మనుషులంతా ఆత్మ స్వరూపులు

Published : Mar 16, 2022, 12:12 PM IST
మనుషులంతా ఆత్మ స్వరూపులు

సారాంశం

పరబ్రహ్మాన్ని ఆకాశంతో పోలుస్తారు మహాత్ములు. అది నిర్మలంగా, దోషరహితంగా, ఎల్లలు లేనిదిగా, నిశ్చలంగా, నిర్వికారంగా, లోపలా బయటా అనే తేడాలు లేకుండా, ఒకే ఒక్కటిగా కనిపిస్తూ ఉంటుంది.

నేను....నేను అనేది ఈ శరీరం కాదని, ఆత్మ అని తెలుసుకోవడమే మానవ జీవిత లక్ష్యం. మనుషులంతా ఆత్మ స్వరూపులని జ్ఞానులంటారు. శరీరంతో ఆత్మ తాదాత్మ్యం చెందినప్పుడు మనిషిలో 'నేనే అన్నింటికీ కర్తను, అనుభవించే భోక్తను' అన్న అహంకారం కలుగుతుంది. ఈ భావనలే మానవ జీవిత వినాశనానికి దారితీస్తున్నాయి. పంచకోశాలు- అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం అన్నవి ఒకదానికంటే మరొకటి సూక్ష్మమైనవి. ఇవి స్థూలదేహాన్ని, ప్రాణాన్ని, మనసును, బుద్ధిని, అంతరాత్మను ఆవరించిఉండి మసకబారుస్తాయి. 

ఈ శరీరం అన్నగతమైంది. ఆహారం లభిస్తే ఉంటుంది, లేదంటే నశిస్తుంది. అందువల్ల దీన్ని అన్నమయ కోశం అంటారు. కర్మేంద్రియాలను నడిపించే ప్రాణ శక్తిని ప్రాణమయ కోశం అంటారు. ఇది అన్నమయ కోశం అంతటా వ్యాపించి ఉంటుంది. జ్ఞానేంద్రియ పంచకాన్ని, మనసును కలిపి మనోమయకోశం అంటారు. మనిషిలోని అహానికి ఇదే ప్రధాన కారణం. విజ్ఞానమయ కోశం జీవాత్మకున్న అన్ని అవస్థల్లోనూ ఆత్మను అనుకరిస్తుంటుంది. జ్ఞానం ఉన్నా శరీరంతో, ఇంద్రియాలతో తాదాత్మ్యం చెందుతుంటుంది. మనిషి అధోగతికి కారణమవుతుంది. అనాది నుంచి అస్తిత్వం కలిగిఉండి, అహంకార స్వభావంతో, సమస్త వ్యాపారాలు (కర్మలు) జీవాత్మ చేత చేయించేది విజ్ఞానమయ కోశమే. మనకు ప్రీతినిచ్చేది పొందినప్పుడు అనుభవానికొచ్చేది ఆనందమయ కోశం. అనాత్మలైన ఈ అయిదు కోశాలను వివేకంతో అధిగమించినప్పుడు ఆత్మజ్ఞానం కలుగుతుంది.


పరబ్రహ్మాన్ని ఆకాశంతో పోలుస్తారు మహాత్ములు. అది నిర్మలంగా, దోషరహితంగా, ఎల్లలు లేనిదిగా, నిశ్చలంగా, నిర్వికారంగా, లోపలా బయటా అనే తేడాలు లేకుండా, ఒకే ఒక్కటిగా కనిపిస్తూ ఉంటుంది. అదే అంతరాత్మ. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే శత్రువులను ఓడించి, మనసును అధీనంలో ఉంచుకుని తానే పరబ్రహ్మ స్వరూపమని తెలుసుకొన్నవాడు- బ్రహ్మవేత్త అంటారు వివేక చూడామణిలో ఆది శంకరాచార్యులవారు. ఆకలి, దప్పిక, దుఃఖం, క్షీణించడం, మరణించడం, భ్రాంతి అనేవి షడూర్ములు. వీటికి అతీతంగా ఉంటూ హృదయంలో సదా పరబ్రహ్మను ధ్యానిస్తూ ఉండాలన్నది పురాణ వచనం.

విషయ వాంఛలను విడిచిపెట్టడం అంత సులువు కాదు. వేదవేదాంగాల్ని, పురాణాలను వింటూ, పఠిస్తుంటే ముక్తి మార్గం పట్టినట్టు కాదు. ఇవన్నీ పైపై మెరుగులు. తానేమిటో తెలుసుకోలేని వ్యక్తి మరో వ్యక్తికి ఎన్నటికీ దారి చూపించలేడు. డాంబికాలకు తలొగ్గడం చిల్లి పడవలో ప్రయాణం వంటిది! నిత్యానిత్య విచక్షణ చేయగలిగి, వేద వాంగ్మయంపై విశ్వాసం కలిగి, పరమాత్మపై ఏకాగ్ర దృష్టి కలవాడై, మోక్షసాధన చేసేవాణ్ని పండితుడని అంటారు.


అనాదిగా ముముక్షువులు తగిన జ్ఞాన సముపార్జనతో, సాధనసంపత్తితో, అజ్ఞానాన్ని దూరం చేసుకొని ఆత్మజ్యోతి దర్శనంతో అఖండంగా ప్రజ్వరిల్లుతూ నిస్వార్థంగా మనకు దారి చూపారు.
ఆ దారి పట్టుకోగలగాలి. వాసనా వాంఛల్ని ఉల్లిపొరల్ని వలిచినట్లు వదిలించుకుంటూ శ్రద్ధగా, దీక్షగా ఏ దశలోనూ నమ్మకం సడలకుండా, ఆ దారిలో ప్రయాణించేవారు, ఆత్మ సారథ్యంలో, శరీరాన్ని జాగ్రత్తగా పరమాత్మలో లీనం చేయడానికి ఉపక్రమించారు. వారి జీవితం మార్గదర్శకం, అనుసరణీయం.


డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ketu Transit 2026: కొత్త ఏడాదిలో 3 రాశులపై కేతువు కరుణ, డబ్బుతో పాటూ గౌరవం ఇస్తాడు
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారు అవసరానికి చేతిలో డబ్బులేక ఇబ్బంది పడతారు!