ప్రియాంక ఆత్మహత్యతో నాకెలాంటి సంబంధం లేదు: ప్రభుత్వ చీఫ్ విప్ వివరణ

By Arun Kumar PFirst Published Dec 28, 2020, 10:48 AM IST
Highlights

వాస్తవాలు తెలుసుకోకుండా, ఎటువంటి సంబంధం లేని అంశంలో తన ప్రమేయం ఉందంటూ టిడిపి ఎమ్మెల్సీ సంధ్యారాణి  నిరాధార ఆరోపణలను చేశారని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

రాయచోటి పట్టణంలో ప్రియాంక అనే యువతి ఆత్మహత్యాయత్నంతో తనకు సంబంధముందంటూ టీడీపీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి చేసిన ఆరోపణలపై ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఖండించారు. వాస్తవాలు తెలుసుకోకుండా, ఎటువంటి సంబంధం లేని అంశంలో తన ప్రమేయం ఉందంటూ సంధ్యారాణి  నిరాధార ఆరోపణలను చేశారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

''సంధ్యారాణి ఆరోపిస్తున్నట్టు ప్రియాంకను మోసం చేసిన రాజశేఖర రెడ్డి నా అనుచరుడు అన్నది శుద్ధ అబద్ధం. రాజశేఖరరెడ్డి ఎవరో కూడా నాకు తెలియదు, కనీసం పరిచయం కూడా లేదు. నాకు ఎటువంటి సంబంధం లేని వ్యవహారంలో.. నా పాత్ర ఉందంటూ, నాపై లేనిపోని ఆరోపణలు చేసి, నా పరువుకి భంగం కలిగించిన గుమ్మడి సంధ్యారాణిపై చట్టపరంగా, న్యాయపరంగా చర్యలు తీసుకుంటాను'' అని హెచ్చరించారు. 

''నా నియోజకవర్గానికి చెందిన ప్రియాంక అనే యువతి ప్రేమించి పెళ్ళి చేసుకోవడం, ఆ తర్వాత  ఆత్మహత్యాప్రయత్నం చేసి కోమాలోకి వెళ్ళడం పట్ల మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరం స్పందిస్తాం. ఇటువంటి ఘటనలు జరగడం చాలా బాధాకరం, దురదృష్టకరం. ఈ కేసులో నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంతోపాటు, నిందితులను రిమాండ్ కు పంపటం కూడా జరిగింది. ఈ వ్యవహారంలో పోలీసులు స్పందించిన తీరుపై వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలి'' అని సూచించారు. 

''ప్రియాంక ఆత్మహత్యను తీసుకొచ్చి, నాకు చుట్టడం అంటే అంతకంటే దిగజారుడు రాజకీయం మరొకటి ఉండదు. ఈ వ్యవహారంలో నా జోక్యం ఉందని ప్రియాంక తల్లిదండ్రులుతో చెప్పించినా.. దేనికైనా నేను సిద్ధం.  అయితే తప్పు చేసిన వారు ఎవరైనా, ఎంతటివారైనా శిక్షార్హులే. తప్పు చేసిన వారిని రక్షించటానికి ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాదు. జగన్ మోహన్ రెడ్డిగారి ప్రభుత్వంలో తప్పు చేసిన వారు ఎవరూ తప్పించుకోలేరు'' అన్నారు.

''టీడీపీ నాయకులు చిల్లర రాజకీయాలను ఇకనైనా మానుకుంటే మంచిది. ఇంతగా దిగజారి, నీచ రాజకీయాలను చేస్తున్న మిమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించడు. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పత్రికా ప్రకటనలు ఇచ్చి, నా పరువు ప్రతిష్టలకు భంగం కలుగజేసినందుకు గుమ్మడి సంధ్యారాణికి లీగల్ నోటీసులు పంపిస్తున్నాను'' అని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.

click me!