మోటారు బైకులు, స్కూటర్లను విలాస వస్తువుల జాబితా నుంచి తప్పించాలని హీరో మోటో కార్ప్స్ చైర్మన్ పవన్ ముంజాల్ పేర్కొన్నారు. వీటి కొనుగోళ్లపై విధిస్తున్న 28 శాతం జీఎస్టీని 18 శాతానికి తగ్గించాలని, తద్వారా దేశ సమగ్ర ఆర్థిక ప్రగతిలో ఆటోమొబైల్ రంగానికి చోటు కల్పించాలని కోరారు.
ద్విచక్ర వాహనాల విక్రయాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కేవలం 18 శాతానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హీరోమోటో కార్ప్ కంపెనీ డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం ద్విచక్ర వాహనాల విక్రయాలపై కేంద్రం 28 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నది.
2018లో హీరో మోటో కార్ప్ సేల్స్ రికార్డు నెలకొల్పాయి. ఎనిమిది లక్షలకు పైగా మోటారు సైకిళ్లను హీరో మోటో కార్ప్ విక్రయించింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ద్విచక్ర వాహనాల కొనుగోలు దారులకు రిలీఫ్ కల్పించాల్సిన అవసరం ఉన్నదని హీరో మోటో కార్ప్ భావిస్తోంది.
undefined
మోటారు సైకిల్‌ను విలాస వస్తువు కేటగిరీ నుంచి తప్పించి.. సామూహిక వాడకం వస్తువుల జాబితాలో చేర్చి జీఎస్టీని 28 నుంచి 18 శాతానికి తగ్గించాలని హీరో మోటో కార్ప్ చైర్మన్ పవన్ ముంజాల్ ఒక ప్రకటనలో తెలిపారు.
జీఎస్టీ తగ్గింపుతో లక్షల మంది మోటారు సైకిళ్ల వినియోగదారులతోపాటు ఆటోమొబైల్ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారికి కూడా చేయూతనిచ్చినట్లు అవుతుందని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనాలపై జీఎస్టీ తగ్గింపు అత్యవసరమని, సుస్థిర సమగ్ర ఆర్థికాభివ్రుద్ధిలో ఆటోమొబైల్ రంగం పాత్ర బలోపేతానికి ఉపకరిస్తుందని హీరో మోటో కార్ప్స్ చైర్మన్ పవన్ ముంజాల్ తెలిపారు.
కర్బన ఉద్గారాల నియంత్రణ కోసం ప్రతి వాహన వినియోగదారుడు ‘బీఎస్-6’ ప్రమాణాలతో కూడిన వాహనాల దిశగా పరివర్తన చెందాల్సి ఉన్నదని, అత్యధిక జీఎస్టీ శ్లాబ్ అమలు చేయడం వల్ల వాహనాల కొనుగోలు దారులపై అదనపు భారం పడుతుందని పేర్కొన్నారు.
2018లో తాము పలు సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చిందని హీరో మోటో కార్ప్స్ చైర్మన్ పవన్ ముంజాల్ తెలిపారు. మార్కెట్లో అనిశ్చితి, కరెన్సీ, కమొడిటీస్‌లో మందగమనం, అంతర్జాతీయంగా జియో పొలిటికల్, వాణిజ్య యుద్ధాలు కూడా వాహనాల కొనుగోళ్లపై ప్రతికూల ప్రభావం పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.
దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో పండుగల సీజన్‌లో బీమా వసతి కల్పన కోసం ద్విచక్ర వాహనం కొనుగోలు వ్యయం పెరిగిపోయిందని హీరో మోటో కార్ప్స్ చైర్మన్ పవన్ ముంజాల్ తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో యావత్ ఆటోమొబైల్ రంగంపై ‘ఆటోమొబైల్ - బీమా’ వ్యయం ప్రభావం పడిందని చెప్పారు. చివరి త్రైమాసికంలో పరిస్థితిలో మెరుగుదల ఉంటుందని పవన్ ముంజాల్ అంచనా వేశారు.
2018లో హీరో మోటో కార్ప్స్ ఆధ్వర్యంలో 80,39,472 మోటారు సైకిళ్లు, స్కూటర్లు అమ్ముడు పోయాయి. 2017తో పోలిస్తే 2018లో 11 శాతం పురోగతి నమోదైందని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ ముంజాల్ తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ - డిసెంబర్ మధ్య 60,37,901 యూనిట్లు విక్రయించింది. 2018 డిసెంబర్ నెలలో 4,53,985 యూనిట్లు అమ్మిన హీరో మోటో కార్ప్స్.. 2017లో 4,72,731 యూనిట్లు విక్రయించింది. దీని ప్రకారం గత నెలలో సుమారు 19 వేల బైక్ లు, స్కూటర్ల విక్రయాలు తగ్గాయి.
18 శాతం పెరిగిన బజాజ్ ఆటో సేల్స్
2017తో పోలిస్తే బజాజ్ ఆటో 2018 డిసెంబర్ నెల విక్రయాల్లో 18 శాతం పురోగతి నమోదు చేసింది. 2017లో 2,92,547 వెహికల్స్ విక్రయించిన బజాజ్ ఆటో.. గతనెలలో 3,46,199 యూనిట్లను విక్రయించింది. మోటారు సైకిళ్ల విభాగంలో 31 శాతం అభివ్రుద్ధి రికార్డైంది. వాణిజ్య వాహనాల విభాగం విక్రయాల్లో మాత్రం 24 శాతం క్షీణత నమోదైంది.