చంద్రబాబు పంపించేశారు: జగన్ పిలిపించుకుంటున్నారు

By telugu teamFirst Published May 29, 2019, 11:04 AM IST
Highlights

వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో ఎన్వీ రమణారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లోకి డిప్యుటేషన్ పై తీసుకున్నారు. ఆయన సాధారణ పరిపాలన శాఖ (జిఎడి) ప్రత్యేక కార్యదర్శి (ప్రోటోకాల్) గా నియమించారు. వైఎస్ కుటుంబ బంధువైన ఎన్వీ రమణా రెడ్డి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పదవిలో కొనసాగారు.

అమరావతి: సమర్థులైన అధికారుల కోసం చూస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి విధేయులను వెనక్కి రప్పించుకుంటున్నారు. దక్షిణ మధ్య రైల్వేలో చీఫ్ పర్సనల్ ఆఫీసర్ గా ఉన్న ఎన్వీ రమణా రెడ్డిని వైఎస్ జగన్ రాష్ట్ర సర్వీసులకు రప్పించుకునే అవకాశం ఉంది. 

వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో ఎన్వీ రమణారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లోకి డిప్యుటేషన్ పై తీసుకున్నారు. ఆయన సాధారణ పరిపాలన శాఖ (జిఎడి) ప్రత్యేక కార్యదర్శి (ప్రోటోకాల్) గా నియమించారు. వైఎస్ కుటుంబ బంధువైన ఎన్వీ రమణా రెడ్డి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పదవిలో కొనసాగారు. సమాచార, పౌర సంబంధాల కమిషనర్ గా కూడా అదనపు బాధ్యతలు నిర్వహించారు. 

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఢిల్లీ ధర్నా కార్యక్రమం చేపట్టింది. ఆ సమయంలో ఢిల్లీలోని ఎపి భవన్ వైసిపి శాసనసభ్యులు వసతి కోరారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది. అయితే, ప్రోటోకాల్ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న ఎన్వీ రమణా రెడ్డి ఎపి భవన్ లో వారికి వసతి కల్పించారు. 

నిబంధనల మేరకే తాను వారికి ఎపి భవన్ లో వసతి కల్పించానని, రాష్ట్రం నుంచి వచ్చే ఏ శాసనసభ్యుడికైనా ఎపి భవన్ లో వసతి సౌకర్యం కల్పించాల్సి ఉంటుందని ఎన్వీ రమణా రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి బదులిచ్చారు. దాంతో చంద్రబాబు ప్రభుత్వం ఆయనను దక్షిణ మధ్య రైల్వేకి తిరిగి పంపించేసింది. మూడు రోజుల క్రితం ఎన్వీ రమణా రెడ్డి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. 

click me!