడుతుండడంతో మరో నెల రోజులు గడువు పొడిగించాలని కంపెనీలు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో వీలైనంత త్వరగా వాహనాలను సదరు ఆటోమొబైల్ సంస్థలు అమ్ముకోవాలని చూస్తున్నాయి.
దీంతో వాహనాల అమ్మకాలపై కొన్ని కంపెనీలు డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. హోండా సివిక్ 2019 డీజిల్ సెడాన్ కారుపై దాదాపు రూ.2.9 లక్షల డిస్కౌంట్ ప్రకటించారు. అదే 2020 మోడల్‌పై రూ.2 లక్షలు, 2019 పెట్రోల్ వాహనమైతే రూ.1.25 లక్షల డిస్కౌంట్ ఇచ్చింది.
స్కోడా ర్యాపిడ్ బీఎస్–4 పెట్రోల్ వేరియంట్‌పై రూ.1.36 లక్షల వరకు డిస్కౌంటు ప్రకటించింది. డీజిల్ వేరియంట్‌పై రూ.1.58 లక్షల రాయితీనిచ్చింది. స్కోడా ఆక్టేవియా పెట్రోల్ వాహనంపై ఆ సంస్థ రూ.2.4 లక్షల డిస్కౌంట్ ఇచ్చింది.
హోండా సిటీ రూ.62 వేల వరకు రాయితీనిచ్చింది. మారుతీ సుజుకీ డిజైర్ పెట్రోల్ వేరియంట్‌పై రూ.55 వేలు, డీడీఐఎస్ డీజిల్ వేరియంట్‌పై రూ.74వేల రాయితీనిచ్చింది. హోండా అమేజ్ మోడల్‌పై రూ.42 వేల డిస్కౌంట్ అందిస్తోంది. టాటా మోటార్స్ తన జెస్ట్ వేరియంట్‌పై రూ.85,000, టాటా టైగర్ డీజిల్ వేరియంట్‌పై రూ.75 వేల రాయితీనిచ్చాయి.
ఇక టూ వీలర్ బైక్స్, స్కూటీలు, స్కూటర్ల ధరలు కూడా త్వరలోనే తగ్గించనున్నట్లు తెలుస్తోంది. కంపెనీలే కాకుండా షోరూమ్ డీలర్లు కూడా డిస్కౌంట్లు ప్రకటించేందుకు సిద్ధం అవుతున్నారు. టూవీలర్‌పై రూ.5 వేలు, ఫోర్ వీలర్‌పై రూ.10 వేల వరకు తగ్గించి విక్రయించాలని భావిస్తున్నారు.
2017లో ఏప్రిల్ 1 నుంచి బీఎస్–3 ద్విచక్ర వాహనాలను అమ్మడానికి వీళ్లేదని సుప్రీం కోర్టు నిషేధం విధిస్తూ అదే ఏడాది మార్చి 29న తీర్పు వెల్లడించింది. దీంతో కంపెనీలకు తమ వద్ద ఉన్న బీఎస్–3 మోడల్ వాహనాలను వెంటనే అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో కంపెనీలు, షోరూమ్‌లు భారీ డిస్కౌట్లు ప్రకటించాయి.
బైక్‌లపై 5 వేల నుంచి 10 వేల వరకు డిస్కౌంట్‌కు ఇచ్చాయి. ఇతర వాహనాలపై కూడా ఆఫర్లు ప్రకటించడంతో ప్రజలు షోరూమ్‌ల వద్ద బారులుదీరారు. బండ్లను కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు. కొన్ని చోట్ల ఈ తాకిడికి తట్టుకోలేక షోరూమ్‌లను మూసేశారు.
కాగా పలువురు డీలర్లు తమ బంధువులు, దగ్గరి వారికి వారికి ఫోన్లు చేసి కాస్త తక్కువ ధరకు విక్రయించారు. ఒకసారి కంపెనీ ఉత్పత్తిని డీలర్‌కు అమ్మేస్తే దాన్ని మళ్లీ వెనక్కి తీసుకున్నట్లు ఇప్పటి వరకూ ఎక్కడా జరగలేదు. దీంతో డీలర్ల వద్ద ఉన్న వాహనాలను వీలైనంత తక్కువ లాభం, లేకుంటే నష్టం లేకుండా అమ్మేయాలని చూశారు.
ఇప్పటికే బీఎస్–4 బండ్లను కొన్నవాళ్లు వివిధ కారణాలతో రిజిస్ట్రేషన్లు చేయించుకోలేదు. ఫ్యాన్సీ నంబర్ కోసం, రెండో వాహనం ఉంటే ట్యాక్స్ ఎక్కువ పడుతుందని, వాహనం వేరే పేరుమీద బదిలీ కాలేదని.. ఇలా పలు కారణాలతో పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా టెంపరరీ రిజిస్ట్రేషన్‌తో తిరుగుతున్నారు.
Also read:టెక్కీలకు తీపి కబురు: భారత్‌లో 30 వేల మందికి కొత్త కొలువులు
నంబర్ వచ్చినప్పుడు, పన్నులు కట్టినప్పుడు శాశ్వత రిజిస్ట్రేషన్లు చేసుకుంటామని చెప్పి చాలా మంది డీలర్ల నుంచి వాహనాలు కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. ఇలాంటి సమస్యలున్న వారు మార్చి 31లోగా తప్పకుండా పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. లేదంటే ఆ తరువాత రిజిస్ట్రేషన్ చేయరు.
ఓ వైపు ఆటోమోబైల్ కంపెనీలు డిస్కౌంట్లు ప్రకటిస్తుండగా, మరోవైపు కొన్ని షోరూమ్‌లలో వాహనాలు దొరుకడం లేదు. బీఎస్-6 వెహికల్స్ రేట్లు ఎక్కువగా ఉంటాయనే ప్రచారం, కంపెనీలు ఇస్తున్న డిస్కౌంట్ల యాడ్స్‌లో చూసి వాహనాలను కొనేందుకు వెళ్లిన వారికి కొన్ని షోరూమ్‌లలో ఏకంగా వాహనాలు లేవని చెబుతున్నారు.
ఔట్‌ఆఫ్ స్టాక్ అని జవాబిస్తున్నారు. డిస్కౌంట్ పక్కనపెడితే, అసలు రేట్‌కు తీసుకుంటామన్నా లేవని చెబుతున్నారు. అయితే షోరూమ్ వాళ్లే తమకు తెలిసిన వారికి ఇస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.