కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరుకానున్న వైసీపీ.. అన్ని పార్టీలు హాజరు కావాలని కోరిన సీఎం జగన్..

Published : May 25, 2023, 08:30 AM ISTUpdated : May 25, 2023, 09:06 AM IST
కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరుకానున్న వైసీపీ.. అన్ని పార్టీలు హాజరు కావాలని కోరిన సీఎం జగన్..

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మే 28న జరగనున్న కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంలో పాల్గొననుంది. ఈ విషయాన్ని వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ధ్రువీకరించారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మే 28న జరగనున్న కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంలో పాల్గొననుంది. ఈ విషయాన్ని వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ధ్రువీకరించారు. కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం చారిత్రాత్మకమైనదని పేర్కొన్న జగన్.. నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తితో తమ పార్టీ హాజరవుతుందని చెప్పారు. ఇలాంటి శుభకార్యక్రమాన్ని బహిష్కరించడం నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదని అన్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు హాజరుకావాలని కోరారు. 

‘‘గొప్ప, విశాలమైన పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీకి అభినందనలు. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటు..మన దేశం ఆత్మను ప్రతిబింబిస్తుంది. ఇది మన దేశ ప్రజలకు, అన్ని రాజకీయ పార్టీలకు చెందినది. ఇలాంటి శుభకార్యక్రమాన్ని బహిష్కరించడం నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదు. రాజకీయ విభేదాలన్నింటినీ పక్కనపెట్టి.. ఈ మహత్తర కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు హాజరుకావాలని కోరుతున్నాను. నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి నా పార్టీ హాజరవుతుంది’’ అని సీఎం జగన్ ట్వీట్  చేశారు. 

 


ఇదిలా ఉంటే.. మే 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా జాతికి అంకితం చేయనున్నారు. అయితే పార్లమెంట్‌ నూతన భవనాన్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించడాన్ని కాంగ్రెస్‌తో పాటు పలు విపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌తో సహా 19 ప్రతిపక్ష రాజకీయ పార్టీలు నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు పేర్కొంటూ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కాకుండా.. ప్రధాని మోదీ చేతుల మీదుగా  నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడం ప్రజాస్వామ్యంపైనే దాడిగా అభివర్ణించాయి.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: నారావారిపల్లెలో అభివృద్ధిపనులు ప్రారంభించిన సీఎం| Asianet News Telugu
Bhumana Karunakar Reddy: కోనసీమ జిల్లాలో బ్లోఔట్ పై భూమన సంచలన కామెంట్స్ | Asianet News Telugu