ఇక జామ్ అంటూ జావా రైడ్: ఎన్‌ఫీల్డ్‌కు సవాల్

By rajesh yFirst Published Nov 16, 2018, 12:38 PM IST
Highlights

22 ఏళ్ల తర్వాత భారతదేశ రోడ్లపై జావా మోటార్ బైక్‌లు పరుగులు తీయనున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా గురువారం వీటిని ఆవిష్కరించింది. ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ లకు ఇది ప్రధాన పోటీ దారు కానున్నది. 
 

ముంబై: మళ్లీ దేశీయ రోడ్లపై జావా బైకులు దూసుకుపోనున్నాయి. దేశీయ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా అనుబంధ సంస్థ క్లాసిక్ లెజెండ్స్.. ఐకానిక్ జావా మోటార్‌సైకిళ్లను అందుబాటులోకి తెచ్చింది. మూడు వేరియంట్లలో ఈ బైక్‍లు లభిస్తాయి. ప్రారంభ ధర రూ.1.50 లక్షల నుంచి రూ.1.89 లక్షల వరకు పలుకుతాయి. వీటిలో జావా మోడల్ రూ.1.55 లక్షలు కాగా,  జావా-42 విలువ రూ.1.64 లక్షలు, జావా-పెరాక్ మోడల్ రూ.1.89 లక్షలు. 293 సీసీ సామర్థ్యంతో రూపొందించిన ఈ బైకుల్లో సింగిల్ సిలిండర్, డబుల్ ఒవర్‌హెడ్ ఇంజిన్ ఉన్నాయి. 

అందమైన బైక్ రైడ్‌కు ప్రతీక జావా
బైక్‌ల ఆవిష్కరణ సందర్భంగా మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ ఒకప్పటి లెజెండరీ బ్రాండ్‌ను మళ్లీ మార్కెట్లోకి తేవడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. సాహసోపేత, అందమైన బైకు రైడ్‌కు జావా ప్రతీకగా నిలుస్తుందన్నారు. 22 ఏళ్ల క్రితం నిలిచిపోయిన అమ్మకాలను పున:ప్రారంభించడం సంతోషంగా ఉన్నదని, తద్వారా ద్విచక్ర వాహన వ్యాపారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ బైకులు కీలకంగా మారనున్నాయని చెప్పారు.

ఎగుమతులు కూడా చేస్తామన్న ఆనంద్ మహీంద్రా
ఈ బైకుల విక్రయానికి లక్ష్యాలు నిర్దేశించుకోలేదని పెట్టుకోలేదని, అలాగని మాస్ సెగ్మెంట్‌పై కూడా దృష్టి సారించలేదని మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. వీటితో దేశీయ మార్కెట్‌తోపాటు ఎగుమతులపై కూడా దృష్టి సారించినట్లు చెప్పారు. ప్రీమియం బైకులకు మార్కెట్ పెరుగుతున్న తరుణంలో జావాను తిరిగి తీసుకురావడం సంతోషంగా ఉందని క్లాసిక్ లెజెండ్స్ సీఈవో ఆశిష్ జోషి తెలిపారు. 

ఏడో తేదీ నుంచి బైక్‌ల సరఫరా
మారుతున్న వినియోగదారుల అభిరుచిలకు తగినట్లు ఈ బైకులను తీర్చిదిద్దినట్లు, తద్వారా కస్టమర్లను ఆకట్టుకోవడానికి మరింత తేలికవుతుందని క్లాసిక్ లెజెండ్స్ సీఈవో ఆశిష్ జోషి పేర్కొన్నారు. ముందస్తు బుకింగ్‌లను గురువారం ప్రారంభించిన సంస్థ వచ్చే నెల 7 నుంచి కొనుగోలుదారులకు బైకులను సరఫరా చేయనున్నది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ వద్ద మహీంద్రాకు ఉన్న ప్లాంట్లోనే ఏడాదికి 5 లక్షల బైకులను ఉత్పత్తి చేస్తున్నది.

విద్యుత్ ఆధారిత వాహనాల కోసం మహీంద్రా రూ.1000 కోట్ల పెట్టుబడి
విద్యుత్‌ ఆధారిత వాహనాలపై మహీంద్రా గ్రూపు ప్రత్యేక దృష్టి సారించింది. 2020 నాటికి రూ.1,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేయోచనలో మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఉన్నది. సరికొత్త ట్రియో, ట్రియో యారి వాహనాలను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ సందర్భంగా మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ చైర్మన్ పవన్ గోయెంకా మాట్లాడుతూ..విద్యుత్‌తో నడిచే వాహనాలకు పెద్దపీట వేస్తున్నట్లు, దీంట్లోభాగంగా వచ్చే రెండేండ్లలో వెయ్యి కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. 

బెంగళూరులో ఎలక్ట్రిక్ టెక్నాలజీ తయారీ హబ్
రూ.100 కోట్ల పెట్టుబడితో బెంగళూరులో ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ టెక్నాలజీ తయారీ హబ్‌ను మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ చైర్మన్ పవన్ గోయెంకా ప్రారంభించారు. ఈవీలకోసం ఇప్పటికే రూ.500 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టడం జరిగిందని, మరో రెండేండ్లలో మిగతా రూ.500 కోట్లను ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. ఈ నూతన యూనిట్ అందుబాటులోకి రావడంతో ఈవీల తయారీ సామర్థ్యం 25 వేల యూనిట్లకు చేరుకోనున్నది. ఈవీల వాడకం భారీగా పెరిగితే భవిష్యత్తులో ధరలు పెరిగే అవకాశం ఉందన్న ఆయన..ఎంతమేర తగ్గేదానిపై స్పందించడానికి నిరాకరించారు. గురువారం విడుదల చేసిన ఈవీ ఆటో ప్రారంభ ధర రూ.1.36 లక్షలుగా నిర్ణయించింది.

కేరళకు ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు
తెలంగాణకు చెందిన విద్యుత్ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా- బీవైడీ పది బస్సులను కేరళ ఆర్‌టీసీకి అందచేసింది. ఇందులో ఐదు బస్సులను గురువారం ఆ రాష్ట్ర రవాణా శాఖమంత్రి ఏకె శశిధరన్ ప్రారంభించారు. ఈ-బజ్ కే 47 ఎలక్ట్రిక్ బస్సులు పర్యవరణానికి ఏమాత్రం హాని చేయవని కంపెనీ ఈడీ ఎన్ నాగసత్యం ఒక ప్రకటనలో తెలిపారు. మిగతా రాష్ర్టాల్లో మాదిరే కేరళలో కూడా ఈ బస్సులు విజయవంతం అవుతాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. 32 సీట్లుండే ఈ ఏసీ బస్సులు లీథియం బ్యాటరీలతో నడుస్తాయి.

click me!