చీకట్లో రాజకీయ కుట్రలు... ఆపకుంటే తరిమితరిమి కొడతాం: అంబటి హెచ్చరిక

Arun Kumar P   | Asianet News
Published : Jan 16, 2021, 03:53 PM IST
చీకట్లో రాజకీయ కుట్రలు... ఆపకుంటే తరిమితరిమి కొడతాం: అంబటి హెచ్చరిక

సారాంశం

 రాష్ట్రంలో మతాల మధ్య  చిచ్చుపెట్టేందుకు కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయని... జరగని ఘటనలను కూడా జరిగినట్లు ఓ వర్గం మీడియాలో చీత్రీకరించారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు.

తాడేపల్లి: ఏపీలో దేవతా విగ్రహాలపై జరుగుతున్న దాడులన్నీ రాజకీయ కుట్రలో భాగమేనని... చీకట్లో ఆలయాలపై దాడులు చేసి నిందను వైసిపి ప్రభుత్వంపై మోపాలని ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. బాధ్యతతో ఉండాల్సిన చంద్రబాబు ప్రజల్ని రెచ్చగొట్టేలా మాట్లాడి అభాసుపాలయ్యారన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మతం, కులం, ప్రాంతం లేదని... మేనిఫెస్టోను ఖురాన్, బైబిల్, భగవద్గీతలా భావిస్తామని అంబటి పేర్కొన్నారు.

''మతసామరస్యానికి ఈ రాష్ట్రం ప్రతీక. మతాల మధ్య ఘర్షణకు తావులేదు. మతాలు, కులాలతో రాజకీయం చేస్తే తరిమితరిమి కొడతాం. రాష్ట్రంలో మతాల మధ్య  చిచ్చుపెట్టేందుకు కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయి. జరగని ఘటనలను కూడా జరిగినట్లు ఓ వర్గం మీడియాలో చీత్రీకరించారు. మతసామరస్యాన్ని దెబ్బతీసి రాజకీయ లబ్దికి కొన్ని దుష్టశక్తులు ప్రయత్నించాయి. ప్రజా బలంతో తిరిగి అధికారంలోకి రాలేమన్న భయంతోనే ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నారు. టీడీపీ, బీజేపీలు చేసిన దుశ్చర్యలు పోలీసు దర్యాప్తులో బయటకొస్తున్నాయి'' అని తెలిపారు.

''మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తే సహించం. బూట్లు వేసుకుని పూజలు చేసే చంద్రబాబుకు హిందుత్వంపై ప్రేమ, విశ్వాసం ఉందా? అఖిలప్రియ విషయంలో చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు. కులాలు, మతాల మధ్య  వైషమ్యాలు సృష్టిస్తే ఉక్కుపాదంతో అణిచివేస్తాం'' అని అంబటి హెచ్చరించారు.

రాష్ట్రంలో గత కొంతకాలంగా దేవతా విగ్రహాలను విరగకొట్టే దుస్సంఘటనలు, దేవాలయాలపై చీకట్లో దాడులు జరుగుతూ వచ్చాయని అంబటి తెలిపారు. ఈ ఘటనలపై కొన్ని వార్తా పత్రికలు,  ఛానల్స్‌ అవాస్తవాలను వాస్తవాలుగా చీత్రీకరించే ప్రయత్నం చేశాయని అన్నారు. కొన్ని చోట్ల దాడులు జరగటం, విగ్రహాలను అవమానించటం, విగ్రహాలను విరిచి వేయటం వంటి సంఘటనలు జరిగాయన్నారు. అయితే జరగని సంఘటనలు కూడా జరుగుతున్నట్లుగా చూపించి, రాష్ట్రంలో ఒక గందరగోళం సృష్టించటానికి కొన్ని పత్రికలు, కొన్ని శక్తులు ప్రయత్నం చేసినట్లుగా మనకు అర్థమౌతోందని అంబటి అన్నారు. 

ఇటువంటి చర్యల ద్వారా మత సామరస్యాన్ని చెడగొట్టి మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలనే ప్రయత్నం కొన్ని దుష్టశక్తులు చేశాయి.  సీఎం జగన్ కు, ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలన్న కుట్ర బుద్ధితో ఇటువంటి ప్రయత్నాలు చేశారని అంబటి తెలిపారు.

రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించిన ఘనత జగన్ నేతృత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానిదని అంబటి అన్నారు. తిరిగి అధికారంలోకి రాలేనని భావించిన చంద్రబాబు మొన్నటి వరకు కులాన్ని, ప్రాంతాన్ని అడ్డంపెట్టుకొని రాజకీయం చేశారని,  ఇవాళ మతాల మధ్య చిచ్చు పెట్టి పోయిన అధికారాన్ని దక్కించుకోవాలనే విషప్రయత్నం చేస్తూ వచ్చారని, ఇది చాలా దురదృష్టకరమైన పరిణామంగా భావిస్తున్నామని అంబటి అన్నారు.  నిజం చెప్పాలంటే ఈ 13 జిల్లాలు కలిపిన రాష్ట్రం మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది. ఎక్కడా మతాల మధ్య ఎప్పుడూ గొడవలు లేవని ఆయన అన్నారు. 

ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హైదరాబాద్‌లో కొంత మతవిద్వేషాలు అప్పుడప్పుడు రగిలేవి తప్ప,  ఈ ప్రాంతంలో మతాల మధ్య సామరస్యమే తప్ప మతాల మధ్య ఘర్షణ ఎప్పుడూ లేదని అంబటి గుర్తు చేశారు.

డీజీపీ వాస్తవాలు చెప్పేసరికి టీడీపీ, బీజేపీల గొంతులో వెలక్కాయ పడింది. చంద్రబాబు, అచ్చెన్నాయుడు, టీడీపీ తాబేదార్ల ప్రకటనలతో వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో క్రిస్టియన్లు, ముస్లింలు, హిందువులు అందరూ ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ వచ్చారు తప్ప ఏనాడూ ద్వేషించుకున్నది లేదని అంబటి అన్నారు. అలాంటి ఈ పవిత్రమైన రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చుపెట్టాలనే ప్రయత్నం రాజకీయ పార్టీలు చేయటం చాలా దురదృష్టకరంగా భావిస్తున్నానని అంబటి తెలిపారు.

పోలీసుల ఇన్వెస్టిగేషన్‌ ద్వారా తెల్సిన వాస్తవాలను డీజీపీ చెప్పే ప్రయత్నం చేశారు. దీని తర్వాత టీడీపీ, బీజేపీ గొంతులో వెలక్కాయ పడినట్లు అయిందని, అందుకే ఏం మాట్లాడాలో వారికి అర్థం కాని పరిస్థితి వచ్చిందని అంబటి అన్నారు. 44 కేసులు ఇన్వెస్టిగేషన్‌ చేస్తే 29 కేసుల్లో వాస్తవాలను గ్రహించే అవకాశం పోలీసులకు కలిగిందని అంబటి అన్నారు. దీంట్లో టీడీపీ, బీజేపీ వారు కలిసి చేశారనే భావన వచ్చే విధంగా వాస్తవాలు బయటకు వచ్చాయని అంబటి అన్నారు.   చీకట్లో జరిగిన ప్రతి విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో దొరికిపోయిన దొంగల్లా ఆ పార్టీలు భుజాలు తడుముకుంటున్నాయి. నిన్నా, ఈరోజు చంద్రబాబు, అచ్చెన్నాయుడు, వారి తాబేదార్లు ఇస్తున్న స్టేట్‌మెంట్స్ చూస్తుంటే వారు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారని తెలుస్తోంది. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితికి వారు రావటం జరిగిందని అంబటి అన్నారు. పైగా డీజీపీ మీద వారు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 

డీజీపీ మాట మారుస్తున్నారని.. డీజీపీ వైయస్‌ఆర్‌సీపీ నాయకుడులా మాట్లాడుతున్నారని ఆరోపణలు చేయటం సరికాదని అంబటి అన్నారు. వాస్తవాలను వెలుగులోకి తీసుకురావటానికి డీజీపీ, పోలీసు వ్యవస్థ ప్రయత్నం చేస్తుంటే వారి (టీడీపీ, బీజేపీ నేతల) బండారం బయట పడుతుందని భయపడుతున్నారని అంబటి అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Bhumana Karunakar Reddy Comments on BR Naidu: బీఆర్ నాయుడుపై భూమన సెటైర్లు| Asianet News Telugu
Pawan Kalyan Visits Kakinada GGH Firecracker Blast Victims | Asianet News Telugu