వాహనాల విక్రయ మార్కెట్: జూన్‌లో ఊపునిచ్చిన కొత్త మోడళ్లు

First Published 3, Jul 2018, 2:19 PM IST
Highlights

నూతన మోడళ్లు మార్కెట్‌లో రంగ ప్రవేశం చేయడంతో గత నెలలో వివిధ ఆటోమొబైల్ సంస్థల ఉత్పత్తుల విక్రయాలు ఊపందుకున్నాయి.

ముంబై: నూతన మోడళ్లు మార్కెట్‌లో రంగ ప్రవేశం చేయడంతో గత నెలలో వివిధ ఆటోమొబైల్ సంస్థల ఉత్పత్తుల విక్రయాలు ఊపందుకున్నాయి. దేశంలోనే టాప్ కార్ల ఉత్పత్తుల సంస్థలు మారుతి సుజుకి, హుందాయి మోటార్స్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా కిర్లోస్కర్ సంస్థల ఆధ్వర్యంలోని కార్ల విక్రయాలు 43.7 శాతం పెరిగాయి. గతేడాదితో పోలిస్తే 1,50,772 కార్లు విక్రయిస్తే ఈ ఏడాది జూన్ నెలలో 2,16,660 కార్లు అమ్ముడు పోయాయి. ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి దేశీయ విక్రయాలు 45.32 శాతం పెరిగాయి. కంపాక్ట్ కార్ల విభాగంలో 76.7 శాతం పురోగతి సాధించింది మారుతి సుజుకి. ప్రత్యేకించి స్విఫ్ట్, బాలెనో, సెడాన్ డిజైర్ మోడల్ కార్లకు ఎక్కువ డిమాండ్ లభించింది. ఆల్టో, వాగనర్ విక్రయాల్లో 15.1 శాతం పెరిగాయి.

హుందాయ్ మోటార్స్ విక్రయాల్లో 20.8 శాతం పెరుగుదల


హుందాయ్ మోటార్స్ తయారుచేసిన కార్ల విక్రయాల్లో గతేడాదితో పోలిస్తే గత జూన్‪లో 45,371 కార్లు పెరిగి 20.8 శాతం పెరిగింది. ఎస్‌యూవీ మోడల్‌తోపాటు గ్రాండ్ ఐ10, ఎలైట్ ఐ20 మోడల్, వెర్న సెడాన్ మోడళ్లకు ఎక్కువ డిమాండ్ లభించింది. టాటా మోటార్స్ విక్రయాల్లో గత జూన్ నెలలో 62.9 శాతం పెరిగి 18,213 యూనిట్లకు చేరాయి. టియాగో, టైగర్ సెడాన్, ఎస్‌యూవీ నెక్సన్, ఎస్‌యూవీ హెక్సా మోడల్ బారీగా విక్రయాలు సాగాయి. ఇక బొలెరో ఎస్‌యూవీ మోడల్ తయారీ మహీంద్రా అండ్ మహీంద్రా ఆధ్వర్యంలోని వాహనాల విక్రయాలు జూన్ నెలలో 11.9 శాతం పెరిగాయి. 

బజాజ్ సేల్స్ భళా


ఆటోమొబైల్ వాహనాల విక్రయాల్లో బజాజ్‌ ఆటో విక్రయాలు బేష్షుగ్గా ఉన్నాయి. జూన్‌లో ఏకంగా 65 శాతం పెరిగాయి. గత ఏడాది ఇదే నెలలో సంస్థ 2,44,878 వాహనాల్ని విక్రయించగా, ఈ ఏడాది 4,04,429 వాహనాల్ని విక్రయించింది. ద్విచక్రవాహనాల విక్రయాలు కూడా 65 శాతం వృద్థి సాధించి  2,04,667 నుంచి 3,37,752 వాహనాలకు చేరుకున్నది. హీరో మోటోకార్ప్‌ జూన్‌లో 7,04,562 ద్విచక్ర వాహనాల్ని విక్రయించింది. గతేడాది ఇదే నెలలో సంస్థ అమ్మిన 6,24,185 వాహనాలతో పోలిస్తే 13% అధికం అని పేర్కొంది. ఇక టీవీఎస్ మోటార్స్ విక్రయాలు 15 శాతానికి పైగా పెరిగాయి. గతేడాది జూన్‌లో 2,73,791 వాహనాలు విక్రయించగా తాజాగా 3,13,614కు చేరాయి. 

28 శాతం పెరిగిన హోండా మోటార్స్ విక్రయాలు


హోండా మోటార్ సైకిల్ విక్రయాలు జూన్‌లో 28 శాతం పెరిగాయి. గత ఏడాది ఇదే నెలలో సంస్థ 4,44,528 వాహనాలు విక్రయించగా ఈ ఏడాది జూన్‌లో 5,71,020కు పెరిగాయి. అశోక్‌ లేలాండ్‌ వాహనాల అమ్మకాలు జూన్‌లో 28 శాతం వృద్ధి చెందాయి. గత ఏడాది జూన్‌లో 12,333 వాహనాల్ని విక్రయించగా, ప్రస్తుతం 15,791 వాహనాల్ని విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. 

ఎస్కార్ట్‌ ట్రాక్టర్ల దేశీయ అమ్మకాలు అమ్మకాలు జూన్‌లో  72.1 శాతం వృద్ధితో 5,669 నుంచి 9,758కు చేరాయి.73 శాతం వృద్ధి చెందాయి. కానీ ఫోర్డ్‌ ఇండియా వాహనాల అమ్మకాలు జూన్‌ నెలలో 9.59 శాతం తగ్గి 20,828 వాహనాల నుంచి 18,830 వాహనాలకు పరిమితమయ్యాయి. సుజుకీ మోటార్‌సైకిల్‌ ఇండియా దేశీయ అమ్మకాలు జూన్‌లో 39 శాతం వృద్ధి సాధించి 46,717కు చేరాయి. ఇక కార్లు, ద్విచక్ర మోటారు బైక్‌ల కొత్త మోడళ్లను మార్కెట్లలో ప్రవేశపెట్టడం వల్ల కూడా జూన్ నెలలో వాహనాల విక్రయాల పెరుగుదలకు కారణమని తెలుస్తోంది. 

Last Updated 3, Jul 2018, 2:19 PM IST