పండుగల వేళ కుటుంబ యజమాని గానీ, ఉన్నత చదువులు చదివే పిల్లల కోసం గానీ వాహనాలు కొంటారు. కానీ ఈ దఫా దసరా వాహనాల కొనుగోళ్లు పెదవిరిచాయనే చెప్పాలి. టాటా మోటార్స్, ఫోర్డ్ ఇండియా మాత్రమే డబుల్ డిజిట్ విక్రయాలు సాగించాయి.
బ్యాంకుల వడ్డీ రేట్లు, ఆకాశాన్నంటేలా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, ప్రకోపించిన ప్రక్రుతి వల్ల పండుగ సీజనైనా ఆటోమొబైల్ రంగానికి అంటే మోటార్ బైక్ లు, కార్ల తయారీ సంస్థలకు అక్టోబర్ నెల అంతగా అచ్చి రాలేదు.
అంతంత మాత్రంగానే అమ్మకాలు నమోదయ్యాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా, టయోటా, హోండా కార్స్ వంటి దిగ్గజాల కార్ల అమ్మకాల వృద్ధి కూడా 1– 2 శాతంగా సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. టాటా మోటార్స్, ఫోర్డ్ ఇండియా మాత్రమే కాస్త చెప్పుకోతగినట్లు కార్లు విక్రయించగలిగాయి.
దేశీయంగా మారుతీ సుజుకీ అమ్మకాలు 1,38,100 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఇది 1.5 శాతం మాత్రమే అధికం. ఆల్టో, స్విఫ్ట్, బాలెనో వంటి మినీ, కాంపాక్ట్ సెగ్మెంట్ కార్ల అమ్మకాలు మెరుగ్గానే ఉన్నా యుటిలిటీ వాహనాల విక్రయాలు మాత్రం తగ్గాయి.
విదేశాలకు ఎగుమతి చేసిన కార్లు 8,666 యూనిట్లకు చేరాయి. పురోగతి కేవలం 0.2 శాతం మాత్రమే నమోదైంది. ఆల్టో, వాగన్ ఆర్ మోడల్ కార్ల విక్రయాల్లో స్వల్ప సానుకూలత నమోదై 1.1 శాతం వ్రుద్ధి రికార్డైంది. నూతన తరం డిజైర్ శుభారంభాన్ని అందుకున్నది. 3.7 శాతం వ్రుద్ధిని నమోదు చేసింది.
మరోవైపు, పోటీ సంస్థ హ్యుందాయ్ 4.9 శాతం వృద్ధితో 52,001 వాహనాలు విక్రయించింది. అయితే గత నెల 23వ తేదీన మార్కెట్లో విడుదల చేసిన హ్యుండాయ్ శాంత్రో కార్లు 8,500 విక్రయించింది. కుముల్యేటివ్ సేల్స్ తో కలిపి 65,020 కార్లకు చేరుకున్నాయి.
ఎగుమతుల్లో 3.7 శాతం వ్రుద్ధి నమోదైంది. నెలవారీ అమ్మకాల్లో కంపెనీకి ఇవే అత్యుత్తమ గణాంకాలు. కొత్త శాంత్రోతోపాటు క్రెటా, ఎలీట్ ఐ20, గ్రాండ్ ఐ10 తదితర వాహనాలకు డిమాండ్ ఇందుకు తోడ్పడింది.మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ ప్యాసింజర్ వాహన విక్రయాలు 3 శాతం వృద్ధితో 24,066 యూనిట్లకు పెరిగాయి.
కొనుగోలుదారుల సెంటిమెంటు బలహీనపడటంతో కొద్ది నెలలుగా ప్యాసింజర్ వాహనాల సెగ్మెంట్ రిటైల్ అమ్మకాలు మందగించినట్లు మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ విభాగం ప్రెసిడెంట్ రాజన్ వధేరా చెప్పారు. ఈ నేపథ్యంలో పండుగ సీజన్ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు.
ఇంధన రేట్లు, అధిక వడ్డీ రేట్లు, బీమా ప్రీమియం పెంపు వంటి ప్రతికూల అంశాలు ఉన్నాతమ వాహనాలకు డిమాండ్ మెరుగ్గానే కనిపించిందని టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) డిప్యూటీ ఎండీ ఎన్ రాజా చెప్పారు. టీకేఎం 2 శాతం వృద్ధితో 12,606 యూనిట్లు విక్రయించింది. గత నెలలో టయోటా కిర్లోస్కర్ కార్లలో 1,597 కార్లు ఎగుమతి చేసింది. కానీ మొత్తం కార్ల విక్రయాల్లో ఐదు శాతం తగ్గిపోయింది.
అటు హోండాకార్స్ ఇండియా విక్రయాలు 14,234 యూనిట్ల నుంచి 14,233 యూనిట్లకు పరిమితమయ్యాయి. గతంతో పోలిస్తే ఈసారి పండుగ సీజనైనా కొనుగోలుదారుల సెంటిమెంట్ బలహీనంగా ఉందని హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గోయల్ చెప్పారు. అమేజ్, కొత్తగా ప్రవేశపెట్టిన సీఆర్–వీ వాహనాలకు డిమాండ్ మెరుగ్గా ఉన్నదన్నారు.
అక్టోబర్‌లో టాటా మోటార్స్, ఫోర్డ్ ఇండియా రెండంకెల స్థాయిలో వృద్ధి సాధించాయి. పరిశ్రమ వృద్ధి రెండు శాతానికే పరిమితమైనా.. ప్రతికూలతలు ఉన్నా తాము 11 శాతం నమోదు చేసినట్లు టాటా మోటార్స్ ప్రెసిడెంట్ మయాంక్ పరీఖ్ చెప్పారు. గత నెలలో టాటా మోటార్స్ విక్రయాలు 11 శాతం వృద్ధితో 18,290 యూనిట్లకు పెరిగాయి.
అటు ఫోర్డ్ ఇండియా అమ్మకాలు కూడా 4,218 యూనిట్ల నుంచి 9,044 యూనిట్లకు చేరాయి. బ్రాండ్‌ను పటిష్టపర్చుకోవడం, సరైన ఉత్పత్తిని పోటీ సంస్థలకు దీటైన రేటులో అందించడం, అమ్మకాల ప్రక్రియ మెరుగుపర్చుకోవడం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి పెడుతుండటం తమకు కలిసి వచ్చినట్లు ఫోర్డ్ ఇండియా ప్రెసిడెంట్ అనురాగ్ మెహరోత్రా చెప్పారు.
ద్విచక్ర వాహనాల విభాగంలో మార్కెట్ లీడర్ హీరో మోటోకార్ప్ 16.4 శాతం వృద్ధి నమోదు చేసింది. గత అక్టోబర్‌లో 6,31,105 యూనిట్లు విక్రయిస్తే ఈసారి 7,34,668 వాహనాలను విక్రయించింది. అటు హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా అమ్మకాలు 12 శాతం వృద్ధితో 4,66,552 యూనిట్ల నుంచి 5,21,159 యూనిట్లకు పెరిగాయి.
టీవీఎస్ మోటార్ కంపెనీ 26 శాతం వృద్ధి సాధించింది. 3,98,427 వాహనాలను విక్రయించింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు ఒక్క శాతం పెరిగి 70,451కి చేరాయి. అటు సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా 31 శాతం వృద్ధితో 65,689 వాహనాలను విక్రయించింది.