అధికార వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫాకు నిరసన సెగ తగిలింది. ఈ క్రమంలోనే తనను ప్రశ్నించినవారిపై అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ముస్తాఫా.. సర్వ నాశనం అయిపోతారని శాపనార్థాలు పెట్టారు.
గుంటూరు: అధికార వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫాకు నిరసన సెగ తగిలింది. ఈ క్రమంలోనే తనను ప్రశ్నించినవారిపై అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ముస్తాఫా.. సర్వ నాశనం అయిపోతారని శాపనార్థాలు పెట్టారు. వివరాలు.. నగరంలోని 9వ డివిజన్‌లో సైడ్ కాలువలు నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే ముస్తాఫా ఈరోజు ఉదయం అక్కడికి వెళ్లారు. అయితే ఆయనను స్థానికులు అడ్డుకున్నారు. కాలువల నిర్మాణంతో దారి మరింత చిన్నదిగా అవుతుందని తెలిపారు. తమ ప్రాంతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కావాలని డిమాండ్ చేశారు.
అయితే తనను అడ్డుకున్న స్థానికులపై ఎమ్మెల్యే ముస్తాఫా ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ది పనులను అడ్డుకుంటే సర్వ నాశనం అవుతారని శాపనార్థాలు పెట్టారు. అయితే ఎమ్మెల్యే ముస్తాఫా వ్యాఖ్యలపై స్థానికులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కాస్తా ఎమ్మెల్యే అనుచరులకు, స్థానికులకు మధ్య వాగ్వాదానికి దారితీసింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక, తమకు కాలువలు వద్దని.. డ్రైనేజీ కావాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.