ఎమ్మెల్సీ వర్సెస్ ఎమ్మెల్యే... సీఎం జగన్ సొంత జిల్లా వైసిపిలోనే భగ్గుమన్న వర్గపోరు

By Arun Kumar PFirst Published Jan 14, 2022, 12:13 PM IST
Highlights

రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలోనే వర్గవిబేధాలు భగ్గుమన్నాయి. ప్రొద్దుటూరులో వైసిపి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గీయులు చిన్న ప్లెక్సీ విషయమై బాహాబాహీకి దిగారు. 

కడప: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ (ys jagan) సొంత జిల్లాలోనే ఆ పార్టీ నేతల మధ్య వర్గవిబేధాలు భగ్గుమన్నాయి. వైసిపి (ycp) ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా ప్రొద్దుటూరు (proddutur) నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన ప్లెక్సీలు నాయకుల మధ్య వివాదానికి కారణమయ్యాయి. వైసిపి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య అగ్గిరాజుకోవడంతో ఒక్కసారిగా ప్రొద్దుటూరు రాజకీయాలు వేడెక్కాయి. 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ (ramesh yadav birthday) పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన అనుచరులు, వైసిపి నాయకులు ప్రొద్దుటూరులో భారీగా ప్లెక్సీలు ఏర్పాటుచేసారు. అయితే ఈ ఫ్లెక్సీలో వైసిపికే చెందిన స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి (rachamallu shivaprasad reddy) ఫోటో లేకపోవడం వివాదానికి కారణమయ్యింది. తమ నాయకుడిని అవమానించేలా ఫోటో లేకుండా ప్లెక్సీలు ఏర్పాటుచేశారంటూ ఎమ్మెల్యే వర్గీయులు ఆగ్రహించారు. ఈ క్రమంలోనే ప్లెక్సీలను చించివేసారు.

అంతటితో ఆగకుండా ఎమ్మెల్సీ రమేష్ వర్గానికి చెందిన దుగ్గిరెడ్డి పై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసారు. పరిస్థితి చేయిదాటేలా ఉద్రిక్తంగా మారుతుండటంతో అప్రమత్తమైన పోలీసులు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వర్గీయులను సముదాయించి పంపిచేసారు. దీంతో అప్పటికి పరిస్థితి సద్దుమణిగింది. అయినప్పటికి ప్రొద్దుటూరు పోలీసులు బందోబస్తు కొనసాగించారు. 

గతంలో కూడా ఎమ్మెల్యే రాచమల్లు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మధ్య విబేధాలు బయటపడ్డాయి. ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో రమేష్ యాదవ్ ను గుర్తు తెలియని దుండగుల నుండి చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వచ్చాయి. ప్రొద్దుటూరు రాజకీయాల్లో తలదూర్చవద్దని... ఈ నియోజకవర్గాన్ని వదిలి వెళ్లిపోవాలని బెదిరించారట. పలుమార్లు ఇలా బెదిరింపు కాల్స్ రావడంతో రమేష్ యాదవ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసాడు.  

అయితే ఇలా ఎమ్మెల్సీని బెదిరించింది స్థానిక వైసిపి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వర్గీయులేనని ప్రచారం జరిగింది. దీంతో ఎమ్మెల్యే రాజమల్లు స్పందిస్తూ...  తనకు రమేష్ యాదవ్ తో ఎలాంటి వైరం లేదని పేర్కొన్నాడు. రాజకీయంగానే కాదు వ్యాపార పరంగానూ రమేష్ యాదవ్ తో విబేధాలు లేవని... అలాంటిది ఆయనను బెదిరించాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. 

అయితే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కు బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం సీఎం జగన్ దృష్టికి వెళ్లింది. దీంతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ తమతమ వర్గీయులను అదుపులో పెట్టుకోవాలని... పార్టీకి నష్టం చేకూర్చేలా వ్యవహరించకూడదని సీఎం సూచించినట్లు ప్రచారం జరిగింది.

తాజాగా మరోసారి ఎమ్మెల్సీ పుట్టినరోజు సందర్భంగా మరోసారి ప్రొద్దుటూరు రాజకీయాలు వేడెక్కాయి. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఎమ్మెల్సీ వర్గీయులు ప్లెక్సీలు ఏర్పాటుచేయడం.... వాటిని ఎమ్మెల్యే వర్గీయులు చించేయడంతో వైసిపిలో అలజడి మొదలయ్యింది. ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుందోనని ఇరు వర్గాలే కాదు ప్రొద్దుటూరు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

అయితే ముఖ్యమంత్రి సొంత జిల్లాకు చెందిన వైసిపి నాయకుల గొడవ రాజకీయంగా చర్చకు దారితీసింది. ఎమ్మెల్సీ,ఎమ్మెల్యే వర్గీయుల గొడవకు దారితీసిన పరిస్థితులపై వైసిపి అధిష్టానం ఆరా తీస్తున్నట్లు సమాచారం.  


 

click me!