బైక్ సేల్స్‌లో ‘‘హీరో’’..5.4 శాతం పెరుగుదల

By sivanagaprasad kodati  |  First Published Feb 1, 2019, 1:02 PM IST

ఆటోమొబైల్ రంగంలో కార్ల విక్రయాలు తగ్గుముఖం పట్టినా బైక్‌ల విక్రయం కాసింత జోరుగానే ఉన్నట్లు కనిపిస్తోంది. గతేడాదితో పోలిస్తే 2018-19 ఆర్థిక సంవత్సరం త్రుతీయ త్రైమాసికంలో హీరో మోటో కార్ప్ సేల్స్ 5.25 శాతం పెరిగి 17.98 లక్షల వాహనాలను విక్రయించింది. 


దేశీయ ద్విచక్ర వాహనాల దిగ్గజం గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది డిసెంబర్ నెలతో ముగిసిన  త్రైమాసికంలో బైక్‌ల విక్రయాల్లో కాసింత ఫరవాలేదనిపించింది. 2017-18 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో విక్రయించిన వాహనాలతో పోల్చితే వృద్ధి 5.25 శాతంగా ఉంది. ఈ ఏడాది డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో 17,98,905 వాహనాలను విక్రయించింది. 

గురువారం సమావేశమైన హీరో మోటో కార్ప్ కంపెనీ బోర్డు 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేర్‌కు రూ.55 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. రూ.2,336.71 కోట్ల ఆదాయం పన్ను డిమాండ్‌పై అప్పీల్‌కు  వెళ్లినట్టు కంపెనీ తెలిపింది. 

Latest Videos

undefined

నాలుగో త్రైమాసికం సానుకూలంగా ఉంటుందని, రానున్న నెలల్లో మార్కెట్‌ పరిస్థితి మెరుగుపడుతుందని హీరో మోటో కార్ప్ విశ్వాసాన్ని కంపెనీ వ్యక్తం చేసింది. కేంద్ర బడ్జెట్‌ ద్వారా వ్యవసాయం, సామాజిక రంగాలకు కొత్త ఊతం లభిస్తుందని కంపెనీ భావిస్తోంది. 

కాకపోతే డిసెంబర్ నెలతో ముగిసిన మూడో త్రైమాసికంలో హీరో మోటోకార్ప్‌ స్టాండ్‌ఎలోన్‌ నికర లాభం 4.5 శాతం తగ్గి రూ.769.1 కోట్లకు చేరుకుంది. ఈ త్రైమాసికంలో అధికంగా వాహనాలను విక్రయించినా వ్యయాలు పెరగడం వల్ల కంపెనీ లాభాలకు గండి పడింది.

గత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ రూ.805.43 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇక సంస్థ మొత్తం ఆదాయం రూ.7,424.23 కోట్ల నుంచి రూ.8,052.46 కోట్లకు చేరుకుంది. ఇదే కాలంలో మొత్తం వ్యయాలు 9.81 శాతం వృద్ధితో రూ.6,296 కోట్ల నుంచి రూ.6,914 కోట్లకు చేరుకున్నాయి. గురువారం బీఎస్ఈలో హీరో మోటోకార్ప్‌ షేర్ 0.12 శాతం లాభంతో రూ.2,612.05 వద్ద ముగిసింది.
 

click me!