కియో సెల్టాస్ కోసం 23 వేల బుకింగ్స్.. 22 నుంచి విక్రయం షురూ!

By rajesh yFirst Published Aug 9, 2019, 11:53 AM IST
Highlights

కియా మోటార్స్ ‘సెల్టాస్’ కారు కోసం ఇప్పటివరకు 23 వేల బుకింగ్స్ నమోదయ్యాయి. గురువారం ఆంధ్రప్రదేశ్ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శంకరనారాయణ, ఏపీఐఐసీ చైర్ పర్సన్ ఆర్ కే రోజా, కియా మోటార్స్ ప్రతినిధులు లాంఛనంగా కారును మార్కెట్లోకి విడుదల చేశారు.

అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌ ఆటోమొబైల్‌ రంగంలో నవశకం ఆరంభమైంది. ఆంధ్రా తయారీ కియా కారు లాంఛనంగా మార్కెట్‌లోకి విడుదలైంది. కంపెనీ ఏర్పాటు చేసిన ప్లాంట్‌లో తయారైన ఈ కారును గురువారం దక్షిణ కొరియా అంబాసిడర్ శిన్ బాంగ్-కిల్, కియా మోటార్స్ ఇండియా మేనేజింగ్ గైరెక్టర్, సీఈవో కుఖియున్ షిమ్‌, రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, శంకర నారాయణ, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌ రోజా ఆవిష్కరించారు.

536 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్‌లో ప్రతియేటా 3 లక్షల కార్లు ఉత్పత్తి కానున్నాయి. ఈ యూనిట్‌లోనే హైబ్రిడ్, విద్యుత్‌తో నడిచే వాహనాలను సైతం తయారు చేస్తామని చెప్పారు. దేశీయ ఆటోమొబైల్ రంగంలో కియా మోటార్స్ 2 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.14 వేల కోట్లు) పెట్టుబడి పెట్టింది. వీటిలో 1.1 బిలియన్ డాలర్లతో ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది.

మధ్యశ్రేణి స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం (ఎస్‌యూవీ) కియో కారు సెల్టాస్‌కు వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన లభించింది. కారు విడుదలకు ముందే 23 వేల ముందస్తు బుకింగ్‌లు నమోదయ్యాయని కియా మోటార్స్ వర్గాలు తెలిపాయి. 

ఈ సందర్భంగా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ మనోహర్ భట్ మాట్లాడుతూ సెల్టాస్ ముందస్తు బుకింగ్‌లు ఆరంభించిన నెలలోనే 23 వేల బుకింగ్‌లు వచ్చాయన్నారు. దేశవ్యాప్తంగా 160 నగరాల్లో ఉన్న 265 టచ్‌ పాయింట్ల వద్ద ఈ నెల 22న బుకింగ్ చేసుకున్నవారికి వాహనాన్ని అందచేయడం జరుగుతుందన్నారు. 

ఇదిలా ఉంటే ఈ నెల 22 నుంచి మార్కెట్‌లో కియా కార్లను విక్రయిస్తామని  కియా మోటార్స్‌ ఎండీ కుఖుయన్ షిమ్ తెలిపారు. దేశవ్యాప్తంగా 206 షోరూమ్‌లలో ఈ కార్లఅమ్మకాలు జరుపుతామని చెప్పారు.  వెబ్‌సైట్‌ తెరిచిన నాడే 6వేల కార్లు ముందస్తు బుకింగ్‌ అయ్యాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోనే లక్ష్యానికి ముందుగా ఈ కార్లను విడుదల చేసినట్టు ఆయన చెప్పారు.  

click me!