భిన్నాభిప్రాయాలుంటాయి, అంత మాత్రాన చంపుకుంటామా: వైఎస్ వివేకా కూతురు

By Siva KodatiFirst Published Mar 20, 2019, 10:09 AM IST
Highlights

మా నాన్నతో చిన్నప్పటి నుంచి మంచి అనుబంధం ఉందన్నారు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత. తండ్రి హత్య నేపథ్యంలో ఆమె బుధవారం మీడియా ముందుకు వచ్చారు. 

మా నాన్నతో చిన్నప్పటి నుంచి మంచి అనుబంధం ఉందన్నారు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత. తండ్రి హత్య నేపథ్యంలో ఆమె బుధవారం మీడియా ముందుకు వచ్చారు. పులివెందుల, పట్టణ ప్రజలు, పక్కనే ఉండే తోటలు అంటే చాలా ఇష్టమని, హైదరాబాద్‌ కంటే ఇక్కడ గడిపేందుకే వివేకా ఇష్టపడేవారన్నారు. 

ప్రజలు ముందు కుటుంబం తర్వాత అనే సిద్ధాంతాన్ని నాన్న ఫాలో అయ్యేవారని సునీత తెలిపారు. గత కొద్దికాలంగా అమ్మకు కూడా ఆరోగ్యం బాలేదని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండటంతో ఆమె తన వద్దే ఉండేదన్నారు. దీంతో నాన్న ఒక్కరే ఒంటరిగా పులివెందులలో ఉంటున్నారని సునీత వెల్లడించారు. 

నాన్న స్నేహితులు, అనుచరులు ఆయనను బాగా చూసుకునేవారని తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి పడుకునే వరకు ఎవరో ఒకరు పక్కనే ఉండేవారని ఆమె తెలిపారు. నాన్న మరణం తనను తీవ్రంగా కలచివేసిందని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. హత్య తర్వాతి రోజు నుంచి మీడియాలో వస్తున్న వార్తలను చూస్తే మరింత బాధ కలుగుతుందన్నారు. 

ప్రత్యర్థులు ఆయనను అత్యంత దారుణంగా హతమార్చారని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన వాళ్ల గురించి ఎప్పుడూ చెడుగా మాట్లాడకూడదు. గౌరవించకపోయినా పర్లేదు కానీ అవమానిస్తున్నారన్నారు. 

దర్యాప్తు బృందం విచారణను సరిగా నిర్వర్తించడం లేదని ఆమె ఆరోపించారు. విషయం పక్కదారి పట్టిస్తూ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతున్నారని సునీత ఎద్దేవా చేశారు. జగనన్న ముఖ్యమంత్రి కావాలని నాన్న ఎంతో కష్టపడ్డారు. మా కుటుంబంలో ఎవరి మధ్య విభేదాలు లేవని సునీత స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు కథనాలు ప్రచారం చేయొద్దని ఆమె మీడియాకు సూచించారు.

సిట్ బృందాన్ని ఏర్పాటు చేసినప్పటికీ వారికి ప్రభుత్వం స్వతంత్రత ఇవ్వలేదని సునీత ఆరోపించారు. మా కుటుంబంలో 700 మంది సభ్యులు ఉన్నామని, ఇలా ఏ కుటుంబంలో ఉండరని ఆమె తెలిపారు. మా ఇంట్లో అన్ని రకాల మనుషులు ఉన్నారని ఒకరంటే ఒకరికి ప్రేమ, గౌరవం ఉన్నాయన్నారు. 

మా కుటుంబంలోని అనుబంధాన్ని అర్ధం చేసుకోవాలంటే దానికి ఎంతో పరిణితి ఉండాలన్నారు. ప్రతి సంవత్సరం వీలైనప్పుడల్లా ఫ్యామిలీ మొత్తం ఒక చోట కలుస్తామని సునీత వెల్లడించారు.

ఈ ఏడాది ఇప్పటికే రెండు సార్లు కలుసుకున్నామని చెప్పారు. ఇంత పెద్ద కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్థలు ఉండం సహజమేనని, వాటినే అర్థం చేసుకునే పరిణితి కూడా తమకు ఉందని సునీత స్పష్టం చేశారు. 

పెద్ద వాళ్లు నోటికొచ్చినట్లు మాట్లాడితే దానికి పెద్ద ప్రభావం ఉంటుందని అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సునీత సూచించారు. ఒక పక్క దర్యాప్తు జరుగుతుండగా నాది కానీ, ఎవరిదైనా కానీ అభిప్రాయాలు ఎందుకని ఆమె ప్రశ్నించారు.

విచారణను ప్రభావితం చేసేలా వ్యవహరించొద్దని సునీత విజ్ఞప్తి చేశారు. ఆ రోజు పోలీసులకు ఇచ్చిన లెటర్‌లో ఉన్నది మా నాన్న చేతి రాతో కాదో ఫోరెన్సిక్ ల్యాబ్ ధ్రువీకరిస్తుందని సునీత స్పష్టం చేశారు. 

తనకు, తన కుటుంబానికి కావాల్సింది పారదర్శకమైన విచారణ అన్నారు. ఎవరి నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుండా పారదర్శకంగా ఉండే ఎలాంటి విచారణైనా తనకు సమ్మతమేనని సునీత తెలిపారు. 

తప్పుడు కథనాలు, తప్పుడు స్టేట్‌మెంట్లు పేపర్లో వస్తున్నాయని... సిట్‌ని తన పనిని తాను చేయనిస్తే వాస్తవాలు బయటికొస్తాయని సునీత తెలిపారు. నాన్న గారికి చాలా మంది సన్నిహితులున్నారని అయితే హత్య సమయంలో ఎవరూ ఇక్కడ లేరన్నారు.

పెద్ద ఫ్యామిలీ మీద ఇన్ని ఆరోపణలు, మచ్చలు వస్తుంటే తట్టుకోవడం ఎవరికైనా కష్టమేనన్నారు. పారదర్శకంగా విచారణ జరిపించడంతో పాటు దోషులు ఎంతటి వారైనా శిక్ష పడాలన్నదే తమ ఉద్దేశ్యమన్నారు. దర్యాప్తు జరిగిన తర్వాత అది తప్పో.. ఒప్పో.. ఆ తర్వాత మా నిర్ణయం చెబుతామని సునీత తెలిపారు. 
 

click me!