కలలోకి పాము.. జాతకంలో నాగ సర్ప దోషం

By telugu news teamFirst Published Mar 22, 2020, 7:45 AM IST
Highlights

జాతక చక్రంలో నాగదోషం వలన ముఖ్యంగా వివాహం ఆలస్యం కావటం సంతాన సమస్యలు ఎదుర్కోవటం జరుగుతుంది. జాతకచక్రంలో రాహువు గాని కేతువు గాని 1, 2, 5, 7, 8 స్ధానాలలో ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకుండా అశుభ స్ధానాలలో ఉన్న నాగదోషం (సర్పదోషం) అంటారు. 
 

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

జాతకమునందు కాల సర్పదోషం ఉన్నటువంటి వారు.. పూర్వజన్మలో లేదా ఈ జన్మలో పాములను చంపినవారైన అయి ఉండాలి ... లేదా వివిధ మంత్ర ఔషదులతో సర్పముల బంధించినవారు.. పుట్టలను త్రవ్వినవారు.. పుట్టలను తొలగించి వాటిపై గృహాలు కట్టి నివసించేవారికి ... వ్యక్తీ గత జాతకలో సర్ప దోషం కలవారు వివాహం ... సంతానం.. కుటుంబం .. వ్యవహార అభివృద్ధిలో .. ఆరోగ్య.. విషయాల్లో అత్యధిక ప్రభావం చూపి భాదించును.

జాతక చక్రంలో నాగదోషం వలన ముఖ్యంగా వివాహం ఆలస్యం కావటం సంతాన సమస్యలు ఎదుర్కోవటం జరుగుతుంది. జాతకచక్రంలో రాహువు గాని కేతువు గాని 1, 2, 5, 7, 8 స్ధానాలలో ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకుండా అశుభ స్ధానాలలో ఉన్న నాగదోషం (సర్పదోషం) అంటారు. 

ఆలస్య వివాహాలు, ఎప్పుడు ఏదో విధమైన వైరాగ్యం, మోసపోవటం, ఇతరుల ప్రలోభాలకు లొంగిపోవటం, కుటుంబంలో కలతలు, మంచిగా చెప్పిన తప్పుగా అర్ధం చేసుకోవటం, భార్య భర్తల మధ్య తగాదాలు, విడిపోవటం కూడా జరుగుతాయి.

జాతకచక్రంలో పంచమ స్ధానంలో రాహువు గాని కేతువు గాని ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకున్న సంతానం ఆలస్యం కావటం, సంతానం లేకపోవటం, అబార్షన్స్ కావటం జరుగుతుంది. పంచమంలో రాహువు ఉంటే నాగ దోషం ఉంటుంది. దీని నివారణకు నిత్య పూజలు జరిగే ఆలయంలో నాగ దేవతా ప్రతిష్టాపన చేస్తే దోష నివారణ కలుగుతుంది. వ్యామోహాలకు లొంగిపోతారు. ప్రేమలో మోసపోతారు. భార్యా భర్తల మధ్య అనవసరమైన అపోహలు, కుటుంబంలో కలతలు, అనారోగ్యాలు, భార్యా భర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుంటాయి.

జాతకచక్రంలో అష్టమ స్ధానంలో రాహువు గాని కేతువు గాని ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకున్న అనారోగ్య సమస్యలు, తిండి సరిగా తినకపోవటం, దురుసుగా మాట్లాడ్తం, పాము కలలు రావటం జరుగుతుంది.

"అపుత్రాః పుత్రశోకం చకూరుపః పుత్ర జాయతే
ఆభర్తా పతిహీనం చ పతి సంగ వివర్జితాః 
భర్తృత్యక్తా భవేద్రోగా జీవనం దుర్భరం భవేత్ 
సర్పదోషా భవేర్యస్తు కష్టశోక భయావహమ్"

నాగదోషం ఉన్న జాతకులకు అశాంతి కలిగంచే పరిస్థితులు ఏర్పడతాయి. సంతానం కలుగకపోవడంతో పాటు ఆర్థిక సమస్యలు, వివాహంలో జాప్యం, అంగవిహీనులైన సంతతి జన్మించడం, పుత్రశోకం, వైవాహిక జీవితంలో ఆటంకాలు నాగదోషము వల్లనే ఏర్పడుతాయని పురాణాలు చెబుతున్నాయి.

నాగదోష నివారణకు శుభతిథులను ఎంచుకుంటే ఇలాంటి దుష్ఫలితాలను నుంచి బయటపడవచ్చు. నాగులకు శుక్లచవితి, శుక్లపంచమి తిథులు, శుక్రవారము, ఆదివారము విశిష్టము.

అయితే పౌర్ణమి, దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులు, కృష్ణ పక్షము నాగపూజకు అనువైన శుభదినాలు కావు. నాగ శాంతి, పూజలు వీలైనంత వరకు శుక్ల పక్షములో చవితి, పంచమి రోజుల్లో కానీ అంతకు పూర్వదినములలోగాని నిర్వర్తించడం ద్వారా ఆ గృహమున అరిష్టములు తొలగి వంశవృద్ధి, ఆరోగ్యాభివృద్ధి, ప్రశాంతత కలుగుతుంది.

దోష ప్రభావాన్ని బట్టి మాత్రమే పరిష్కారం ఉంటుంది. 

*నాగ దోషం తీవ్రమైనది అయినట్లయితే ఎక్కడైనా దుర్గా అమ్మవారి ఆలయంలో నిద్రచేసి మరుసటి దినమున శివదర్శనం చేసుకొని రాహుకేతువుల పూజా దానములు చేసిన నివారణ జరుగును.

*ఆరు ముఖాలు, ఎనిమిది ముఖాల రుద్రాక్షలను ధరించుట శుభమగును.

*ప్రతీ శుక్లపక్ష పాడ్యమి అమావాస్య తిధులల్లో శనివారం నాడు గుర్రాలకు గుగ్గిళ్లు పెట్టుట, పక్షులకు ఆహారం పెట్టుట వలన కూడా నివారణ కలుగును.

*నాగ ప్రతిమ ( సుబ్రహ్మణ్య )స్వామికి  27రోజులు పూజించి ఏదైనా నిత్య పూజలు జరిగే ఆలయంలో దానము చేయట చేత నివారణ మగును.

*ప్రతీ సోమవారం రాహుకాలమందు నాగదేవతకు పాలతో అభిషేకించి క్షీరాన్నం నివేదించి పాలను దానం చేయుట వలన కూడా నివారణమగును.

*నవగ్రహములకు ఇరవైఒక దినములు ప్రదక్షిణలు చేయుటచేత శుభమగును. రాహు కాలంలో రాహుకాల దీపాలు పెట్టటం వలన కూడా నివారణ జరుగును.

*ప్రతీ ఆదివారం ఉపవాసముంటు నాగదేవతాలయం చుట్టు ప్రదక్షిణలు చేస్తూ లలితా సహస్రనామావళి గాని, దుర్గా సప్తసతి పఠించిన శుభమగును.

*అధిక ప్రభావం కలవారు దేవాలయమునందు సుబ్రహ్మణ్య లేదా నాగదేవతా విగ్రహ ప్రతిష్ఠాపన చేయుట వలన పూర్తి దోష నివృత్తి అగును.

*అప్పుడప్పుడు అమ్మవారికి కుంకుమార్చన చేపించటం వలన కూడా దోషం నివారణ అగును.

*నిత్యం దేవి సప్తశతి పారాయణం చేయట కూడా శాంతి కలిగించును. మంగళవారం రోజు గాని ఆదివారం రోజు గాని ఉపవాసం ఉన్న దోషం నివారణ అగును.

*రాహు కేతువులకు మూలమంత్ర జపములు తర్పణంలు హోమము దానము చేయుటచేత కూడా దోష నివారణయగును.

*ప్రతీ మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని అర్చించుట అభిషేకించుట కూడా సత్ఫలితాలనిచ్చును.

*మినుములు. నువ్వులు. ఉలువలు,బెల్లం  ప్రతీ మంగళవారం గోవునకు ఆహారంగా దానము చేయుచు ఉన్న దోష నివృత్తియగును.

పైన చెప్పిన పరిహారాలు వలన కొంతవరకూ దోష నివృత్తి అయ్యే అవకాశం కలదు. పూర్వజన్మలో చేసిన పొరపాట్ల వలన ఆ దోషం ఈ జన్మలో కూడా వెంటాడుతూ వస్తుంది. ఈ దోషాలను జాతక చక్రమును పరిశీలించడం వలన గుర్తించవచ్చును. జాతక చక్రమును అనుసరించి దోషనివారణ చేసుకున్న యెడల పూర్తిగా దోషనివారణజరిగే అవకాశం ఉన్నది.

click me!