డేటా చోరీ కేసు: డైరెక్ట్ అటాక్ కి దిగిన ఏపీ సర్కార్, తెలంగాణ ప్రభుత్వంపై ఎదురుకేసు

By Nagaraju penumalaFirst Published Mar 6, 2019, 4:29 PM IST
Highlights

అటు డేటా చోరీ కేసులో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిన తీరును నిరసిస్తూ కోర్టులో పరువు నష్టం దావా వెయ్యాలని కూడా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. డేటా చోరీ కేసులో ఏపీ ప్రభుత్వం పరువుకు ఇబ్బంది కలిగేలా తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం వ్యవహరించిందని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించాలని ఏపీ సర్కార్ యోచిస్తోంది. 

అమరావతి: డేటా చోరీ కేసులో  కీలక మలుపు చోటు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా అగ్గిరాజేస్తున్న డేటా చోరీ వ్యవహారం నేపథ్యంలో డైరెక్ట్ అటాక్ దిగేందుకు రెడీ అయ్యింది తెలుగుదేశం పార్టీ.  తెలంగాణ ప్రభుత్వంపై కేసు పెట్టాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. 

ఏపీ ప్రజలకు సంబంధించి డేటాను తెలంగాణ ప్రభుత్వం చోరీ చేసిందని ఆరోపిస్తూ కేసు పెట్టాలని టీడీపీ నిర్ణయించింది. తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి కంపెనీలోకి తెలంగాణ పోలీసులు వెళ్లి డేటాను చోరీ చేశారంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. 

తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమాచారం, ప్రజలకు ప్రభుత్వం అందజేసిన సంక్షేమ పథకాలపై వివరాలు సేకరిస్తే తప్పేంటని టీడీపీ సమర్థించుకుంటుంది. ప్రజలకు సంబంధించి వ్యక్తిగత భద్రతకు ఇబ్బందులు కలిగేలా ఎలాంటి డేటా తాము సేకరించలేదని చెప్తోంది. 

అటు డేటా చోరీ కేసులో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిన తీరును నిరసిస్తూ కోర్టులో పరువు నష్టం దావా వెయ్యాలని కూడా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. డేటా చోరీ కేసులో ఏపీ ప్రభుత్వం పరువుకు ఇబ్బంది కలిగేలా తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం వ్యవహరించిందని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించాలని ఏపీ సర్కార్ యోచిస్తోంది. 

ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అడ్వకేట్ జనరల్ తో సమావేశమై ఎప్పుడు కేసులు నమోదు చెయ్యాలి, కోర్టును అప్రోచ్ అయ్యే విధానంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. బుధవారం సాయంత్రం లేదా గురువారం సాయంత్రం కేసులు పెట్టేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. 

డేటా చోరీ వ్యవహారం ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరంగా యుద్ధ వాతావరణం నెలకొంది. గత కొద్ది రోజులుగా ఈ అంశం రాజకీయాలను కుదిపేస్తోంది. తాజాగా ఈ వ్యవహారంలో ఏపీ సర్కార్ డైరెక్ట్ అటాక్ కి దిగడంతో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. 

మరోవైపు పనిలోపనిగా వైసీపీని కూడా ఇరుకున పెట్టేందుకు టీడీపీ పావులు కదుపుతోంది. తటస్థుల పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ నేతలకు ఫోన్లు చేస్తున్నాయని, పార్టీలోకి రావాలంటూ ప్రలోభాలు పెడుతోందని ఆరోపిస్తుంది. 

ఈ అంశానికి సంబంధించి ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మంగళవవారం మీడియాముందు వైసీపీ కాల్స్ ను బయటపెట్టారు. ప్రజల డేటాను తాము సేకరించలేదని టీడీపీ నేతలకు సంబంధించి డేటాను సేకరించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపిస్తూ కేసులు పెట్టేందుకు టీడీపీ రెడీ అవుతోందని తెలుస్తోంది.  

click me!