పోతిరెడ్డిపాడు వివాదం: కేసీఆర్ కు వైఎస్ జగన్ ఝలక్

Published : Aug 13, 2020, 07:39 AM IST
పోతిరెడ్డిపాడు వివాదం: కేసీఆర్ కు వైఎస్ జగన్ ఝలక్

సారాంశం

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను పట్టించుకోవద్దని వైఎస్ జగన్ అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. అపెక్స్ కౌన్సిల్ లోనే సమాధానం ఇద్దామని చెప్పినట్లు తెలుస్తోంది.

అమరావతి: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై పోరుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిద్ధపడినట్లు అర్థమవుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ ద్వారా రోజుకు మూడు టీఎంసీల నీటిని తీసుకుని వెళ్లేందుకు తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 

కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను పట్టించుకోవద్దని వైఎస్ జగన్ అధికారులకు చెప్పినట్లు సమాచారం. రాయలసీమ ఎత్తిపోతల పథకంపైనే కాకుండా ఇతర నీటి పారుదల ప్రాజెక్టులపై తెలంగాణ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలకు ఈ నెల 20వ తేదీ తర్వాత జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే సమాధానాలు ఇద్దామని ఆయన చెప్పినట్లు సమాచారం. ఈ సమావేశం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతను జరగనుంది.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జలవనరుల శాఖ అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. రాయలసీమ పథకంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నట్లు అధికారులు అభిప్రాయపడినట్లు సమాచారం. 

నీటి పారుదల ప్రాజెక్టులన్నీ కృష్ణా ట్రైబ్యునల్ కేటాయింపుల మేరకే చేపడుతున్నట్లు జగన్ వారితో అన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ వ్యాఖ్యలకు అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే తగిన సమాధానం చెబుదామని ఆయన అన్నట్లు చెబుతున్నారు. పొరుగు రాష్ట్రంతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలని చూస్తున్నామని, కానీ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగే పరిస్థితి వస్తే అంగీకరించేది లేదని ఆయన అన్నట్లు చెబుతున్నారు. 

తనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని జగన్ అంటూ ప్రాజెక్టుల నిర్మాణఁపై రాష్ట్ర విభజన జరగక ముందు నుంచి ఇచ్చిన ఉత్తర్వులను సిద్దం చేయాలని ఆయన అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu
CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu