జయహో బీసీ పోస్టర్‌ను ఆవిష్కరించిన వైసీపీ నేతలు.. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలన్న విజయసాయిరెడ్డి..

By Sumanth KanukulaFirst Published Dec 1, 2022, 2:16 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బీసీలకు పెద్ద పీట వేశారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. పదవుల్లో బీసీలకు ఎప్పుడూ లేనంత ప్రాధాన్యత దక్కిందన్నారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బీసీలకు పెద్ద పీట వేశారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. నామినేటెడ్ పోస్టులు, పనుల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగిందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అత్యున్నత స్థానం కల్పించామని చెప్పారు. ఈ నెల 7న విజయవాడలో జరగనున్న జయహో బీసీ.. వెనుకబడిన కులాలే వెన్నెముక పేరుతో నిర్వహించనున్న సభకు సంబంధించిన పోస్టర్‌ను వైస్సార్ కాంగ్రెస్ పార్టీ  నేతలు గురువారం ఆవిష్కరించారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీలు విజయసాయిరెడ్డి, మార్గాని భరత్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జయహో బీసీ మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశం అనంతరం జోనల్‌ సమావేశాలు జరుగుతాయని, బీసీ నేతలంతా హాజరవుతారని ఆయన చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఇవే చివరి ఎన్నికలు అని.. ఆయన జీవితంలో మళ్లీ సీఎం అవ్వలేరని విమర్శించారు. 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్‌లకు భవిష్యత్ ఉండదన్నారు.  చంద్రబాబు కేవలం ఆయన కులం, కుటుంబం కోసమే పనిచేశారని ఆరోపించారు. సీఎం జగన్ పేద ప్రజల కోసం పనిచేస్తున్నారని.. 25 ఏళ్లు ఆయనే సీఎంగా ఉంటారని ధీమా వ్యక్తం చేవారు. 

పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. సీఎం జగన్ సమాజంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత  ఇచ్చారని తెలిపారు. సమాజంలో అట్టడుగున్న ఉన్న అనివర్గాలకు సీఎం జగన్ అండగా ఉంటారని చెప్పారు. విజయవాడలో జరిగే సభలో బీసీలకు జరిగిన మేలును వివరించనున్నట్టుగా తెలిపారు. మరో మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. చంద్రబాబు నోట బీసీ అనే మాట వచ్చే అర్హత కూడా లేదన్నారు. చంద్రబాబును చూసి జనం ఇదేం ఖర్మరా బాబూ అని అనుకుంటున్నారని విమర్శించారు. 

click me!