
వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత 2019 అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ తరపున తొలి అభ్యర్థిని ప్రకటించారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా కోలగట్ల వీరభద్రస్వామి పోటీ చేస్తారని జగన్ తెలిపారు.
ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా విజయనగరం జిల్లాలో ఆయన పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడుతూ.. విజయనగరం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పడకేశాయని.. బీమ్‌సింగ్ చక్కెర కర్మాగారం నష్టాల్లో కూరుకుపోయిందని.. ఆ కర్మాగారంలో పనిచేసే ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని తెలిపారు.
రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేని జిల్లా కేంద్రం విజయనగరం ఒక్కటేనన్నారు. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి తనపై చంద్రబాబు అక్రమంగా కేసులు పెట్టిస్తున్నారని.. ఇప్పుడు బీజేపీతో కుమ్మక్కై నాపైనా, తన భార్యపైనా అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారన్నారు. ఎన్నికల్లో సానుభూతి పొందాలని బాబ్లీ కేసును చంద్రబాబు తెరమీదకు తీసుకువచ్చారన్నారు.