
చిత్తూరు జిల్లాలోని (chittoor district) నగరి-పుత్తూరు (nagari puttoor) జాతీయ రహదారి పరిస్థితి దారుణంగా ఉందని వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా (mla roja) పేర్కొన్నారు. ఇవాళ ఆమె విజయవాడలో రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబును (krishna babu) కలిసి పరిస్ధితిని వివరించారు. నగరి-పుత్తూరు జాతీయ రహదారి అధ్వానంగా ఉందని, అటువంటి రోడ్డులో టోల్ చార్జీలు వసూలు చేయడం సరికాదని రోజా అన్నారు. ఈ మేరకు కృష్ణబాబుకు వినతిపత్రం అందజేశారు. తన నగరి నియోజకవర్గం పరిధిలోని తిరుపతి-చెన్నై జాతీయ రహదారి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్నదని రోజా ఆయనకు వివరించారు. వెంటనే ఆ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కృష్ణబాబును కోరారు.
మరోవైపు సొంతపార్టీ నేతలు కొందరిని కోవర్టులంటూ రోజా ఇటీవల ఎస్పీకి ఫిర్యాదు చేయడం వైసీపీలో కలకలం రేపుతోంది. రోజా దూకుడు జిల్లా ముఖ్యనేతలను సైతం కలవరపరిచేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రోజా తనదైన శైలిలో దూకుడుగా వేసిన ఈ అడుగుతో నగరిలో వర్గ పోరుకు ఫుల్ స్టాప్ పడుతుందా లేదా మరింత జోరందుకుంటుందా అనేది వేచి చూడాలి.
టీడీపీని బలోపేతం చేయడంలో భాగంగా ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తూ జిల్లాకు చెందిన మంత్రుల మీద, తనదైన సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం చేసేవారిపై చర్యలు చేపట్టాలని నగరి ఎమ్మెల్యే రోజా కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆమె చిత్తూరులో ఎస్పీ సెంథిల్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. ఎస్పీ కార్యాలయం వెలుపల ఆమె మీడియాతో మాట్లాడుతూ... జగనన్న కాలనీల్లో పేదల ఇళ్లు కట్టుకునే ప్రక్రియను ఆపడానికి వైసీపీలోని కొందరు కోవర్టులు టీడీపీతో చేతులు కలపడం దురదృష్టకరమన్నారు.
నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసిన నగరిలోని రీచ్ నుంచి పేదల ఇళ్లకు ఇసుక తీసుకెల్తున్నారన్నారు. దీనిని రాజకీయం చేస్తూ, ఇసుక అక్రమంగా తరలిస్తున్నారంటూ వాట్సప్ గ్రూపుల్లో పెట్టడం, వీడియో తీసి క్లిప్పింగులు పెట్టడం వంటి పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే పనులు చేస్తున్నారన్నారు. ఇది జిల్లా మంత్రితో పాటు అధికారులను కించపరచడమేనన్నారు.
వైసీపీకి చెందినవారైతే గనుల శాఖ మంత్రికి ఫిర్యాదు చేసేవారని, అలా చేయడం వల్ల నిజానిజాలు తేలేవని పేర్కొన్నారు. డీజీపీని కలిసిన ఫోటోనూ తమ అసత్య ప్రచారాలకు పావుగా వాడుకొన్నారని ఆరోపించారు. ఈ అంశాన్ని డీపీజీకి వివరించామని, ఆయన సూచనల మేరకే ఇలాంటి కార్యక్రమాలకు పుల్ స్టాప్ పెట్టేలా సంబంధితుల మీద క్రిమినల్ కేసులు పెట్టాలని ఎస్పీని కోరామన్నారు. పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందేనన్నారు. ఆమె వెంట నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.