వైసీపీపై ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్: బీజేపీ వైపు తోట వాణి అడుగులు

By Siva KodatiFirst Published Jul 16, 2019, 8:02 AM IST
Highlights

మాజీ ఎంపీ, వైసీపీ నేత తోట నరసింహం భార్య తోట వాణి కాషాయ కండువా కప్పుకుంటారని వార్తలు వస్తున్నాయి

తెలుగు రాష్ట్రాల్లో చాపకింద నీరులా విస్తరించి.. ప్రధాన పార్టీగా ఎదగాలని చూస్తోన్న భారతీయ జనతా పార్టీ ఆ దిశగా వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీ తీర్ధం పుచ్చుకోగా.. అటు తెలంగాణలోనూ కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లకు చెందిన పలువురిని ఆకర్షించింది.

ఈ క్రమంలో ఏపీలో అధికార వైసీపీని సైతం దువ్వే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. మాజీ ఎంపీ, వైసీపీ నేత తోట నరసింహం భార్య తోట వాణి కాషాయ కండువా కప్పుకుంటారని వార్తలు వస్తున్నాయి.

2019 ఎన్నికల ముందు వరకు తెలుగుదేశంలో ఉన్న తోట నరసింహం అనారోగ్య కారణాలతో పోటీగా దూరంగా ఉంటానని.. తనకు బదులు తన భార్య తోట వాణికి టికెట్ ఇవ్వాల్సిందిగా కోరారు.

అయితే దీనికి చంద్రబాబు ససేమిరా అనడంతో నరసింహం, ఆయన భార్యతో కలిసి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఆ వెంటనే వైసీపీ చీఫ్ తోట వాణికి పెద్దాపురం టికెట్ కేటాయించారు.

అయితే ఆ ఎన్నికల్లో ఆమె టీడీపీ అభ్యర్ధి నిమ్మకాయల చినరాజప్ప చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. కొద్దిరోజుల క్రితం చినరాజప్ప ఎన్నిక చెల్లదంటూ జిల్లా ఎస్పీతో పాటు కోర్టును సైతం ఆశ్రయించారు వాణి.

కానీ ఏం జరిగిందో తెలియదు కానీ.. ఆమె ఉన్నట్లుండి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ద్వారా బీజేపీకి చెందిన జాతీయ నాయకులతో తోట నరసింహం, వాణి దంపతులు మంతనాలు జరిపినట్లుగా సమాచారం.

ఒకవేళ వీరి ప్రయత్నాలు ఫలించి వాణి బీజేపీ తీర్థం పుచ్చుకుంటే ఏపీలోని బలమైన కాపు సామాజిక వర్గం అటు దిశగా వెళ్లే అవకాశాలు లేకపోలేదంటున్నారు నేతలు. కాగా.. వాణి బీజేపీలో చేరుతారన్న వార్తల నేపథ్యంలో వైసీపీ అధిష్టానం రంగంలోకి దిగింది. పెద్దాపురం వైసీపీ ఇంచార్జ్‌గా ఆమె స్థానంలో దవులూరి దొరబాబుకు బాధ్యతలు అప్పగించింది. 

click me!