రియల్ ఎస్టేట్ రంగంలోకి వైఎస్ జగన్ ప్రభుత్వం

By Siva KodatiFirst Published Jan 7, 2021, 8:49 PM IST
Highlights

వైఎస్ జగన్ ప్రభుత్వం ఆదాయాలను పెంచుకునేందుకు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగంలోకి సర్కార్ అడుగుపెట్టనుంది. ప్రైవేటు స్థలాలు కొంటున్న వారికి అనేక ఆందోళనలు ఉంటున్నాయని.. అభివృద్ధిని ప్రభుత్వమే చేపడితే ఎలాంటి ఆందోళనలు ఉండవన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సీఎం జగన్.

వైఎస్ జగన్ ప్రభుత్వం ఆదాయాలను పెంచుకునేందుకు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగంలోకి సర్కార్ అడుగుపెట్టనుంది.

ప్రైవేటు స్థలాలు కొంటున్న వారికి అనేక ఆందోళనలు ఉంటున్నాయని.. అభివృద్ధిని ప్రభుత్వమే చేపడితే ఎలాంటి ఆందోళనలు ఉండవన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సీఎం జగన్.

ఈ నేపథ్యంలో ప్రభుత్వమే లే అవుట్లను అభివృద్ధి చేసి ప్లాట్లు  ఇచ్చే అంశంపై ఒక విధానాన్ని రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. గురువారం పురపాలిక, పట్టణాభివృద్ధిశాఖపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. వైఎస్‌ఆర్ జగనన్న కాలనీల్లో సౌకర్యాలపై దృష్టిపెట్టాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు.

రాష్ట్రంలో మరో 17 వేల కాలనీలు నిర్మిస్తున్నట్లు సీఎం చెప్పారు. ఆ కాలనీల్లో పార్కులు, గ్రామ, వార్డు సచివాలయాలు, విలేజ్‌ క్లినిక్స్‌ వచ్చేలా నిర్మాణాలు చేపట్టనున్నట్లు జగన్ వెల్లడించారు.

భీమిలి-భోగాపురం మధ్య 6 లేన్ల రోడ్డుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. అలాగే గోస్తనీ నదిపై వంతెన నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాల్సిందిగా జగన్ అధికారులను ఆదేశించారు.

పట్టణ గృహ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. రాజీవ్‌ స్వగృహ పేరిట గతంలో తక్కువ ధరకు ఫ్లాట్లు ఇచ్చేవారని.. ఇప్పడు వాటికి బదులు తక్కువ ధరకు స్థలం ఇవ్వాలనే ఆలోచన ఉందని జగన్‌ తెలిపారు.

click me!