ఏపీ ముఖ్యమంత్రి జగన్ తల్లి విజయమ్మ తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ అయ్యింది.
ఒంగోలు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాతృమూర్తి, దివంగత వైఎస్సార్ సతీమణి విజయమ్మకు తృటిలో పెనుప్రమాదం తప్పింది. విజయమ్మ హైదరాబాదు నుంచి రోడ్డు మార్గంలో ఒంగోలు వస్తుండగా తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా వాడపల్లి దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఆమె ప్రయాణిస్తున్న వాహనం ముందు ఉన్న వాహనం.. అనుకోకుండా స్లో అయింది. దీంతో విజయమ్మ వాహన డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. ఈ సడన్ బ్రేక్ తో వెనక ఉన్న మరో వాహనం విజయమ్మ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది.
విజయమ్మ ప్రయాణిస్తున్న కారు వెనుక భాగం ఈ ప్రమాదంలో స్వల్పంగా దెబ్బతినింది. ఒంగోలులో ఉన్న తన సోదరి అత్త టీటీడీ మాజీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మను చూడడానికి విజయమ్మ వచ్చారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండడంతో పరామర్శించడానికి వచ్చారు. రాత్రికి విజయమ్మ ఒంగోలు లోనే బస చేశారు. శనివారం ఉదయం హైదరాబాదుకు రానున్నారు.