టీడీపీ కోసమే బద్వేల్‌ పోటీ నుంచి తప్పుకున్నారు: పవన్‌పై మిథున్ రెడ్డి ఆరోపణలు

By Siva KodatiFirst Published Oct 3, 2021, 2:46 PM IST
Highlights

టీడీపీకి జ‌న‌సేన మ‌ద్దతు ఇస్తోంద‌ని, అందుకే త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న‌ బద్వేలు ఉప ఎన్నికలో పోటీచేయట్లేద‌ని వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆరోపించారు. అలాగే, తిరుపతి లోక్‌స‌భ ఉప‌ ఎన్నికలోనూ జనసేన పోటీ చేయ‌కుండా టీడీపీకి మద్దతు ఇచ్చింద‌ని ఆయన ఎద్దేవా  చేశారు.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై వైసీపీ నేతల ఎదురుదాడి కొనసాగుతూనే వుంది. తాజాగా ఆదివారం ఎంపీ మిథున్‌ రెడ్డి ఆయనపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ రోజు ఆయ‌న తిరుప‌తిలో మీడియాతో మాట్లాడుతూ... కులాలను రెచ్చగొట్టేలా ప‌వ‌న్ వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని ఆరోపించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైసీపీ చేస్తోన్న అభివృద్ధి కార్య‌క్ర‌మాలు ప‌వ‌న్ కు క‌నిపించడం లేదని మిథున్ రెడ్డి మండిపడ్డారు.

ముఖ్య‌మంత్రి జగన్ ఎన్నిక‌ల ముందు ఇచ్చిన‌ హామీలను అమలుచేస్తున్నార‌ని ఆయ‌న తెలిపారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు జ‌గ‌న్ న్యాయం చేశార‌ని మిథున్ రెడ్డి అన్నారు. టీడీపీకి జ‌న‌సేన మ‌ద్దతు ఇస్తోంద‌ని, అందుకే త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న‌ బద్వేలు ఉప ఎన్నికలో పోటీచేయట్లేద‌ని ఆయన ఆరోపించారు. అలాగే, తిరుపతి లోక్‌స‌భ ఉప‌ ఎన్నికలోనూ జనసేన పోటీ చేయ‌కుండా టీడీపీకి మద్దతు ఇచ్చింద‌ని మిథున్ రెడ్డి ఎద్దేవా  చేశారు.

కాగా, బద్వేల్ ఉపఎన్నికలో జనసేన పోటీ చేయదని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ శనివారం రాత్రి ప్రకటించారు. చనిపోయిన వ్యక్తి సతీమణిని గౌరవిస్తూ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఎన్నికల్లో పోటీచేయమని ఒత్తిడి వచ్చిందని పవన్ తెలిపారు. ఏకగ్రీవం చేసుకోవాలని ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేశారు. 

అంతకుముందు బద్వేల్ అసెంబ్లీ స్థానానికి (Badvel bypoll) జరిగే ఉప ఎన్నికల్లో ఏ పార్టీ పోటీ చేయాలనే దానిపై  బీజేపీ (bjp), జనసేనల(jana sena) మధ్య తొలుత ఏకాభిప్రాయం కుదరలేదు. అయితే ఈ స్థానం నుండి ఈ రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్ధి బరిలోకి దిగుతారని బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు (somu veerraju)ప్రకటించారు.
 

click me!